నీళ్లిలా.. ఇళ్లెలా?

ABN , First Publish Date - 2021-07-20T06:37:40+05:30 IST

జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పేదల ఇళ్ల స్థలాల్లో లొసుగులన్నీ బయట పడుతున్నాయి. స్థలాల సేకరణ ముసుగులో అనువుగాని ప్రాంతాల్లో తీసుకున్న భూముల బండారమంతా బట్టబయలవుతోంది.

నీళ్లిలా.. ఇళ్లెలా?
వెలుగుబందలోని జగనన్న కాలనీ లేఅవుట్‌ దుస్థితి

  • వర్షాలకు జిల్లాలో నిండా మునిగిన పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌లు
  • ఆనవాళ్లు లేని రీతిలో ముంపు.. ఎవరి స్థలాలు ఏవో గుర్తుపట్టలేని దుస్థితి
  • స్వయంగా సీఎం జగన్‌ పట్టాలు పంచిన కొమరగిరిలోనూ జలమయం
  • చెరువుల్లా మారిన ప్లాట్లను చూసి నోరెళ్లబెడుతున్న లబ్ధిదారులు
  • అధికారుల ఒత్తిడితో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వాళ్లంతా లబోదిబో
  • చెరువులు, నదులు, డ్రైయిన్లు, కాల్వల పక్క భూముల్లో పట్టాల పంపకం
  • లేఅవుట్‌లన్నీ చదునుచేసినా ముంపు బెడద తొలగడం అసాధ్యమే

  • జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పేదల ఇళ్ల స్థలాల్లో లొసుగులన్నీ బయట పడుతున్నాయి. స్థలాల సేకరణ ముసుగులో అనువుగాని ప్రాంతాల్లో తీసుకున్న భూముల బండారమంతా బట్టబయలవుతోంది. ఊరి శివారు ప్రాంతాలు, పొలాలు, గుట్టలు, వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు, కాలువల పక్కన, డ్రెయిన్ల పక్కన, సముద్ర తీరాన్ని ఆనుకుని, గోదావరి పాయలకు సమీపంలో పట్టాలు పంచేసి చేతులు దులిపేకున్న ప్రభుత్వం తీరు వర్షాల సాక్షిగా వెలుగులోకి వస్తోంది. ఎక్కడికక్కడ లేఅవుట్‌లన్నీ చెరువులను తలపిస్తుండడంతో లబ్ధిదారులంతా లబోదిబోమంటున్నారు. ఇందులో ఇళ్లు కట్టుకుంటే తమ భవిష్యత్‌ ఏంటని బెంగపడుతున్నారు. అధికారుల ఒత్తిడితో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వారంతా నెత్తీనోరు బాదుకుంటున్నారు.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పేదల ఇళ్ల స్థలాల పథకం కింద జిల్లావ్యాప్తంగా 3,84,218 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరందరికి 7,218 ఎకరాలు కావలసి ఉండగా, 1,856 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. మిగిలిన 5,362 ఎకరాలను రూ.2,566 కోట్లతో రైతుల నుంచి కొనుగోలుచేసి సేకరించారు. వీరందరికి గతేడాది డిసెంబర్‌ 25 నుంచి ప్రభుత్వం పట్టాలు పంపిణీ ప్రారంభించింది. అర్హులందరికీ ఇళ్లు నిర్మించడం కోసం మొత్తం 1,677 లేఅవుట్లు సిద్ధం చేశా రు. ఇందులో తొలి దశ కింద జిల్లావ్యాప్తంగా 758 లేఅవుట్లలో 1.34 లక్షల మందికి ఇళ్లు నిర్మించడానికి ఈనెల ఒకటి నుంచి కార్యాచరణ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు తాజా వర్షాలతో ఎక్కడికక్కడ ఇళ్ల స్థలాలకు తీసుకున్న భూములు, మొదటి విడత ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేసిన లేఅవుట్‌లన్నీ నిండా మునిగిపోయాయి. ఆనవాళ్లు కూడా లేని రీతిలో జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం లేఅవుట్లలో దాదాపు ఎనభై శాతానికి పైగా మునిగిపోయాయి. దీంతో అసలు ఎవరి స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు. అనేకమంది లబ్ధిదారులు తమ ప్లాట్లను చూసేందుకు లేఅవుట్‌ వద్దకు వెళ్లి అవాక్కవుతున్నారు. తమ స్థలం ఎక్కడుందో కూడా అంచనా వేయలేనంతగా ముంపు చుట్టేయడంతో షాక్‌ తింటున్నారు. మరోపక్క కొన్నిరోజుల తర్వాత స్థలాల్లో నీళ్లు పోయినా బురద కారణంగా ప్లాట్ల ఆనవాళ్లు, సరిహద్దులు మొత్తం చెదిరిపోనున్నాయి. ఫలితం గా ఎవరి స్థలం ఏదో గుర్తుపట్టలేక మళ్లీ గొడవలు జరిగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా సీఎం జగన్‌ స్వయంగా ఇళ్ల పట్టాలు పంచిన యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో 350 ఎకరాల లేఅవుట్‌ మొత్తం చెరువును తలపిస్తోంది. 16 వేల మందికి ఇక్కడ పట్టాలు పంచగా, ప్లాట్లన్నీ ముంపులో చిక్కుకోవడంతో ఆనవాళ్లు కూడా కని పించడం లేదు. ఈలేఅవుట్‌ చదునుకు ఇప్పటికే రూ.50 కోట్లకుపైగానే బిల్లులు చెల్లించారు. తీరా వర్షాలకు మునిగిపోవడంతో డబ్బం తా నీళ్లపాలైనట్టయింది. మంత్రి కన్నబాబు నియోజకవర్గంలోని కరపలో 139 ఎకరాల సెంట్రల్‌ లేఅవుట్‌ అయితే ఆనవాళ్లు లేకుండా మునిగిపోయింది. పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, మండపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరం రూరల్‌, అనపర్తి నియోజకవర్గాల్లో సగానికిపైగా ఇళ్ల స్థలాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. కోనసీమలో లేఅవుట్‌లన్నీ అసలే లోతట్టు ప్రాం తాల్లో ఉండడం, ఇప్పటికే చదును చేసినవి కూడా మునిగిపోవడంతో అధికారులు సైతం తలపట్టుకుంటున్నారు. మళ్లీ వీటిని చదునుచేయడానికి ప్రభుత్వం బడ్జెట్‌ ఇవ్వదని, లబ్ధిదారులతో ఇళ్లు కట్టించడం ఎలా అని మదనపడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సైతం వర్షాలతో మునిగిన లేఅవుట్‌లు చూసి ఉలిక్కిపడుతున్నారు. అధికారులు ఎడాపెడా అనువుగాని ప్రాంతా ల్లో సేకరించిన భూములతో వచ్చిన తిప్పలు చూసి తలపట్టుకుంటున్నారు. ఒకవేళ వర్షాలు తగ్గినా భవిష్యత్‌లో వర్షాలకు మళ్లీ మునిగిపోయే లేఅవుట్‌లలో అసలు నివసించడం అసాధ్యమని లబ్ధి దారులే చెబుతున్నారు. ఒకవేళ చదునుచేసినా మున్ముందు ఈ లేఅవుట్ల పరిసరాలు లోతట్టు ప్రాంతాలు కావడంతో ముంపునకు గురవుతాయని అప్పుడు బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉం టుందని అంచనా వేసుకుని కలవరపడుతున్నారు. అక్కడకక్కడా కొన్ని లేఅవుట్లలో రహదారులు వేసినా డ్రైన్లు లేకపోవడంతో ఎక్కడినీరు అక్కడే నిలిచిపోయింది. ఇదంతా ఒకెత్తయితే మెగా గ్రౌండింగ్‌ మేళా పేరుతో ఈనెల 1,2,3, తేదీల్లో అనేక లేఅవుట్లలో అధికారులు ఒత్తిడి తెచ్చి మరీ లబ్ధిదారులతో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టించారు. తీరా తాజా వర్షాలకు తెచ్చి సిద్ధం చేసుకున్న ఇసుక, మట్టి మొత్తం ముంపులో కొట్టుకుపోయాయి. పునాదుల వరకు జరిగిన నిర్మాణాల్లోకి నీళ్లన్నీ చేరి దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. దీంతో వారం తా పెట్టిన పెట్టుబడి నీళ్లపాలైపోయిందని లబోదిబోమంటున్నారు. వాస్తవానికి పేదల ఇళ్ల స్థలాల పేరుతో ఎక్కడికక్కడ ప్రభుత్వం శివారు ప్రాంతాలు, పొలాలు, గుట్టలు, లోతట్టు ప్రాంతాలు, కాలువల పక్కన స్థలాలు ఇవ్వడం వల్లే ఇప్పుడీ దుస్థితి నెలకొంది.

