‘సర్వే’తో తేల్చేస్తా!

ABN , First Publish Date - 2022-06-09T07:50:34+05:30 IST

నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతల పనితీరుపై జరిపించిన సర్వే ఆ పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీల బలాబలాలు,

‘సర్వే’తో తేల్చేస్తా!

ఆ సమాచారం ఆధారంగా సమీక్షలు

పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే!

మూడేళ్లయినా కదలకుంటే కుదరదు

మారని వారిపై కఠిన చర్యలు తప్పవు

సమీక్షల సందర్భంగా బాబు హెచ్చరికలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతల పనితీరుపై జరిపించిన సర్వే ఆ పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీల బలాబలాలు, విజయావకాశాల జోలికి పోకుండా...  నియోజకవర్గ స్థాయిలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న నేతల తీరు, దిగువ స్థాయి నేతలతో వారి సంబంధాలు, ఇతర అంశాలపైనే ఈ సర్వే జరిగింది. నియోజకవర్గాల్లో పెద్దగా తిరగకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న నేతలకు ఈ సర్వే వ్యవహారం గుబులు పుట్టిస్తోంది. ఈ సర్వేలో వచ్చిన సమాచారం ఆధారంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గత కొద్ది రోజులుగా జిల్లాల ఇన్‌చార్జులతో సమీక్షలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై సమాచార సేకరణకు టీడీపీ ఇటీవల ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా కొన్ని బృందాలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ పార్టీ నేతల పనితీరుపై సమాచారం సేకరించాయి. మండల స్థాయి వరకూ నాయకుల పనితీరు, పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైనం, ఎవరెవరు పాల్గొంటున్నారు, వర్గ విభేదాలు, ఇన్‌చార్జికి ఇతర నేతలతో ఉన్న సంబంధాలు, పార్టీ పటిష్ఠతకు చేస్తున్న కృషి తదితర అంశాలపై సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. గతంలో పార్టీ తరఫున సమాచార సేకరణకు వెళ్లే వ్యక్తులు అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న నేతలను కలిసి మాట్లాడేవారు.


ఈసారి అటువంటిదేమీ జరగలేదు. ఇతరత్రా మార్గాల్లోనే సమాచారాన్ని సేకరించారు. దీని ఆధారంగా బుధవారం వరకు 7 పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షలు జరిపారు. నియోజకవర్గాల పరిశీలకులు, జోన్ల ఇన్‌చార్జుల్లో ఎక్కువ మంది తమకు కేటాయించిన జిల్లాల్లో ఇంతవరకూ పెద్దగా పర్యటించలేదని తేలింది. ఇకపై నెలలో పది రోజులైనా తమకు కేటాయించిన పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించాలని, మండల స్థాయి వరకూ వెళ్లి  అక్కడి పరిస్థితులు పరిశీలించాలని ఆయన వారిని ఆదేశించారు. తాను తెప్పించిన సమాచారంలో ముఖ్యాంశాలను వారికి వివరించి... దానిపై మరిన్ని వివరాలతో రావాలని ఆదేశిస్తున్నారు. ‘‘ఇన్‌చార్జులు, నియోజకవర్గ ముఖ్య నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తుంటే వారికి గట్టిగా చెప్పండి! మూడేళ్ల తర్వాత కూడా ఇంకా కదలకుండా కూర్చుంటామంటే కుదరదు. ముఖ్య నేతలు చురుగ్గా ఉంటేనే కింది క్యాడర్‌ మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. కొంత మంది నేతలు నియోజకవర్గంలో ఉండకుండా ఎక్కడో ఉండి అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వెళ్తున్నారు. అది కూడా కుదరదు. వారికి వీలుకాకపోతే పక్కకు తప్పుకోమనండి. మరొకరు వచ్చి పనిచేస్తారు.


గ్రూపు తగాదాలను కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. కలిసి పనిచేయకుండా తగాదాలతో క్యాడర్‌ను ఇబ్బందిలో పడేస్తే చూస్తూ ఊరుకోవద్దు. తప్పు ఎవరిదైనా గట్టిగా చెప్పండి. మార్పు రాకపోతే ఒకరిద్దరిని పార్టీ నుంచి బయటకు పంపేయడానికి కూడా వెనకాడేది లేదు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో పార్టీ సమయాన్ని వృథా చేస్తే సహించేది లేదు. సమస్యలు ఏవైనా ఉంటే మీ స్థాయిలో పరిష్కరించండి. మరీ పెద్దదైతే నాకు చెప్పండి. కానీ... వాటిని పేర్చుకొంటూ పోవద్దు’’ అని ఆయన వారికి సూచించారు. అధినాయకత్వం గట్టిగా ఉండటం లేదన్న అభిప్రాయం కింది స్థాయిలో శ్రేణుల్లో ఉందని, ఒకటి రెండు చోట్ల కఠిన చర్యలు అవసరమని ఒక మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. దీంతో చంద్రబాబు ఏకీభవించారు. తన సర్వేలు ఇక ముందు కూడా  కొనసాగుతాయని, మార్పు కనిపించకపోతే తానేమిటో చూపిస్తానని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Updated Date - 2022-06-09T07:50:34+05:30 IST