గరళ జలం

ABN , First Publish Date - 2022-07-12T05:01:31+05:30 IST

అసలే వర్షాకాలం. ఆపై నాలుగు రోజులుగా మిన్ను మన్ను ఏకం అయ్యేలా వర్షం కురుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అంటువ్యాధులు ప్రబలుతాయి.

గరళ జలం
డ్రెయినేజీలోనే తాగునీటి కొళాయి.. ఈనీరే చిన్నంశెట్టి బజారు ప్రజలకు దిక్కు

పైపులైన్లన్నీ లీకులమయం

కొళాయిల్లో బురదనీరు సరఫరా

ఇబ్బందిపడుతున్న అశ్వారావుపేట వాసులు

బోరు కదలడం వల్లే: ఈవో హరికృష్ణ

అశ్వారావుపేట, జూలై 11: అసలే వర్షాకాలం. ఆపై నాలుగు రోజులుగా మిన్ను మన్ను ఏకం అయ్యేలా వర్షం కురుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అంటువ్యాధులు ప్రబలుతాయి. ఈనేపథ్యం లో ఇంటింటికీ సరఫరా చేసే తాగునీటి విషయంలో అధికారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ బాధ్యతను అశ్వారావుపేట పంచాయతీ బాధ్యులు విస్మరించారు. ఫలితంగా పట్టణ మంతా బురదనీరు సరఫరా అవుతోంది. పట్టణంలోని దొంతికుంట, వడ్డెర బజారు, గాంధీబొ మ్మ, వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయ సెంటర్‌, చిన్నంశెట్టి వీధులలో నాలుగైదు రోజులుగా కొళాయిల నుంచి బురదనీరు వస్తోంది. కొళాయిలు కూడా పెంటకుప్పలు, డ్రెయినేజీల పక్కన ఉండటంతో ఈ నీరు ఎలా తాగాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి వానాకాలం వస్తే ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఏటా పన్నుల రూపంలో తాము వేలకు వేలు చెల్లిస్తున్నా కనీసం తాగునీటికి కూడా నోచుకోలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా కోసం ఏటా రూ. లక్షలు ఖర్చు చేస్తున్నామని పంచాయతీ పెద్దలు చెబుతున్నా అది ఆచరణలో మాత్రం కానరావడం లేదు.

పంచాయతీ ఈవో ఏమంటున్నారంటే..

పట్టణంలోని పైపులైన్లకు లీకులు లేవు. దొంతికుంటలో బోరు కదలడం వల్ల కొద్దిసేపు బురదనీరు వచ్చింది. పది నిమిషాలు తరువాత స్వచ్ఛమైన నీరే సరఫరా అవుతోంది. మురికిగుంటల్లో కొళాయిలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. నీటిని శుద్ధి చేసిన తర్వాతే సరఫరా చేస్తున్నాం.

Updated Date - 2022-07-12T05:01:31+05:30 IST