ప్రతి రిజర్వాయర్ వద్ద ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డర్ల ఏర్పాటు
తేలనున్న పూడిక లెక్కలు
కాలువలకు పక్కాగా నీటిపంపిణీ
అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం
నిర్మల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణవాగుప్రాజెక్ట్లతో పాటు శ్రీరాంసాగర్ప్రాజెక్ట్ల నిర్వహణపై పకడ్బందీ యాక్షన్‌ప్లాన్ రూపొందించేందుకు సంబంధిత శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీయేటా ప్రాజెక్ట్‌ల్లో నీటినిల్వల లెక్కలతో పాటు ఆ ప్రాజెక్ట్‌ల పరిధిలోని కాలువలకు విడుదల చేస్తున్న నీటిలెక్కలపై గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు. అధికారుల మధ్య సమన్వయం లోపించడం, తగినంతగా సాంకేతికసిబ్బంది లేని కారణంగా ప్రాజెక్ట్‌ల నిర్వహణ రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోందంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని స్వర్ణప్రాజెక్ట్‌కు సంబంధించి నీటివిడుదలపై జరిగిన నిర్లక్ష్యం పెద్దముప్పును సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రధాన కాలువల ద్వారా రబీసీజన్‌లో నీటివిడుదల వ్యవహారం గ్రామాల మధ్య వివాదాస్పదంగా మారుతోంది. రైతులు రబీ చివరి సమయంలో సాగునీటి కోసం ఆందోళనలు సైతం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు రోజురోజుకూ ముదిరిపోతున్న కారణంగా ప్రభుత్వం ఇక ప్రాజెక్ట్‌ల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించ తలపెట్టింది. ఇందులో భాగంగానే ప్రాజెక్ట్‌ల్లోని నీటినిల్వల వ్యవహారంపై పకడ్బందీ చర్యలు చేపట్టబోతోంది. దీనికోసం గాను ప్రతీప్రాజెక్ట్ వద్ద ఆటోమేటిక్ వాటర్‌లెవల్ రికార్డులను ఏర్పాటు చేస్తోంది. ఈ రికార్డర్ల ద్వారా ప్రాజెక్ట్‌ల్లో ఎంతమేరకు నీరు నిల్వ ఉందనే విషయం వెల్లడవుతోంది. దీనికి అనుగుణంగానే ఏ ఏ ప్రాజెక్ట్‌కు ఎంత మేరకు నీటిని విడుదల చేయవచ్చన్న సమాచారం అటు సంబంధిత అధికారులకు, రైతులకు అందుబాటులో ఉండబోతోంది. దీంతో ప్రతీయేటా ఖరీఫ్, రబీసీజన్లలో పకడ్బందీగా నీటివిడుదల కొనసాగే అవకాశం ఏర్పడుతోంది. అలాగే వారబందీ పద్దతి ద్వారా కూడా నీటివిడుదలపై రైతులకు స్పష్టత వస్తుందంటున్నారు. రిజర్వాయర్లపై ఆటోమేటిక్ వాటర్‌లెవల్ రికార్డర్లను అలాగే రియల్ టైం డాటా యాక్విజిషన్ సిస్టంను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రికార్డర్లు నీటినిల్వల లెక్కలను సెన్సార్ల ద్వారా సేకరిస్తాయి. ఈ సమాచారమంతా శాటిలైట్ ద్వారా డాటా కేంద్రాలకు చేరుకుంటుంది. ఎప్పటికప్పుడు లెక్కలు పక్కా గా తేలనున్నాయి. వేసవికాలంలో రిజర్వాయర్‌లో నీరుఎక్కువగా ఆవిరి అయ్యే అవకాశం ఉన్న కారణంగా నీటినిల్వ లెక్కలు రోజురోజుకూ తలకిందులవుతాయి. ఇలాంటి విషయంలో కూడా ఇక స్పష్టత రానుందంటున్నారు.
