జల కలకలం

ABN , First Publish Date - 2021-07-13T06:48:32+05:30 IST

సాగర్‌ జలాల విషయంలో..

జల కలకలం
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ , వెలిగొండ రెండో టన్నెల్‌

అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి

సూటిగా స్పందించలేని స్థితిలో నేతలు

టీడీపీ ఎమ్మెల్యేల వాదనకు మద్దతునిస్తున్న జిల్లా ప్రజానీకం 

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న వారి వాదన 

ఐక్య పోరుకి సిద్ధమవుతున్న యకట్టుదారులు, రైతు సంఘాలు 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): సాగర్‌ జలాల విషయంలో జిల్లాకు పొంచి ఉన్న ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన వాదన అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకరకంగా రాష్ట్రస్థాయిలోనే ఈ అంశం రాజకీయ కలకలాన్ని సృష్టించింది. జిల్లాలో అయితే ప్రజలు, ప్రధానంగా సాగర్‌ ఆయకట్టుదారులు పార్టీలకతీతంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేవనెత్తిన అనుమానాలకు మద్దతు ఇస్తున్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు రెండూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రకాశం జిల్లాను ఎడారిగా మార్చే ప్రమాదం ఉందంటూ విలువైన సమాచారంతో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎంకు రాసిన లేఖ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీనిపై రాయలసీమకు చెందిన వైసీపీ నాయకులు రాజకీయ కోణంలో విభిన్నమైన వాదనను లేవనెత్తగా, సోమవారం మంత్రి అనిల్‌కుమార్‌ కూడా సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఇక మన జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులైతే నోరువిప్పిన దాఖలాలు లేవు. ఎలాంటి సమాధానం ఇవ్వాలన్న అంశంపై కుస్తీ పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో రాజకీయాలకు అతీతమైన ప్రజా ఉద్యమానికి శ్రీకారం పలకాలని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.


అసలే వెనుకబడిన జిల్లా. ఆపై యాభై ఏళ్లుగా కునికిపాట్లు పడుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం. వీటికితోడు అటు తెలంగాణ , ఇటు ఏపీ ప్రభుత్వాలు సాగర్‌ జలాల వినియోగం విషయంలో తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు ప్రకాశం జిల్లాకు శాపంగా మారబోతున్నాయి. కృష్ణాజలాల మళ్లింపే ప్రధాన అజెండాగా జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ మూడు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలతో ప్రకాశం జిల్లాను ఆనాడు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నీటి సమస్య వెంటాడుతూనే ఉంది. ఏదో ఒకరోజుకి మన వాటా జలాలు మనకు దక్కుతాయి, ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది, తాగునీటి సమస్య తీరుతుందని ప్రజానీకం భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ నుంచి ఎదురైన సమస్య యావత్తు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా మన ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం, తదను గుణంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశాలను చేపట్టడం జిల్లా ప్రజలకు శాపంగా మారే పరిస్థితి నెలకొంది. 


నిజానికి జిల్లాలో సాగర్‌ కుడి కాలువ కింద 4.42 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వాస్తవంగా నీరందుతున్న 3.4లక్షల ఎకరాల్లో నికరంగా లక్ష ఎకరాల్లో మాగాణి, మిగిలినదాన్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. ఇక ఎడారి ప్రాంతంగా ఉన్న జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి సాగర్‌ జలాలే దిక్కయ్యాయి. ఫలితంగా సాలీనా 48 టీఎంసీల నీరు సాగుకి, మరో 10 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం జిల్లాకు అవసరమయ్యాయి. నికర జలాల విషయంలోనే ఆ మేరకు అవసరం కాగా మిగులు జలాలపై ఆధారపడిన వెలిగొండ ప్రాజెక్టుని ప్రజలు పోరాడి సాధించుకున్నారు. దీని నిర్మాణం పూర్తిదశకు వచ్చేసరికి నీటిసమస్య తలెత్తింది. శ్రీశైలం డ్యామ్‌లో కనీసం 840 అడుగుల సామర్థ్యంలో నీరుంటే కానీ వెలిగొండకి వదిలే అవకాశం లేదు. 


తెలంగాణ తీరుతో కష్టమే.. 

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వైఖరి రాష్ట్రంతో పాటు మన జిల్లాలోని సాగునీటి వనరులను దెబ్బతీసే ప్రమాదం నెలకొంది. రాష్ర్టానికి విభజన చట్టంలో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా ఇవ్వాల్సిన స్థాయిలో నీరు పైనుండి ఇవ్వకుండా రెండు రాష్ర్టాలకు సమానస్థాయిలోనే నీటి వినియోగం జరగాలన్న కొత్త వాదనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. తదనుగుణంగా ఆ రాష్ట్రపరిధిలో విద్యుత్‌ ప్రాజెక్టులు, ఇతర సాగునీటి నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారు. ఆ విషయంలో పోరాడి సాధించాల్సిన రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర పరిధిలో మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంది. రాయలసీమ ఎత్తిపోతలకు అనుగుణంగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఈ రెండు అంశాలే ప్రకాశం జిల్లాకు శాపంగా మారుతున్నాయి. 


టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలు

ఈ దశలో జిల్లాలో టీడీపీకి చెందిన అద్దంకి, పర్చూరు, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, స్వామిలు జిల్లాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని సూటిగా తెలియజేస్తూ సీఎంకి లేఖరాశారు. వ్యవసాయ ఆధారితమైన ప్రకాశం జిల్లా ఆర్థికాభ్యున్నతికి కృష్ణాజలాలే దిక్కు. అలాంటి సమయంలో ప్రస్తుత తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు జిల్లాను పూర్తిస్థాయిలో ఎడారిగా మారుస్తాయంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్‌ కుడికాలువ పరిధిలోని ప్రకాశం జిల్లాకు అన్యాయం చేస్తూ నీటిని రాయలసీమకు తరలించే ప్రతిపాదనను పక్కనబెట్టాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుని పూర్తిచేయటమే కాదు ఆ ప్రాజెక్టుకు శ్రీశైలం డ్యామ్‌ నుంచి నీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వాటికితోడు సాగర్‌ కుడికాలువకు గోదావరి జలాలను మళ్లించేందుకు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటం ద్వారా సాగునీటి సమస్య రాకుండా ముందుకు సాగాలని సూచించారు. మొత్తంపై వారు జిల్లాకు సాగునీటి విషయంలో అటు తెలంగాణ, ఇటు మనరాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరగబోయే ప్రమాదాన్ని ఎత్తిచూపారు. 


ప్రజల నుంచి సానుకూల స్పందన

టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంకు రాసిన లేఖ బయటకు రావటంతో రాష్ట్రంలో ముఖ్యంగా సీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు రాజకీయ కోణంలో స్పందించటంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. మన ఎమ్మెల్యేల వాదనకు మద్దతుగా మాట్లాడటం ప్రారంభించారు. ప్రత్యేకించి సోమవారం జిల్లాకు చెందిన అన్ని ప్రాంతాల్లోని ఆయకట్టుదారులు పార్టీలకతీ తంగా ఆలోచించే నాయకులు, రైతుసంఘాల్లో చర్చ ప్రారంభమైంది. అవును నిజమే కదా? సరైన సమయంలో సరైన అంశాన్ని లేవనెత్తారు. దానికి మనమూ మద్దతిస్తామన్న తరహాలో వారు మాట్లాడుకోవటం, సదరు ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి చెప్పటం చోటుచేసుకున్నాయి. తదనుగుణంగా ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనకు ముఖ్యంగా రైతులు, రైతుసంఘాలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై పార్టీకి అతీతంగా ఉద్యమించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. 


వైసీపీ నేతల ఉక్కిరి బిక్కిరి

ఇక ఈ విషయంపై జిల్లాలో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఏమి మాట్లాడాలి, ఎలా ముందుకు సాగాలన్న అంశంపై తర్జనభర్జన పడటం ప్రారంభమైంది. వైసీపీ సీమ నేతల వాదనకు మద్దతివ్వలేని పరిస్థితి. అలాగని టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలను ఏకవాక్యంతో కొట్టిపారేయలేని, ఖండించలేని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం జిల్లాలో సాగర్‌ ఆయకట్టు వైపాలెం, దర్శి, ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఒంగోలుతోపాటు కందుకూరు, కనిగిరి, మార్కాపురం, కొండపి తదితర నియోజకవర్గాలకు తాగునీటి పథకాలు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. కొత్తగా గిద్దలూరు లాంటి నియోజకవర్గాలకు కూడా తాగునీటికి సాగర్‌ జలాలు మళ్లించాలన్న డిమాండ్‌, ఆ పథకాలపై ప్రభుత్వ పరిశీలన కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో యావత్తు జిల్లా ప్రజానీకంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారి అధికారపార్టీ నేతలపై ఒత్తిడి పెరిగింది. 


ముందుకు పోయేది ఎలా?

రాష్ట్రస్థాయిలో సీమలోని అధికార పార్టీ నాయకులు ఇటు మంత్రి అనిల్‌కుమార్‌ ఏదోరూపంలో స్పందించినా జిల్లాలోని వైసీపీ  ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ కనీసం స్పందించకపోవటం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక, టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు మద్దతివ్వలేక సతమతమవుతున్నారు. అందిన సమాచారం మేరకు ఈ విషయంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడి కొంత సమాచారాన్ని సేకరించుకున్నట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడినట్లు తెలిసింది. తదనుగుణంగా మంగళవారం అధికారపార్టీ నాయకులు తెరముందుకొచ్చి మాట్లాడే అవకాశం ఉంది. 


Updated Date - 2021-07-13T06:48:32+05:30 IST