ltrScrptTheme3

వరం‘కల్లు’!

Oct 18 2021 @ 00:34AM
ఇటీవల వరంగల్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న కృత్రిమ కల్లు ప్యాకెట్లు, వరంగల్‌లోని లక్ష్మీపురంలో కృత్రిమ కల్లును పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్‌)

నగరంలో జోరుగా కృత్రిమ కల్లు దందా

ప్రమాదకర రసాయనాలతో తయారీ

పాత డిపోలే అడ్డాలుగా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు

పేదవర్గాల వారే లక్ష్యంగా కాంట్రాక్టర్ల అక్రమ వ్యాపారం

టాస్క్‌ఫోర్స్‌ దాడులతో వెలుగులోకి బాగోతం


వరంగల్‌ మహానగరంలో కల్లు దందా జోరుగా సాగుతోంది. సులభంగా డబ్బు సంపాదించేందుకు అలవాటుపడిన కొందరు వ్యక్తులు ఒక జట్టుగా ఏర్పడి అక్రమ వ్యాపారానికి తెరతీశారు. గతంలో కల్లు డిపోను నిర్వహించిన ప్రదేశాన్ని అడ్డాగా చేసుకుని దందాను నిర్వహిస్తున్నారు. ప్రాణాంతక రసాయనాలతో కల్లును తయారు చేస్తున్నారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా కృత్రిమ కల్లును కూలీలు అధికంగా ఉండే ప్రాంతాలకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు. ఈ కల్లును తాగిన వ్యక్తులు అనారోగ్యానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 


వరంగల్‌ క్రైం, అక్టోబరు 17: వరంగల్‌ నగరంలోని లక్ష్మీపురం, దేశాయిపేట, రైల్వేగేట్‌, లేబర్‌కాలనీ, కాశీబుగ్గ, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌, ఉర్సు కరీమాబాద్‌, రంగశాయిపేట సమీపంలోని పలుప్రాంతాల్లో గతంలో కల్లు విక్రయాలు కొనసాగేవి. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్‌ ఆధారంగా కల్లుడిపోలు నిర్వహించేవారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కల్తీ కల్లు విక్రయాలు జరిగేవి. ఇదే తరుణంలో గుడుంబా తయారీ, అమ్మకాలు విచ్చలవిడిగా జరిగేవి. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వరంగల్‌ నగరంలో పర్యటించారు. ఈసందర్భంగా పెద్దసంఖ్యలో మహిళలు గుడుంబా, కల్తీకల్లు విక్రయాలను నిషేధించాలని సీఎంను కోరారు. దీంతో ఆయన నల్లబెల్లం, గుడుంబా, కల్తీ కల్లు తయారీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 


ఉక్కుపాదం

ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌, పోలీస్‌ యంత్రాంగం నల్లబెల్లం, గుడుంబా, కల్తీకల్లుపై ఉక్కుపాదం మోపింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు అవినీతి దందాకు తెరతీశారు. రసాయనాలతో కల్లును తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం అక్రమార్కులను గుర్తించి అరెస్ట్‌ చేస్తోంది. మరికొందరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుశిక్ష విధిస్తోంది. అయినా కేటుగాళ్లు వీలుచిక్కినప్పుడల్లా పోలీసుల కళ్లుగప్పి అక్రమాలకు పాల్పడుతున్నారు. 


రసాయనాలతో..

గతంలో కల్లుడిపోలు నిర్వహించిన వారే అక్రమ దందాను నిర్వహిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కల్లు డిపోలనే అడ్డాగా చేసుకుని కల్లు తయారీ, విక్రయాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏజెంట్ల ద్వారా రసాయనాల పదార్థాలు తెప్పించుకుని కృత్రిమ కల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. కల్లు ప్రియులు ఈ వ్యసనానికి అలవాటయ్యేందుకు గానూ ప్రాణాంతక రసాయనాలైన ఆల్ఫోజోలం, క్లోరోహైడ్రెట్‌, క్లోరోఫామ్‌, అమ్మోనియంలాంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం కాశీబుగ్గ సమీపంలోని లక్ష్మీపురం కల్లు తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్‌ చేశారు. దీంతో కొంతకాలంగా సాగుతున్న అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది.  


దుష్ప్రభావాలు 

రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లు తాగితే అనేక దుష్ప్రభావాలు సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతకమైన ఆల్ఫోజోలం, అమ్మోనియా, క్లోరోహైడ్రెట్‌ ద్రావ ణాలు కల్లులో కలపడంతో అది తాగేవారికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. రసాయనాలతో తయారు చేసిన కల్లు వ్యసనపరులకు దొరకని సమయంలో వింతవింతగా ప్రవర్తిస్తారంటున్నారు. కొందరు కత్తులతో పొడుచుకోవడం, చేతులు కోసుకోవడం, తలను గోడకు బాదుకోవడంలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బాధిత వ్యక్తులు శారీరకంగా, మానసికంగా పలు సమస్యలు ఎదుర్కొవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసుకునేవరకు వెళ్తున్న ఘటనలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. కల్తీ కల్లును నియంత్రించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యులు సూచిస్తున్నారు. 


దాడులు 

2018లో లక్ష్మీపురం కల్లు డిపోపై టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌ పోలీసులు దాడి నిర్వహించారు. అక్కడ పెద్దమొత్తంలో ఆల్ఫోజోలంతోపాటు ఇతర రసాయనిక పదార్థాలు సీజ్‌ చేశారు. అంతేగాకుండా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కల్లు తయారు చేస్తున్న సారంగపాణి, సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే ఇటీవల ఇదే డిపోపై దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పాత నేరస్థుడు సారంగపాణి మాత్రం తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిలో ప్రధాన నిందితుడు కామారెడ్డికి చెందిన నాగేంద్ర వరంగల్‌లోని రంగశాయిపేట గవిచర్ల క్రాస్‌రోడ్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని ఈ దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి వద్ద రసాయనికి పదార్థాలు స్టాక్‌ చేసుకుని వీలును బట్టి డిపోకు తరలించి కృత్రిమ కల్లును తయారు చేసి కూలీ అడ్డాల వద్ద విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా, తప్పించుకున్న సారంగపాణి పట్టుపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

కృత్రిమ కల్లు డిపోలో దాడులు చేస్తున్న పోలీసులు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.