పాడి–పశువులపై వృథా వ్యయాలు!

ABN , First Publish Date - 2021-04-06T05:56:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుల తీరు అనూ హ్యంగా, అగమ్యగోచరంగా ఉంటోంది! వాస్తవాలతో ఏమాత్రమూ పొంతన లేని రీతిలో వారి అంచనాలు...

పాడి–పశువులపై వృథా వ్యయాలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుల తీరు అనూ హ్యంగా, అగమ్యగోచరంగా ఉంటోంది! వాస్తవాలతో ఏమాత్రమూ పొంతన లేని రీతిలో వారి అంచనాలు, ఊహలు ఉంటున్నాయి. వారి ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ నాలుగు కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో సుమారు ఒక కోటి లీటర్లు గ్రామాలలో రైతులు, అక్కడి హోటల్స్‌ వారు వినియోగిస్తున్నారు. సహకార డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలు సుమారు మరొక కోటి లీటర్లు సేకరిస్తున్నాయి; అవి పోను మిగిలిన రెండు కోట్ల లీటర్ల పాలను, అమూల్‌ డెయిరీ వారి కోసం, మన మహిళారైతు భరోసా కేంద్రాలు సుమారు పదివేల గ్రామాలలో సేకరిస్తాయి. తద్వారా ప్రతిరోజూ మన మహిళా పాడిరైతులకు 80 నుంచి 90 కోట్ల రూపాయల లబ్ధిని సమకూర్చవచ్చు. ఇవి భేషైన అంచనాలు, పసందైన ప్రణాళికలేననడంలో సందేహం లేదు. 


అయితే అసలు నిజమేమిటి? ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో 3కోట్ల 40 లక్షల తెల్ల పశువులు, 6 లక్షల 20వేల గేదె జాతి పశువులు ఉన్నాయి. వాటి నుంచి ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే మొత్తం పాలు కోటి నుంచి కోటి 20 లక్షల లీటర్లకు మించే అవకాశాలు లేవు. వాటిలో గ్రామస్థాయిలో వినియోగం, ప్రైవేట్, సహకార డెయిరీల పాలసేకరణ, చిన్నస్థాయి సంప్రదాయ పాలవ్యాపారులు సేకరించే పాలు సుమారు 60నుంచి70 లక్షల లీటర్ల మేరకు ఉంటాయి. ప్రతిపాదిత అమూల్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రైతు భరోసా కేంద్రాలు ఎంత సమర్థంగా కృషిచేసినప్పటికీ గరిష్ఠంగా సేకరించగలిగే పాలు 35 నుంచి 40 లక్షల లీటర్లకు మించవని స్పష్టంగా చెప్పగలను. అమూల్‌ డెయిరీ వారు రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించే పాలకు ప్రభుత్వ ఖజానా నుంచి లీటరుకు అదనంగా 4 నుంచి 7 రూపాయలు చెలిస్తున్నారు. ఆ సొమ్ములో సగమైనా మన పాల సహకారసంఘాల ఉత్పత్తిదారులకు వారి బ్యాంకు ఖాతాల ద్వారా అందివ్వడం ఎంతో శ్రేయస్కరమవుతుంది. ఇలా చేయడం వల్ల మనం 40 ఏళ్లుగా నిర్మించుకుంటున్న పాడి సహకార వ్యవస్థ బలోపేతమవుతుంది. మరి ఈ మంచి ఆలోచన మన పాలకులకు ఎందుకు రావడం లేదు? ఇప్పటికే కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అమూల్‌వారు రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న పోటీ పాలసేకరణ కేంద్రాల వల్ల అనేక గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 డిసెంబర్ 1న ప్రకాశం జిల్లా ఒంగోలు డెయిరీని మూసివేస్తున్నట్లు ఆ సంస్థ పాలకవర్గం ఏకపక్ష తీర్మానం చేసి ప్రకటించింది. ఇది, సహకారస్ఫూర్తికి విరుద్ధమేకాక పూర్తిగా అప్రజాస్వామికం కూడా!


రెండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలలో పాల విక్రయ మార్కెట్లోకి ప్రవేశించిన అమూల్ సంస్థ తన ఆర్థిక శక్తితో తొలుత పాలను తక్కువ ధరకు విక్రయించింది. తద్వారా మన రాష్ట్ర డెయిరీల పాలవిక్రయ ధరతో పాటు సేకరణ ధరలుకూడా భారీగా పతనమయ్యేట్లు చేసి లక్షలాది పాడిరైతులకు నష్టం కలిగించింది. ఇంత చేసిన అమూల్‌ డెయిరీతో మన ప్రభుత్వమే చేతులు కలపడం శోచనీయం! ఇప్పటికే ప్రభుత్వం పాల ఉత్పత్తిదారులకు ప్రకటించిన అదనపు మొత్తాల చెల్లింపులు కోట్లకుపైగా నిలిచిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తాత్కాలికంగా ఈ బకాయిల చెల్లింపులు కొంతమేరకు జరిగినప్పటికీ, ఈ విధానం దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. సహకార డెయిరీలు, ప్రత్యర్థుల డెయిరీ వ్యాపారాలు నష్టాలతో మూతపడిన వెంటనే పాలకులు ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడం ఖాయం. అంతేకాక ఇప్పటికే ఇస్తున్న కొనుగోలు ధరలను అమూల్‌ సంస్థ గణనీయంగా తగ్గించే ముప్పు కూడా ఉంది. 


