మరో 15 రోజులు

ABN , First Publish Date - 2020-11-27T05:40:56+05:30 IST

‘ఈసారి రబీ సీజన్‌లో రైతులు పంటను ఒడ్డెక్కించా లంటే మార్చి నెలాఖరుకు కాదు. మరోపక్షం రోజులు నీటి సరఫరా వ్యవధి పెంచాలి. అప్పుడే సాగు అవసరాల తోపాటు తాగు నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. ఈ దిశగానే అడుగులు వేస్తారనుకుంటున్నాం’ అని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో చేసిన సూచన ఇది.

మరో 15 రోజులు
సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని

మార్చి 31 కాదు..ఏప్రిల్‌ 15 వరకు రబీకి నీరివ్వాలి

సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యేల డిమాండ్‌

తాగునీటితో పాటు ఆక్వా రైతులను చూడాలి

వెదజల్లే పద్ధతిపై అవగాహన పెంచాలి


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

‘ఈసారి రబీ సీజన్‌లో రైతులు పంటను ఒడ్డెక్కించా లంటే మార్చి నెలాఖరుకు కాదు. మరోపక్షం రోజులు నీటి సరఫరా వ్యవధి పెంచాలి. అప్పుడే సాగు అవసరాల తోపాటు తాగు నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది. ఈ దిశగానే అడుగులు వేస్తారనుకుంటున్నాం’ అని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో చేసిన సూచన ఇది. పోలవరం పూర్తి ఎంత అవసరమో రబీని గట్టెక్కించడం అంతే అవసరమని తెగేసి చెప్పారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమా వేశంలో ఎమ్మెల్యేలు గడువు పొడిగించాలని తమ వాదనలు వినిపించగా, అన్నీ చూసి చేద్దామంటూ మంత్రులు మాట దాటేసే ప్రయత్నం చేశారు.


మార్చి నెలాఖరు నాటికి కాలువలు మూసివేస్తున్న దృష్ట్యా ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా ముందస్తు సాగునీటి ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ఉప ముఖ్య మంత్రి ఆళ్ల నాని అధికారులకు సూచించారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 11 ప్రధాన కాల్వలు, వాటి ఉప కాల్వల ద్వారా ఐదు లక్షల 29 వేల 962 ఎకరాల ఆయకట్టు ఉండగా, నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు నికర సాగునీరు అందిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కాపర్‌ డ్యామ్‌ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకునే రబీ సీజన్‌ను కుదించినట్లు మం త్రి వెల్లడించారు. అయితే రబీ సాగు పూర్తయ్యేందుకు కొన్ని రకాల విత్తనాలు 120 రోజుల్లోపు, మరిన్నింటికి 135 రోజుల సమయం పడుతుందని ఎమ్మెల్యేలు లేవనెత్తగా..  రైతులు ఎటువంటి ఇబ్బందు లు పడకుండా వారికి అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారని మంత్రి నాని సమాధానం ఇచ్చారు. నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించి, రైతుల్లో అవగాహన కల్పించేలా చూడా ల్సిన బాధ్యత అధికారులదేనని గృహ నిర్మాణ మంత్రి రంగనాథరాజు అన్నారు. కాలువలు, లాకులకు అవసరమైన మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నరసా పురం, పాలకొల్లు వంటి శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి లేకుండా చూసి, నీటి నిర్వహణ పద్ధతుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. 

మరో 15 రోజులు పెంచాలి : ఎమ్మెల్యేలు

సాగునీటి సరఫరాలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా ఉందని తెలు గుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చించినాడ, దిగమర్రు, వడ్డిలంక, రాపాక, జిన్నూరు ఛానల్స్‌లో వాటర్‌ లెవెల్స్‌ నిలబెట్టలేకపోవడంతో శివారు ప్రాంతాలకన్నీ కష్టాలే మిగిలా యన్నారు. కొల్లేరు శివారు గ్రామాల్లో తాగు నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు మంత్రులకు విజ్ఞప్తిచేశారు. సాగు, తాగునీటి కష్టాలను అధిగమించేందుకు మార్చి నెలాఖరుకు కాకుండా మరో 15 రోజుల పాటు నీటి సరఫరాను కొనసాగించేలా అధికార పక్షం ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రావిపాడు, పెంటపాడు కాల్వల్లో సిల్టు పేరుకుపోయిందని దీనిని తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కాల్వలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఆయకట్టు ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ముత్యాలరాజు వివరించారు. సాగు, తాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలను తీసుకునేం దుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేసీ వెంకటరమణారెడ్డి, నరసాపురం సబ్‌ కలె క్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ పాల్గొన్నారు.

 డెల్టా ఎమ్మెల్యేలు డుమ్మా

కీలకమైన సాగు నీటి సలహా మండలి సమావేశానికి అధికార పక్షానికి చెందిన డెల్టా ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టారు. రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల తాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది కాబట్టి దీనికి రానక్కరలేదని అనుకున్నారేమో..! మంత్రి వనిత సహా నిడ దవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, నర్సాపురం ఎమ్మెల్యే ముదు నూరి ప్రసాదరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ వంటి వారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. రెండో పంట గట్టెక్కిం చేందుకు అనువైన సూచనలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వానికి మార్గనిర్ధేశకంగా వ్యవహరించాల్సిన వీరు కనిపించలేదు.


  అది.. రైతులకు శాపం :నిమ్మల రామానాయుడు, పాలకొల్లు ఎమ్మెల్యే 

రబీకి మార్చి తరువాత సాగునీటి సరఫరాకు 15 రోజులు పొడిగించాలి. ఏడాదిన్నరగా చింతలపూడి, తాడిపూడి, ఎర్ర కాలువ, ఆధునికీకరణ పనులకు అరబస్తా సిమెంట్‌ పనికూడా జరగలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపం. పూడిక, గుర్రపు డెక్కను తొలగించాలి. ఇన్‌పుట్‌ సబ్సిడీలోనూ రైతులకు అన్యాయమే జరిగింది. లస్కర్లను ఏర్పాటు చేయాలి. 

 ఆక్వాను చూడండి  :– మంతెన రామరాజు, ఉండి ఎమ్మెల్యే 


పంటలకు సాగు నీరందేలా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆక్వా చెరువులకు నీరందేలా జాగ్ర త్తలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా చోట్ల ఇంతకుముందు వేసవిలో అనేక అనుభవాలు ఎదురయ్యాయి. వాటిని దృష్టిలో ఉం చుకుని అప్పుడున్న అవరోధాలు ఏవీ ఇప్పుడు పునరావృ తం కాకుండా చూడాలి. సాగునీటి విడుదల మరికొన్ని రోజులు పొడిగించాలి. 

  అన్నీ చూసి ముందుకెళ్లాలి  :– అబ్బయ్య చౌదరి, దెందులూరు ఎమ్మెల్యే

వచ్చే మార్చి 31 తరువాత సాగు నీరు విడుదలకు రెండు వారాల గడువు ఇవ్వాలి. ఇది రైతులకు ఎంతో ఉపయోగం. సాగు, తాగునీటి విషయంలో జాగ్రత్త అవ సరం. కృష్ణా కెనాల్‌కు ఈ సారి నీరిస్తారో లేదో చెప్పాలి. అంబాపురం వద్ద జరుగుతున్న పనులపై దృష్టి పెట్టాలి.      



Updated Date - 2020-11-27T05:40:56+05:30 IST