గునుపూడిలో వేడెక్కిన రాజకీయ వాతావరణం!

ABN , First Publish Date - 2022-05-24T06:40:56+05:30 IST

మండలంలోని గునుపూడిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇక్కడి పరిస్థితులపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పార్టీల దిమ్మల ఏర్పాటుపై చిచ్చు రేగడంతో ఎటు వంటి గొడవలు జరగకుండా పోలీసులు రాత్రి వేళల్లో పహారా కాస్తున్నారు.

గునుపూడిలో వేడెక్కిన రాజకీయ వాతావరణం!
చిచ్చురేపుతున్న పార్టీల జెండాల దిమ్మలు


  పరదేశమ్మ గుడి ఎదురుగా 20న వైసీపీ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే గణేశ్‌

  ఆ రాత్రే టీడీపీ, జనసేన జెండాల ఏర్పాటుకు  సన్నాహాలు .. టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

  నాటి నుంచి గ్రామంలో  గొడవలు తలెత్తకుండా  ముందస్తుగా రాత్రి వేళ పహారా

నాతవరం, మే 23 : మండలంలోని గునుపూడిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇక్కడి  పరిస్థితులపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పార్టీల దిమ్మల ఏర్పాటుపై చిచ్చు రేగడంతో ఎటు వంటి గొడవలు జరగకుండా పోలీసులు రాత్రి వేళల్లో పహారా కాస్తున్నారు. ఇదంతా చూస్తున్న గ్రామ స్థులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతు న్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివి. ఈ నెల 20వ తేదీన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ గునుపూడిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరదేశమ్మ గుడి ఎదురుగా దిమ్మ ఏర్పాటు చేయడంతో వైసీపీ జెండాను కార్యకర్తల సమక్షంలో ఎగురవేశారు. దీంతో ఆ రోజే టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఏ పార్టీ జెండా ఏర్పాటు చేయకూడదని, గ్రామ పెద్దలంతా గత ఏడాది తీర్మానం చేశా రని వివరించారు. అయితే ఆ తీర్మానాన్ని ఉల్లంఘించి వైసీపీ దిమ్మ కట్టి, జెండా ఎగురు వేయడం ఏమిటని వారు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఇదిలావుంటే,  ఆ రాత్రే టీడీపీ, జనసేన శ్రేణులు ఆయా జెండాలు ఎగుర వేసేందుకు చకచకా ఏర్పాట్లు చేయగా, పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఉంటే టీడీపీ, వైసీపీ, జనసేన దిమ్మలు, జెండాలు ఉండాలని లేనిపక్షంలో అప్పటి గ్రామ పెద్దల తీర్మానం మేరకు ఏ పార్టీ జెండా లేకుండా చూడాలని టీడీపీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ పరిష్కారం చూపలేదని వారు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-05-24T06:40:56+05:30 IST