ఇక మన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన సంచార పశువైద్యసేవల పథకం (అంబులెన్స్ సేవలు) విషయం చూద్దాం. 1970లలోనే అటువంటి పథకం ఒకటి ఘోరంగా విఫలమైంది. బహుకొద్ది పశువైద్యశాలలు మాత్రమే ఉన్న ఆ రోజులలో కొన్ని రాష్ట్రాలలో సహకార డెయిరీలు, ప్రైవేటు డెయిరీలు సంచార పశువైద్యసేవలను పాల ఉత్పత్తిదారులకు అందించి ఆదరణ పొందిన మాట వాస్తవమే. కానీ  ఇప్పుడు పూర్తి అవాస్తవ సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అటువంటి సేవలను అందించటానికి అమూల్‌ డెయిరీతో (వాస్తవానికి అమూల్‌ ఫెడరేషన్‌కు అనుబంధమైన సబర్‌కాంత జిల్లా డెయిరీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని వేల కోట్ల పెట్టుబడితో ఐదారు లక్షల పాడిపశువుల్ని పంపిణీ చేసి, అవి ఉత్పత్తి చేసే పాలను రైతుభరోసా కేంద్రాల ద్వారా అమూల్ డెయిరీ సరఫరా చేస్తుందని, పాడి రైతులందరూ ఎంతో ప్రయోజనం పొందగలరని ప్రభుత్వం చెప్పడం ఎంత హాస్యాస్పదం! గత అరవై సంవత్సరాలలో సమైక్యరాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద పంపిణీ చేసిన లక్షలాది పాడిపశువుల వల్ల పాల ఉత్పత్తిగానీ, పాలసేకరణగానీ పెరిగిన దాఖలాలు లేవు. ఒకరి నుంచి వేరొకరికి, ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకు పశువుల్ని బదిలీ చేస్తే, మారిన యాజమాన్యాల వల్ల, సరియైన వసతులు, పోషణ కల్పించలేని లబ్ధిదారుల యాజమాన్యంలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ పాడి పశువులు వారికి గుదిబండలుగా మారిపోయి ఆ తర్వాత వేరొకరికి, ముఖ్యంగా కబేళాలకు, తరలిపోవడం ఖాయం. లబ్ధిదారులకు ఇచ్చిన అప్పులు వసూలు కాక బ్యాంకులకు మొండిబకాయిలు పెరిగిపోవటం లేదా వారికి హామీగా నిలిచిన పాలసహకార సంఘాలు, పాలసేకరణ కేంద్రాలు భారీగా నష్టపోయి మూతపడటం... ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటువంటి పథకాల వల్ల అవినీతి అధికారులు, దళారులు, రాజకీయ నాయకులు ప్రయోజనం పొందారే గానీ నిజమైన లబ్ధిదారులకు జరిగిన మేలు చాలా చాలా తక్కువ. అయినా సెంటు నివాసభూముల లబ్ధిదారులు అంత చిన్న స్థలంలో పశువుల్ని పెంచలేక పాడిపరిశ్రమకు దూరమైతే పాల ఉత్పత్తి ఘోరంగా క్షీణించే ముప్పు కూడా ఉంది. ఇంతేకాక ఒక్కొక్క రైతుభరోసా పాల కేంద్రంలో బల్క్‌మిల్క్‌ కూలర్ల ఏర్పాటు కోసం అదనంగా 1.6 నుంచి 1.7 లక్షల నిధులు ప్రభుత్వమే అవసరమ వుతాయి. ఇంత ధనాన్ని అమూల్‌ వ్యాపార ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం కాకుల్ని కొట్టి గద్దలను మేపినట్లే అవుతుంది. ఇందుకు అయ్యే వ్యయం సుమారు రెండువేల కోట్ల వరకు ఉండవచ్చు. అసలే నాలుగు లక్షల కోట్ల రుణభారంతో ఉన్న రాష్ట్రానికి ఇది అవసరమా?


