కొత్తపల్లి మండలం యండపల్లిలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం

ABN , First Publish Date - 2022-06-27T07:12:27+05:30 IST

కొత్తపల్లి మండలం యండపల్లిలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం

కొత్తపల్లి మండలం యండపల్లిలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం

  • చెత్త సంపద కేంద్రాలపై.. చిత్తశుద్ధి ఏది?
  • లక్షలు వెచ్చించినా నిరుపయోగం
  • వర్మి ఎరువు కొనేవారు ఎవరు
  • అరకొర వేతనాలతో ముందుకు రాని కార్మికులు

గ్రామ పంచాయతీల్లో ఉన్న చెత్తాచెదారాన్ని వినియోగించి ఆదా య మార్గాలను రూపొందించాలనే లక్ష్యంతో ఏర్పా టు చేసిన చెత్త సంపద కేంద్రాలపై చిత్తశుద్ధి కరువైంది. లక్షలాది రూపాయి లు వెచ్చించి నిర్మించిన ఈ కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన వర్మి కొనేవారు లేకపోవడంతోపా టు పనిచేసేందుకు కార్మికులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

పిఠాపురం, జూన్‌ 26: గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్తను సేకరించి తడి, పొడి చెత్తగా వేరుచేయడంతోపాటు వాటినుంచి వర్మి కంపోస్టు(ఎరువులు) తయారు చేయడం, సదరు వర్మిని రైతులకు విక్రయించడంతో ఆదాయాన్ని సమకూర్చడం లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా ఆధారంగా చెత్త సంపద తయారీ కేంద్రాల నిర్మాణానికి నిధులు కేటాయించారు. చిన్న పంచాయతీల్లో రూ.3-4లక్షలు, మధ్య తరహా పంచాయతీల్లో రూ.7-8లక్షలు, మేజర్‌ పంచాయతీల్లో రూ.12-13లక్షలు మంజూరు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1013 పంచాయతీలు ఉండగా వీటిలో 70శాతం పంచాయతీల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.

ట్రాక్టర్లు, రిక్షాలు ఏర్పాటు

చెత్తసంపద కేంద్రాలు ఉన్న చోట 6వేల జనాభా దాటిన పంచాయతీల కు ట్రాక్టర్లు, అంత కంటే తక్కువ జనాభా ఉంటే రిక్షాలు సమకూర్చారు. వీటికి అదనంగా తడి, పొడి చెత్త సేకరించేందుకు ప్రత్యేక వాహనాలు సమకూర్చారు. ప్రతి వేయి మందికి ఒక కార్మికుడిని నియమించుకునేందుకు అను మతులు ఇచ్చారు. వీరికి వేతనంగా రూ.6వేల చొప్పున ప్రభుత్వమే ఇస్తుందని అప్పట్లో ప్రకటించారు. వీరు ఇంటింటా చెత్త సేకరించడంతోపాటు దాన్ని సంపద తయారీ కేంద్రంలో తడి, పొడి చెత్తగా, ఇతర వ్యర్థాలుగా వేరు చేయ డం, వర్మి కంపోస్టు తయారీ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ తయారైన వర్మి కంపోస్టును రైతులకు, ఇతరులకు విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. ఈ కేంద్రాలు ప్రారంభమై పనిచేస్తున్న సమయానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వీటిని చిన్నచూపు చూశారు. ఇప్పుడు సగానికి పైగా కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదు. పనిచేసినా నామమాత్రంగానే చెత్త వేరు చేయడం, వర్మీ తయారీ వంటి పనులు నిర్వహిస్తున్నారు.

అన్ని సమస్యలే

చెత్త సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, అవసరమైన కార్మికుల నియామకం జరగకపోవడం ప్రధాన లోపంగా మారింది. 80శాతంపైగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డులు లేవు. దీనితో నేరుగా చెత్తను తయారీ కేంద్రాల వద్దకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటోంది. అక్కడ చోటు లేక బయటే చెత్తను డంప్‌ చేస్తున్నారు. తయారీ కేంద్రం నిర్మించినా వర్మి ఎరువు నిల్వ చేసేందుకు ఎటువంటి ప్రదేశం లేకపోవడం, తయారు చేసిన వర్మి కంపోస్టును కొనేందుకు రైతులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో పలుచోట్ల వర్మి తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్నిచోట్ల నామమాత్రంగా తడి, పొడి చెత్త వేరు చేస్తున్నట్లు, వర్మీ తయారీ చేస్తున్నట్లు చూపుతున్నారు.

కార్మికుల వేతన బకాయిలు

సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు తర్వాత ప్రతి వెయ్యిమందికి నియమించిన కార్మికులకు ప్రతినెలా రూ.6వేల వంతున వేతనం ఇస్తామని ప్రకటించారు. ఈ వేతనానికి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల గ్రామపంచాయతీ నిధులను జత చేసి అదనంగా చెల్లిస్తున్నారు. ఈ వేతనాలు నాలుగైదు నెలలకు ఒకసారి వస్తుండడంతో కార్మికులు మధ్యలోనే మానివేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంగా రూ.18వేలు చెల్లించాల్సి ఉన్నా ఆ విధంగా చేయకపోవడంతో కార్మికులు పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. తన పరిధిలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి తడి, పొడి చెత్తగా వేరుచేసి వర్మీ తయారీ వరకూ అతడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. తక్కువ వేతనంతో ఇంత పని ఎలా చేస్తామని కార్మికులు ప్రశ్నిస్తున్నారని పలువురు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. పలుచోట్ల కార్మికులు లేక కేంద్రాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయి.

పేరుకున్న ఎరువుల నిల్వలు

పలు కేంద్రాల్లో వర్మి ఎరువుల నిల్వలు పేరుకుపోయాయి. వీటిని విక్రయించేందుకు పంచాయతీలకు తోడ్పాటు అందించాల్సిన అధికారులు ఆ బాధ్యతను స్థానిక సిబ్బందిపైనే పెడుతున్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాల పనితీరు తనిఖీకి వస్తున్న ఉన్నతాధికారులు ఎవరు ఇక్కడ సమస్యలపై దృష్టిసారించకపోవడంతో వీటి ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికులకు పంచాయతీ, మునిసిపల్‌ పారిశుధ్య కార్మికుల మాదిరి కనీస వేతనాలు చెల్లించడంతోపాటు డంపింగ్‌యార్డుల ఏర్పాటు, వర్మి ఎరువు వినియోగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే చెత్త సంపద కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-06-27T07:12:27+05:30 IST