హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ.. సుందర్ బౌలింగ్ చేసే స్థితిలో లేడన్న కోచ్

ABN , First Publish Date - 2022-05-03T01:06:26+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం

హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ.. సుందర్ బౌలింగ్ చేసే స్థితిలో లేడన్న కోచ్

పూణె: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హైదరాబాద్ ఏకైక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేయలేని స్థితిలో ఉన్నట్టు ఆ జట్టు ప్రధాన కోచ్ టామ్ మూడీ వెల్లడించాడు. సీఎస్కే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మార్కో జాన్సన్ వేసిన నాలుగో బంతిని గైక్వాడ్ లెగ్ సైడ్ ఆడాడు. బౌండరీ దిశగా వెళ్తున్న బంతిని సుందర్ డైవ్ చేసి ఆపాడు. ఈ క్రమంలో అతడి బౌలింగ్ చేతికి గాయమైంది. దీంతో డగౌట్‌కు వెళ్లిన సుందర్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. 


పవర్ ప్లే తర్వాత సుందర్‌తో బౌలింగ్ చేయించాలని కెప్టెన్ కేన్ భావించినప్పటికీ గాయం తీవ్రత కారణంగా సుందర్ డగౌట్‌కే పరిమితమయ్యాడు. దీంతో పార్ట్‌టైమ్ బౌలర్లు మార్కరమ్, శశాంక్‌తో బౌలింగ్ చేయించాడు. చెన్నైకి ఇది బాగా కలిసొచ్చింది. సుందర్ బ్యాటింగ్‌కు దిగినప్పటికీ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. గాయం తీవ్రంగా ఉండడంతో ఢిల్లీతో జరిగే తర్వాతి మ్యాచ్‌కు సుందర్ అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది. సుందర్‌కు గతంలో అదే చేతికి గాయమై తగ్గిందని, ఇప్పుడు మళ్లీ అదే చేయికి దెబ్బతగలడం దురదృష్టకమరని మూడీ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు బౌలింగ్ చేయలేని స్థితిలో ఉన్నాడని, జట్టుపై ఈ ప్రభావం ఉంటుందని అన్నాడు. 



Updated Date - 2022-05-03T01:06:26+05:30 IST

Read more