ఈ సారి 60 లక్షల ఎకరాలకు నీరు!

ABN , First Publish Date - 2021-06-17T07:17:56+05:30 IST

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సుమారు 60లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఇంజనీర్ల కమిటీ నిర్ణయించింది.

ఈ సారి 60 లక్షల ఎకరాలకు నీరు!

  • గోదావరి బేసిన్‌లో ఢోకా లేదు.. 
  • కృష్ణాలో నీటి లభ్యత  ను బట్టి నిర్ణయం..
  • కాళేశ్వరం కొత్త ఆయకట్టు 3లక్షల ఎకరాలు
  • ఎస్సారెస్పీ కింద 13లక్షల ఎకరాలు
  • సాగు నీటి విడుదలపై ఇంజనీర్ల కమిటీ చర్చ
  • వచ్చే నెలలో మరో సారి భేటీ.. తుది నిర్ణయం


హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సుమారు 60లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ఇంజనీర్ల కమిటీ నిర్ణయించింది. గోదావరి బేసిన్‌లో పూర్తి స్థాయి ఆయకట్టుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కొత్తగా 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. కృష్ణా బేసిన్‌లోనూ పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తున్నా.. రానున్న రోజుల్లో వచ్చే వరదను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి సాగు నీటి సరఫరాపై ఇంజనీర్ల కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా ప్రాజెక్టుల సీఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, ఆయకట్టుకు అందించాల్సిన నీటి అవసరాలపై ఇందులో చర్చించారు. ఈ ఏడాది వానా కాలం పంటల కోసం 60 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో మరో సారి సమావేశమై... అప్పటి నీటి నిల్వల ప్రకారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రాజెక్టుల పరిధిలో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం నుంచే సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు.


ప్రాజెక్టుల వారీగా ఇలా..

ఇంజనీర్ల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం... భారీ తరహా ప్రాజెక్టుల పరిధిలోని 38 లక్షల ఎకరాలకు, మధ్య తరహ, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలోని 22 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌, ప్యాకేజీ- 21 కింద ఈసారి కొత్త 3లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది. శ్రీరాంసాగ్‌ మొదటి దశ కింద 9.60 లక్షల ఎకరాలు, రెండో దశ కింద 3.77 లక్షలు, నాగార్జునసాగర్‌ పరిధిలో 6.58 లక్షలు, ఏఎమ్మార్పీ కింద 2.68 లక్షలు, దేవాదుల పరిధిలో 2 లక్షలు, కల్వకుర్తి కింద 3 లక్ష లు, నెట్టెంపాడు పరిధిలో 1.40 లక్షలు, నిజాంసాగర్‌ కింద 1.15 లక్షలు, జూరాల కింద లక్ష ఎకరాలు, భీమా కింద 90 వేలు, సింగూరు కింద 40 వేలు, కడెం పరిధిలో  60 వేల ఎకరాలు, మిడ్‌మానేరు కింద 52 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. 


గోదావరి, కృష్ణాలో పరిస్థితి ఇది..

ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని కడెంలో 3.19 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 9.6, శ్రీరాంసాగర్‌లో 19, సింగూరులో 17, నిజాంసాగర్‌లో 7.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు పడితే ఈ నిల్వలు మరింత పెరగనున్నాయి. ఈమేరకు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీరు విడుదల చేసే అవకాశం ఉంది. కృష్ణా బేసిన్‌లో మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.3 టీఎంసీల నీరు ఉంది. ఎగువన నారాయణపూర్‌ ప్రాజెక్టు గేట్లు మరమ్మతు చేస్తుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌ నెలలోనే జూరాల నిండిపోయింది. దీంతో నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ద్వారా ఇప్పటికే ఎత్తిపోతలు ప్రారంభించారు. అయితే, శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇంకా పూర్తి స్థాయి వరద రావడం లేదు. ఫలితంగా దీనిపై ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో నీటి సరఫరా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు కొంత మెరుగ్గానే ఉండ గా, గత ఏడాది తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకోని 45 టీఎంసీల వాటా అలాగే ఉంది. ఆ నీటిని ప్రస్తుత వానా కాలం అవసరాలకు ఉపయోగించుకునే వీలుంది. 


అవసరమైతే కాళేశ్వరం నుంచి ఎత్తిపోత

గోదావరిలోని మేడిగడ్డ బ్యారేజీకి ప్రస్తుతం 2వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వారం రోజుల్లో ఇది పూర్తిగా నిండనుంది. దాంతో గోదావరి ఎగువ ప్రాంతాల అవసరాల రీత్యా నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే, బేసిన్‌లో భారీ వర్షాలు కురిస్తే... దిగువ ప్రాంతం నుంచి నీటి పంపింగ్‌ను చేసే అవకాశం లేదు. ఒకవేళ సరైన వర్షా లు కురవకపోతే.. మేడిగడ్డ నుంచి పంపింగ్‌ మొదలు పెట్టి... ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లకు తరలించే అవకాశం ఉంది. అలాగే ఈ ఏడాది మల్లన్నసాగర్‌లోనూ కొంత నీటిని నిల్వచేయాలని భావిస్తున్నారు. ఎగువ ప్రాంతా ల్లో వర్షాలు కురవకపోతే..నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌లకూ కాళేశ్వరం నీటిని తరలించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-06-17T07:17:56+05:30 IST