ప్రతీ యేటా గందరగోళమే
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లైన కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణప్రాజెక్ట్తో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ల నీటిలెక్కలపై ప్రతియేటా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా రబీసీజన్‌లో ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చేస్తుండడం రివాజుగా మారింది. ఇప్పటికే పలుసార్లు ఖానాపూర్ ప్రాంత రైతులు సదర్మాట్ నీటికోసం ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ను విస్తరించిన సంఘటనలున్నాయి. అధికారులు కూడా నీటివిషయంలో స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా కాలువలకు నీరును విడుదల చేస్తున్న కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కాలువల నీటిని ఎగువన ఉన్న ఆయకట్టు రైతులు ఎక్కువగా వినియోగించుకోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి తలెత్తుతోందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా రబీపంటలు పూర్తిస్థాయిలో సాగునీటికి నోచుకోకుండా పోతున్నాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్త మవుతోంది. ఇక నుంచి ఇలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండబోదని చెబుతున్నారు.
టెక్నాలజీ ఉపయోగంతో..
ఇప్పటి వరకు ప్రాజెక్ట్ నిర్వహణ అంతా మ్యానువల్‌గా సాగడంతో నిర్వహణ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. సరియైున సాంకేతిక సిబ్బందిని నియమించకపోతున్న కారణంగా ఈ ప్రాజెక్ట్‌ల నిర్వహణ ఉన్నతాధికారులకు భారంగా మారుతోంది. ఇక నుంచి పూర్తిస్థాయిలో సాంకేతికను వినియోగించుకోబోతున్న కారణంగా ఇటు నిర్వహణ విషయంలో గాని అటు సాగునీటి విడుదల విషయంలో గాని తలెత్తుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభించనుందంటున్నారు. ప్రాజెక్ట్‌ల నిర్వహణను ఆటోమేటిక్ చేయబోతుండడం, సెన్సార్ల ద్వారా నీటిప్రవాహాన్ని గుర్తించడం అలాగే ఒక విభాగానికి మరో విభాగాన్ని అనుసంధానించడం లాంటి ప్రక్రియలు మొదలవుతున్న కారణంగా ఇక ప్రాజెక్ట్‌ల నిర్వహణ సులభతరం కానుందంటున్నారు. రైతులకు సాగునీటితో ప్రాజెక్ట్‌ల పరిరక్షణ కూడా పకడ్భందీగా చేపట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇక నుంచి కాలువలకు
కేటాయించినట్లుగానే నీరు
కాగా ప్రతి ఖరీఫ్, రబీసీజన్లలో ఆయా ప్రాజెక్ట్‌ల పరిధిలోని కాలువలకు రిజర్వాయర్ల నుంచి ఎంత మేరకు నీరును పంపిణీ చేయాలనే విషయంపై ముందుగానే లెక్కలు ఖరారవుతుంటాయి. ఈ నీటి కోటా ప్రకారంగానే కాలువలకు అధికారులు నీరును విడుదల చేస్తుంటారు. ప్రాజెక్ట్‌ల్లో పేరుకుపోతున్న పూడిక కారణంగా నీటి నిల్వల సామర్థ్యం తగ్గిపోతున్నట్లు చెబుతున్నారు. దీని కారణంగా నీటి మట్టం లెక్కలు గతి తప్పి కాలువలకు నీటిని విడుదల చేసే విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక నుంచి సాంకేతిక వినియోగం పెరిగిపోతున్న కారణంగా అన్ని కాలువలకు కేటాయించిన కోటా మేరకే నీరును విడుదల చేసే అవకాశం ఏర్పడుతుందంటున్నాను. ఎస్సారెస్పీ కింద కాకతీయ, సరస్వతీ, లక్ష్మి కాలువలతో పాటు కడెం ప్రాజెక్ట్ కింద కుడి, ఎడమ కాలువలు, అలాగే గడ్డెన్న, స్వర్ణప్రాజెక్ట్ల కింద కూడా కుడి, ఎడమ కాలువలకు ఎంత మేరకు నీటిని విడుదల చేయాలనే అంశంపై స్పష్టం కాబోతోంది. దీనికి అనుగుణంగానే ఇక నుంచి సంబందిత ప్రాజెక్ట్‌ల అధికారులు నీటిని విడుదల చేస్తూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా చూడనున్నారు.