
భర్త చిత్రహింసలు భరించలేక, అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది మహిళలు చనిపోతున్నారని తరచుగా వార్తల్లో చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్‌లో ఇందుకు విభిన్నమైన ఘటన జరిగింది. భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య తన జీతం డబ్బులు లాగేసుకొని పుట్టింటికి పంపిస్తోందని, రోజూ చిత్రహింసలు పెడుతోందని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ధార్ పట్టణానికి చెందిన దీపక్ స్థానికంగా ఉన్న ఓ కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతని భార్య టీనా గృహిణి. చాలా కాలం కిందటే పెళ్లి చేసుకున్న వీరికి పిల్లలు లేరు. పెళ్లైన నాటి నుంచే వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. భర్తను టీనా తరచుగా డబ్బుల కోసం వేధించేది. జీతం వచ్చిన వెంటనే మొత్తం డబ్బులను లాగేసుకుని తన పుట్టింటికి పంపించేది. గట్టిగా అడిగితే దాడి చేసిది. అన్నాదమ్ముళ్లను పిలిపించి కొట్టించేది.
ఆమె ఎంతకూ మారకపోవడంతో దీపక్ విసిగిపోయాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడి జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. భార్య పెట్టే చిత్రహింసల గురించి దీపక్ ఆ లేఖలో ప్రస్తావించాడు. ఆమె వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశాడు. సోదరుడు శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టీనా, ఆమె సోదరులపై కేసు నమోదు చేశారు.