నీటి గండం

ABN , First Publish Date - 2022-09-15T06:22:06+05:30 IST

గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రాజెక్టు గేటు విరిగి కొట్టుకుపోవడం, మరో రెండు గేట్లు దెబ్బతినడంతో నీరంతా వృథాగా సముద్రం పాలైన విషయం విదితమే

నీటి గండం
గుండ్లకమ్మ గేట్ల నుంచి బయటకు వెళ్తున్న నీరు (ఫైల్‌)

గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు ఈ ఏడాది కష్టాలే!

మొత్తం గేట్లకు మరమ్మతులు చేస్తేనే పూర్తిస్థాయిలో నిల్వ

అందుకోసం రూ.9కోట్లు  అవసరమని అధికారుల ప్రతిపాదన

అప్పటివరకు సగం నీరే నిలపగలిగేది

నేటికీ ప్రారంభంకాని పనులు 

ప్రస్తుతం 1.75 టీఎంసీలు నిల్వ

ఎగువ నుంచి వచ్చే నీరు  దిగువకు విడుదల

గుండ్లకమ్మ ఆయకట్టుకు ఈ ఏడాది నీటిగండం పొంచి ఉంది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా గేట్లు విరిగి ప్రాజెక్టు ఖాళీ అయ్యింది. అయితే దెబ్బతిన్న మూడు గేట్ల మరమ్మతులు ఇంతవరకూ ప్రారంభం కాలేదు. అలాగే ఆ మొత్తం గేట్లు కొత్తవి ఏర్పాటు చేస్తేకాని పూర్తిస్థాయిలో నీటిని ప్రాజెక్టులో నిలపలేమని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం రూ.9కోట్ల మేర అవసరమని అంచనా  వేశారు. నిధుల  మంజూరు కోరుతూ  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. తక్షణం గేట్ల మరమ్మతులు ప్రారంభిస్తే పూర్తికావడానికి కనీసం రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు సగానికి మించి నీటిని రిజర్వాయర్‌లో నిలిపేందుకు వీలుండదు. దీంతో ప్రాజెక్టుకు వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. దీనిపై ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు,సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గుండ్లకమ్మ ఆయకట్టు రైతులకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రాజెక్టు గేటు విరిగి కొట్టుకుపోవడం, మరో రెండు గేట్లు దెబ్బతినడంతో నీరంతా వృథాగా సముద్రం పాలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును సందర్శించిన ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు వెంటనే మరమ్మతులు చేపడతామని ఆర్భాటంగా ప్రకటించారు.  అది జరిగి పదిరోజులు దాటినా ఇంతవరకూ ఆ ఊసే లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీరు వస్తోంది. రిజర్వాయర్‌లో 1.75 టీఎంసీల వరకు నిల్వ ఉంచి మిగతా నీటిని వచ్చిన దానిని వచ్చినట్లు సముద్రానికి వదిలేస్తున్నారు. గుండ్లకమ్మ కింద 80,060 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3.85 టీఎంసీలు కాగా 3.50 వరకు నిల్వ చేస్తూ వస్తున్నారు. అయితే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు, ఆ పరిధిలోని 72 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలంటే ఇంచుమించు 12.845 టీఎంసీలు  ఏడాదికి అవసరం. అంటే గుండ్లకమ్మ రిజర్వాయర్‌ ఏడాదిలో నాలుగుసార్లు నిండితేనే ఆ మేర నీరు  అందేది. ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాలతో పాటు సాగర్‌ కాలువల వృథా నీరు పుష్కలంగా ఉండి రిజర్వాయర్‌ నాలుగైదు సార్లు నిండి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుందని గుర్తించి ప్రాజెక్టును నిర్మించారు.


సర్కారు నిర్లక్ష్యంతో..