ఎనిమిదివేలమంది యువజనులకు 4 నెలల పాటు కృత్రిమగర్భోత్పత్తి, పశు ప్రథమచికిత్సలో శిక్షణ ఇప్పించి, వారిని గ్రామ సచివాలయంలో పశువైద్య సహాయకులుగా నియమించి వారి ద్వారా పశువైద్య సేవల్ని అందించాలనే ప్రభుత్వ ఆలోచన అర్థరహితం. కృత్రిమ గర్భోత్పత్తి, పశువైద్యసేవలు ఎంతో సున్నితమైనవి. అజాగ్రత్త, అవగాహనారాహిత్యాలు పశువుల ప్రత్యుత్పత్తికి, పాల ఉత్పత్తికి చేటు కాక పశువుల ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశువైద్యశాలల సంఖ్యలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రతి నాలుగైదు కిలోమీటర్లకు ప్రభుత్వ పశువైద్యశాల లేదా ఆరోగ్యకేంద్రం ఉండగా గోపాలమిత్ర సేవలుకూడా రైతులందరికీ అందుబాటులో ఉన్నాయి. అంతే కాక సహకార డెయిరీలతో పాటు అనేక ప్రైవేటు డెయిరీలు కూడా తమకు పాలను సరఫరా చేస్తున్న పాల ఉత్పత్తిదారుల పశువులకు వైద్య సేవలను నామమాత్రపు ఫీజులతో అందిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా నియమించనున్న ఎనిమిదివేల మంది పశువైద్య సహాయకుల జీతభత్యాలు, రవాణా ఛార్జీలకు గాను సంవత్సరానికి కనీసం వంద కోట్ల రూపాయలైనా ఖర్చవుతుంది. ఇంత ఖర్చు పెట్టినా పశు సంపదకు మేలు కంటే కీడే ఎక్కువగా జరగగలదని ఈ రంగంలో యాభై సంవత్సరాల అనుభవం గడించిన పశువైద్యునిగా నా నమ్మకం. ప్రభుత్వ పశువైద్యులు, వారి సిబ్బంది తాము పని చేసే గ్రామాలలో నివసించి రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటే పశువైద్య సేవల కోసం ఈ సహాయకుల అవసరమే ఉండదు. శాసనసభా నియోజకవర్గ స్థాయిలో ఒక డాక్టరుతో పాటు మరో ఇద్దరు సిబ్బందితో పశువుల అంబులెన్స్‌ను నిర్వహించాలనే ఆలోచనతో 1970లలో మన ప్రభుత్వం భారీ ఖర్చుతో వెటర్నరీ అంబులెన్సుల్ని నడిపినప్పుడు డాక్టరు ఉంటే డ్రైవరు లేక, ఇద్దరూ ఉంటే అసిస్టెంటు లేక వీరంతా ఉంటే డీజిల్‌కు, మరమ్మతులకు నిధులు లేక, సకాలంలో నిధులు విడుదల కాక అవన్నీ అనతికాలంలోనే మూలపడి తుక్కుగా మారాయి. ఆ వాహనాల సిబ్బంది పని లేక జిల్లా కార్యాలయాలలో సమస్యల సృష్టికర్తలుగా మారారు. పెద్దమొత్తం ఖర్చుపెట్టి కొత్తగా వెటర్నరీ అంబులెన్స్‌ను కొనుగోలు చేసే బదులు, ఇటీవల తీవ్ర విమర్శలతో ప్రహసనంగా మారిన రేషన్‌ వాహనాలలో స్వల్ప మార్పులు చేసి పెద్ద వెటర్నరీ హాస్పిటల్సు, వెటర్నరీ పోలీక్లినిక్స్‌ పశువైద్య కళాశాలల అధీనంలో ఉంచాలి. శస్త్ర చికిత్సలు, ప్రసవ సమస్యల వంటి తీవ్ర జబ్బులతో బాధపడుతున్న పశువుల్ని ఈ వాహనాలతో గ్రామాల నుంచి మెరుగైన వైద్య సేవలు అందించే కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేయవచ్చు. అంతే తప్ప కొత్తగా వాహనాలను కొనుగోలు చేయడం, అందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించటం అనవసరం. 


అమూల్‌ డెయిరీ కోసం నడిచే రైతుభరోసా కేంద్రాల సిబ్బందికి అవసరమైన సాంకేతిక, పరిపాలనాపరమైన శిక్షణలు ఇచ్చేందుకు ఒక శిక్షణా కేంద్ర నిర్మాణానికి స్థలంతో పాటు రెండు కోట్ల నిధుల్ని కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇప్పటికే కేటాయించారు. వాస్తవానికి ఇప్పటికే ఈ సేవలను నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఆనంద్‌, ఈరోడ్‌ కేంద్రాల నుంచి అందిస్తోంది. మన రాష్ట్రంలో సంగం డెయిరీ వంటి సంస్థలు కూడా అందిస్తున్నాయి. ఇవిగాక ఆరు పశువైద్య కళాశాలలు, డెయిరీసైన్సు కళాశాలలు, మండపేటలోని పునరుత్పత్తి శిక్షణా కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాలు సర్వహంగులతో నడుస్తున్నాయి. ఈ కేంద్రాలలో డెయిరీ పశుపోషణ, కృత్రిమ గర్భోత్పత్తి, ప్రథమ చికిత్సలతో ఎంతమందికైనా హాస్టల్‌ వసతి కల్పించి శిక్షణ ఇప్పించవచ్చు. ఈ శిక్షణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అమూల్‌ డెయిరీ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలను ప్రారంభించటం సరికాదు. పాలకులు పునరాలోచించాలి. 

డాక్టర్‌ యం.వి.జి. అహోబలరావు

పాడిరంగ నిపుణులు

Updated Date - 2021-04-06T05:56:44+05:30 IST