నైట్‌ వాచ్‌మన్‌ హత్య

ABN , First Publish Date - 2022-05-20T06:11:49+05:30 IST

తాటిపాక ప్రైవేటు కళాశాలలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

నైట్‌ వాచ్‌మన్‌ హత్య

తాటిపాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో సంఘటన
ఫర్నిచర్‌ ధ్వంసం, నగదు చోరీ
సీసీ కెమెరాల్లో రికార్డు
ఎస్పీ పరిశీలన

రాజోలు, అమలాపురం టౌన్‌, మే 19: తాటిపాక ప్రైవేటు కళాశాలలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజోలు సీఐ ఎం.శేఖర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో వేద జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాలలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల సుబ్బారావు(60)  ఉపాధి నిమిత్తం గతంలో కువైట్‌ వెళ్లగా అక్కడ విద్యుత్‌ షాక్‌కు గురవ్వడంతో తిరిగి వచ్చి గత ఎనిమిది సంవత్సరాలుగా తాటిపాక కళాశాలలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు తాటిపాక నుంచి తన స్వగ్రామమైన నగరంలో ఉన్న ఇంటికి ఉదయం 6 గంటలకు వెళ్లేవాడు. బుధవారం ఉదయం 8 గంటలైనప్పటికీ ఇంటికి రాకపోవడంతో సుబ్బారావు అల్లుడు పిచ్చిక శివ కళాశాలకు వెళ్లి చూడగా మంచం మీద రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా కంగారు పడిన శివ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి రాజోలు సీఐ ఎం.శేఖర్‌బాబు, రాజోలు ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎ.ఫణిమోహన్‌ తమ సిబ్బందితో చేరుకున్నారు. కళాశాలలో ఉన్న ఆఫీస్‌ రూమ్‌లో కంప్యూటర్‌, ఫర్నిచర్‌ ధ్వంసమై  ఉంది. రూ.4,500 నగదును దోచుకెళ్లారు. దుండగులు క్యాంటీన్‌లోకి కూడా చొరబడి అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సుబ్బారావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుబ్బారావు మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సుబ్బారావు మృతదేహాన్ని కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ లతామాధురి, అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌, క్లూస్‌టీమ్‌లు వచ్చి పరిశీలించాయి. సుబ్బారావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శేఖర్‌బాబు తెలిపారు.
 వాచ్‌మెన్లే టార్గెట్‌
ఒంటరిగా రాత్రిపూట ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మెన్లుగా పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకుంటూ దొంగతనాలు జరు గుతున్నట్టు కోనసీమ జిల్లా పోలీసులు గుర్తించారు. గత ఇరవై రోజుల వ్యవధిలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భాష్యం స్కూలులో పని చేస్తున్న వాచ్‌మన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. బుధవారం రాత్రి కోనసీమ జిల్లా తాటిపాకలోని ఓ వేద కళాశాలలో నైట్‌ వాచ్‌మన్‌ను 20 నుంచి 25 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని యువకుడు అతి కిరాతకంగా ఆయుధంతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం వేద కళాశాలలోని నగదును దొంగిలించుకు వెళుతున్నట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. రాత్రిపూట ఒంటరిగా విధి నిర్వహణ చేసే వాచ్‌మన్లు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలో పోలీసులకు సమాచారం తెలి యచేయాలని కోరారు. తాటిపాకలో వాచ్‌మన్‌ను హత్యచేసిన యువకుడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేశారు. సదురు వ్యక్తిని గుర్తించి వివరాలు తెలిపిన వారికి బహుమతి అందజేస్తామని కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. హత్యకు  పాల్పడిన వ్యక్తి వివరాలను సెల్‌ 9440796526, 9154965855కు సమాచారం అందించాలని కోరారు.

Updated Date - 2022-05-20T06:11:49+05:30 IST