సుందర్‌కు ప్యాడ్‌లు.. అప్పుడు కొన్నాం..!

ABN , First Publish Date - 2021-01-24T10:21:44+05:30 IST

గాబా టెస్ట్‌తో అరంగేట్రం చేసిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తన తొలి మ్యాచ్‌లోనే ..

సుందర్‌కు ప్యాడ్‌లు.. అప్పుడు కొన్నాం..!

న్యూఢిల్లీ: గాబా టెస్ట్‌తో అరంగేట్రం చేసిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తన తొలి మ్యాచ్‌లోనే కీలక అర్ధ శతకంతో ఆకట్టుకొన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయడానికి సుందర్‌ వద్ద తెల్లటి ప్యాడ్‌లు కూడా లేవన్న విషయాన్ని టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ బయటపెట్టాడు. మ్యాచ్‌ మొదలైన తర్వాతే సుందర్‌కు సరిపడా ప్యాడ్‌లను ఖరీదు చేసినట్టు చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే సెలెక్టయిన సుందర్‌.. టెస్ట్‌ల్లో నెట్‌ బౌలర్‌గా కొనసాగాడు. అశ్విన్‌ గాయపడడంతో సుందర్‌కు అనూహ్యంగా టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కింది. కానీ, బ్యాటింగ్‌ చేయడానికి అతడి వద్ద తెల్లటి ప్యాడ్‌లు లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న వాటిని ప్రయత్నించినా సరిపోలేదని శ్రీధర్‌ చెప్పాడు. ‘సుందర్‌ వద్ద రంగు ప్యాడ్‌లు మాత్రమే ఉన్నాయి. అతడు పొడగరి కావడంతో మావద్ద ఉన్నవి సెట్‌ కాలేదు. ఆస్ట్రేలియా టీమ్‌ వద్ద నుంచి తీసుకొందామంటే.. ఎవరి దగ్గరా అదనంగా లేవన్నారు. ఇక చేసేదేం లేక మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత సుందర్‌ కోసం ప్యాడ్‌లు కొనడానికి వెళ్లాల్సి వచ్చింద’ని శ్రీధర్‌ తెలిపాడు. 

Updated Date - 2021-01-24T10:21:44+05:30 IST