జగనన్నకాలనీలో వాన నీటితో మునక

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం నగర పేదల కోసం రాజానగరం మండలం వెలుగుబందలో నిర్మించనున్న జగనన్నకాలనీ బురదలో కూరుకుపోయింది. ఇటీవల కురిసిన వానలకు ఇక్కడ కాలనీ నిర్మాణం కోసం వేసిన  లేఅవుట్‌ మురుకు కూపంలా మారిపోయింది. నీరు వెళ్లే మార్గం లేక నీటి గుంతల్లా మారాయి. దీంతో ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలో అర్థం కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రాజమహేంద్రవరం పేదల కోసం వెలుగుబంద గ్రామంలో సుమారు 11 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం భూమి సేకరించారు. ఆర్యవైశ్యుల భూమి, మరో ప్రైవేట్‌ భూమి వివాదంలో ఉండగా, 9 వేల మంది కోసం సేకరించిన భూమి ఏటవాలుగా ఉంది.  కిందకు వెళ్లే కొద్దీ లోయలోకి వెళ్లినట్టు ఉంటుంది. కొంతమేర మాత్రమే మెరక ఉంది. ఇటీవల జగనన్న కాలనీల శంకుస్థాపన పేరుతో హడావుడిగా శంకుస్థాపనలు చేయించారు. ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ఎక్కువ మంది లబ్ధిదార్లు ఎదురుచూశారు. కానీ లబ్ధిదారుడే సొంతంగా నిర్మించుకోవాలని, హౌసింగ్‌ తరపున రూ.1.80 లక్షలు ఇస్తామని ప్రకటించారు. సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులలో ఉన్న సభ్యులకు మరో  రూ.50 వేలు రుణంగా ఇప్పిస్తామని చెప్పారు. అయినా లబ్ధి దార్లు ముందుకు రాకపోవడంతో వారిపై ఒత్తిడి తెచ్చి సుమారు 3 వేల మంది వరకూ శంకుస్థాపనలు చేసుకునేలా చేశారు. కానీ అందులో 125 మంది మాత్రమే పనులు ప్రారంభానికి ముందుకు వచ్చారు. ఈలోగా వానలు వచ్చాయి. ఈ ప్రాంతం అంతా బందబందగా మారింది.

Updated Date - 2021-07-20T06:37:40+05:30 IST