దొరవారిసత్రం, నవంబరు 26 : మండలంలో రెండురోజులపాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోని వరి పొలాలు నీటమునిగాయి. పులికాట్ తీరంలోని కటువపల్లి, సింగనాలత్తూరు, కలుజుకండ్రిగ, శ్రీధనమల్లి, తొగరాముడి, కరటాముడి, కారికాడు, గ్రామాల్లో వరిపొలాలు సుమారు 1600 ఎకరాల మేర నీటిలో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అలాగే కాళంగి పరివాహక ప్రాంతాలలో కూడా లోతట్టు ప్రాంతాలలో వరి పొలాలు నీటిలో ఉన్నట్లు వ్యవసాయ అధికారి కాంచన తెలిపారు. తమ సిబ్బందితో కలసి గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
జేసీ పర్యటన
తుఫాన్ ప్రభావాన్ని గుర్తించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మండలంలో గురువారం పర్యటించారు. మండల అధికారులతో కలసి కొత్తపల్లి, నేలపట్టు గ్రామాల్లో పర్యటించారు. కొత్తపల్లిలో సచివాలయాలను తనిఖీ చేశారు. గ్రామస్థులతో తుఫాన్ ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. నేలపట్టులో పక్షుల కేంద్రంలో పర్యటించారు. చెరువుకట్లను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దారు పద్మావతి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఇతరశాఖల అధికారులు ఉన్నారు.