గోదావరికి జలకళ

ABN , First Publish Date - 2022-07-07T06:17:58+05:30 IST

గోదావరికి జలకళ

గోదావరికి జలకళ
దుమ్ముగూడెం వద్ద నీటమునిగిన సీతమ్మసాగర్‌ కాపర్‌ డ్యాం

ఎగువన కురుస్తున్న వర్షాలతో పెరుగుతున్న ప్రవాహం

దుమ్ముగూడెం వద్ద నీటమునిగిన సీతమ్మసాగర్‌ కాపర్‌డ్యాం

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

అశ్వాపురం/భద్రాచలం/పాల్వంచ, జూలై 6: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి జలకళ వచ్చింది. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువన ఉన్న భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్టకు వరద పోటెత్తుతోంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద రూ.3,480కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీతమ్మసాగర్‌ బ్యారేజ్‌కు సంబంధించిన కాపర్‌డ్యాంపై నుంచి వరద పారుతుండటంతో బ్యారేజ్‌పనులు నిలిచిపోయాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించి 30గేట్ల ద్వారా 75,890 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతుండగా దుమ్ముగూడెం కాటన్‌ ఆనకట్ట వద్దకు 32,873క్యూసెక్కుల నీరు చేరడంతో నిర్మాణంలో ఉన్న సీతమ్మ బ్యారేజ్‌ మొదటి కాపర్‌డ్యాం నీటమునిగింది. దీంతో బ్యారేజ్‌ పనులు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి యంత్రాలను, ఇతర సామగ్రిని బయటకు తరలించారు.  అలాగే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి కొత్తనీరు వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన గోదావరి ఈ సీజన్‌లో తొలిసారి జలకళను సంతరించుకుంది. నిన్నమొన్నటివరకు ఏడు అడుగులున్న గోదావరి నీటిమట్టం బుధవారం సాయంత్రం 6గంటలకు 15అడుగులకు చేరుకుంది. గోదావరికి కొత్తనీరు వచ్చి చేరడంతో భక్తులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు.  


402 అడుగులకు చేరిన కిన్నెరసాని జలాశయం

ఎగువనున్న మర్కోడు, ఆళ్లపల్లి, గుండాల తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుతుండగా.. పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయ నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. బుధవరం రిజర్వాయర్‌ నీటిమట్టం 402.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407అడుగులు కాగా.. ఇనఫ్లో 1400క్యూసెక్కులు ఉంది. కిన్నెరసాని కాలువ పరిసరాల రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ మోటార్లను సురక్షితమైన ప్రాంతాలకు తరలించుకోవాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. 

Updated Date - 2022-07-07T06:17:58+05:30 IST