ltrScrptTheme3

నీటి గొడవ తేలేనా..!

Oct 24 2021 @ 23:46PM

  1. నేటి నుంచి కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ పర్యటన 
  2. కృష్ణాపై జలాశయాలు, విద్యుత్‌ పథకాల పరిశీలన


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 24: కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సభ్యుల రెండు రోజుల జిల్లా పర్యటన సోమవారం మొదలవుతుంది. ఏపీ, తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలను కమిటీ పరిశీలిస్తుంది. ఇవన్నీ కేఆర్‌ఎంబీ పరిధిలోకి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కానీ దీనిపై రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, షరతులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం బోర్డు ప్రతినిధులు జిల్లా పర్యటనకు వస్తున్నారు. కృష్ణానదిపై నిర్మించిన జలాశయాలు, ఎత్తిపోతలు, విద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీ పరిధిలోకి చేర్చేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక షరతులను పెట్టాయి. పొరుగు రాష్ట్ర జలాశయాలు, విద్యుత్‌ కేంద్రాల వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా షరతులకు లోబడే కేఆర్‌ఎంబీ తమ జలాశయాలను ఇస్తామని ఏపీ, తెలంగాణ మెలిక పెడుతున్నాయి. దీంతో జలాశయాలు, విద్యుత్‌ కేంద్రాలు, ఎత్తిపోతలను కేఆర్‌ఎంబీ పరిధిలోకి చేర్చే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 14న నుంచి ఇవన్నీ కేఆర్‌ఎంబీ పరిధిలోకి రావాలి. కానీ రెండు రాష్ట్రాల తీరుతో కేఆర్‌ఎంబీ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు బోర్డు ప్రతినిధులు జిల్లా పర్యటనకు వస్తున్నారు. 


షరతులు వర్తిస్తాయి..


ఏపీలో ఏయే జలాశయాలు, ఎత్తిపోతలు, విద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీకి స్వాధీనం చేయనున్నారో ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం తెలంగాణలోని జలాశయాలు, విద్యుత్‌ కేంద్రాలు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వస్తేనే ఏపీ కూడా తమ జలాశయాలు, ఎత్తిపోతలు, విద్యుత్‌ కేంద్రాలను అప్పగిస్తుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, ఆటంకాలను అధిగమించి, సాధ్యమైనంత త్వరగా జలాశయాలు, విద్యుత్‌ కేంద్రాలు, ఎత్తిపోతల పథకాలను తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహించేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఏపీ పరిధిలోని కృష్ణానదిపై నిర్మించిన ప్రధాన జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు, విద్యుత్‌ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సభ్యులు సోమవారం నుంచి రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. 


ఇవి పరిశీలిస్తారు


మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజలస్రవంతి ప్రాజెక్టు, ముచ్చుమర్రి, మల్యాల లిఫ్టు స్కీంలను కమిటీ సభ్యులు సోమవారం పరిశీలిస్తారు. ఆ రాత్రి శ్రీశైలంలో బస చేస్తారు. మంగళవారం శ్రీశైలం జలాశయంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాలను పరిశీలిస్తారు. కేఆర్‌ఎంబీ బృందంలో పది మంది సభ్యులు ఉంటారు. ఏపీ, తెలంగాణ జెన్‌కో అధికారులు వారికి అవసరమైన సూచనలు ఇస్తారు. తమ ప్రభుత్వాల అభ్యంతరాలను వివరిస్తారు. 


తెలంగాణ తీరుపై అసంతృప్తి


శ్రీశైలం జలాశయంలో తగినంత నీరు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జలాశయంలో నీటిని ఇలా అసంబద్ధంగా వినియోగించడం వల్ల భవిష్యత్తు అవసరాలకు నీరు అందడం లేదని, తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఫిర్యాదు చేసింది. ఏపీ వాదనలను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. శ్రీశైలం జలాశయం విద్యుత్‌ అవసరాల కోసమే ఏర్పాటు చేశారని వితండ వాదన చేస్తోంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ముచ్చుమర్రి, హంద్రీనీవా ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమ ప్రాంతాలకు నీటిని అక్రమంగా మళ్లిస్తున్నారని తెలంగాణ ఆరోపిస్తోంది. రెండు రాష్ట్రాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కేఆర్‌ఎంబీ సభ్యులు, ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.