జలం గరళం

ABN , First Publish Date - 2022-05-20T06:32:30+05:30 IST

నగరవాసుల దాహార్తి తీరుస్తున్న ముడసర్లోవ రిజర్వాయర్‌ కాలుష్య కాసారంగా మారింది.

జలం గరళం

కాలుష్య కాసారంగా ముడసర్లోవ జలాశయం

రిజర్వాయర్‌లోకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగునీరు 

అదే నీటిని నగరవాసులకు సరఫరా చేస్తున్న జీవీఎంసీ

ఆ నీటిలో అనారోగ్యానికి దారితీసే రసాయనాలు మోతాదుకు మించి ఉండే అవకాశం

శుద్ధి చేసి పంపే పనులకు కలగని మోక్షం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నగరవాసుల దాహార్తి తీరుస్తున్న ముడసర్లోవ రిజర్వాయర్‌ కాలుష్య కాసారంగా మారింది. రిజర్వాయర్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగునీరు నేరుగా రిజర్వాయర్‌లో కలిసిపోతోంది. దీనివల్ల నీరు కలుషితమవుతోంది. అదే నీటిని నగరవాసులకు సరఫరా చేస్తుండడంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

ముడసర్లోవ పరిసరాల్లోని పైనాపిల్‌ కాలనీ, రామకృష్ణాపురం, ఆరిలోవ, శ్రీకాంత్‌నగర్‌ వంటి ప్రాంతాల నుంచి మురుగునీరు కాలువల ద్వారా రిజర్వాయర్‌లోకి చేరుతోంది. దీనివల్ల నీరు కలుషితమవుతున్నట్టు జీవీఎంసీ అధికారులు కొన్నాళ్ల కిందట గుర్తించారు. సమస్యను పరిష్కరించేందుకుగాను కాలువల ద్వారా చేరుతున్న మురుగు నీటిని ముందుగానే మళ్లించి, పంప్‌హౌస్‌ ద్వారా రిజర్వాయర్‌ ఎగువన ఉన్న పార్క్‌లోని ఫిల్టర్‌ బోర్‌వెల్స్‌కు పంపేలా ప్రతిపాదనలు తయారుచేశారు. ఇందుకోసం కొంత నిధులు కూడా కేటాయించడంతో పంప్‌హౌస్‌ నిర్మించారు. అయితే ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో మురుగునీరు శుద్ధి కాకుండానే రిజర్వాయర్‌లో కలిసిపోతోంది. ఆ నిధులు మాత్రం ఖర్చయి పోయాయని అధికారులు చెబుతున్నా, దేనికోసం ఎంత వెచ్చించారో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు మురుగునీరు రిజర్వాయర్‌లో కలిసిపోవడం వల్ల నీటిలో హానికరమైన బీఓడీ, సీఓడీ వంటి రసాయనాలు మోతాదుకు మించి పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టిసారించాలని కోరుతున్నారు. 



Updated Date - 2022-05-20T06:32:30+05:30 IST