ఈ ఏడాది కాలువలకు నీరు విడుదల చేయక ముందే గేట్లు దెబ్బతిని దిగువకు నీటిని అధికారులు వదిలేసిన విషయం విదితమే. ప్రాజెక్టు మొత్తం 15 గేట్లు ఉండగా గతనెల 31 రాత్రి మూడో  నెంబరు గేటు విరిగి నీటిలో కొట్టుకుపోయింది. స్కాటప్‌ లాక్స్‌ (డమ్మీ గేటు) పెట్టే ప్రయత్నాలు ఫలించక అప్పటికి రిజర్వాయర్‌లో ఉన్న మూడు టీఎంసీలను దిగువకు వదిలారు. అతర్వాతనే తాత్కాలికంగా అక్కడ డమ్మీ గేటు ఏర్పాటు చేయగలిగారు. అయితే అంతకు ముందే 6, 7 గేట్లు దెబ్బతినడంతో వాటి వద్ద డమ్మీ గేట్లు ఏర్పాటు చేశారు. మరో 9 గేట్లు కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారు. తాజాగా మూడో గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు సందర్శన, టీడీపీ ఎమ్మెల్యేల పర్యటన తదనంతరం ఒత్తిడి నేపథ్యంలో ఒకవైపు తక్షణ, తాత్కాలిక చర్యలు.. మరోవైపు శాశ్వత చర్యలపై అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం డమ్మీ గేట్లు ఉన్నందువల్ల సగం నీటిని మాత్రమే నిలిపి మొత్తం గేట్లకు మరమ్మతులు చేస్తేనే పూర్తిస్థాయి నీటి నిల్వ సాధ్యమన్న అంచనాకు వారు వచ్చినట్లు సమాచారం. 


తక్షణం మరమ్మతులు చేస్తేనే..

గుండ్లకమ్మ ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ మట్టం 24.38 మీటర్లు కాగా  కాలువలకు నీరు 19.3 మీటర్లు దాటితేనే వెళ్తాయి. ఈ నేపథ్యంలో గేట్ల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని 21.90 మీటర్ల వరకు మాత్రమే నింపగలమని గుర్తించి ఆ మేర ఇప్పటికే సాగర్‌ నీటితో నింపారు. ప్రస్తుతం 21.90 మీటర్ల మట్టం అంటే 1.75 టీఎంసీల నీరు ఉంది. పైనుంచి దాదాపు రెండువేల క్యూసెక్కులు వస్తుండగా ఆ మొత్తాన్ని దిగువకు వదిలేస్తున్నారు. కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో ఉన్న 1.75 టీఎంసీలలో డెడ్‌ స్టోరేజీ పోను ఒక టీఎంసీని కాలువల ద్వారా ఆయకట్టుకు ఇవ్వవచ్చు. ఇక 1.75 టీఎంసీల నీటిని నిలపాలంటే దెబ్బతిన్న మూడు గేట్లనే కాక మిగిలిన 12కు కొత్త గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు చెప్తున్నారు. అందుకోసం రూ.9కోట్లు అవసరంగా గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు గతంలోనే రూ.89 లక్షలతో టెండర్‌ అగ్రిమెంట్‌ పూర్తయిన 6, 7 గేట్లతో తాజాగా దెబ్బతిన్న మూడో గేటు మరమ్మతులు ఇంకా ప్రారంభం కాలేదు. టెండర్‌ పొందిన సంస్థను తక్షణం ఆ పనులు ప్రారంభించాలని ఆదేశించడంతోపాటు మిగిలిన వాటి మరమ్మతులు కూడా వారికే ఇచ్చే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. 


అన్నింటికీ మరమ్మతులు చేయాల్సిందే

ఇప్పటికే దెబ్బతిన్న 3, 6 గేట్ల మరమ్మతులు రానున్న వారం పది రోజుల్లో ప్రారంభించినా అవి పూర్తయ్యేసరికి రెండు మూడు మాసాలపైనే పట్టవచ్చని అధికారిక సమాచారం. కనీసం ఒక్కో కొత్త గేటును తయారు చేసి దానిని బిగించి అక్కడ మరో డమ్మీ గేట్లను పెడుతూ ప్రణాళికాబద్ధంగా చేసినా నెలన్నరకు కాని ఒక గేటును పెట్టే అవకాశం లేదు. అంటే ప్రస్తుతం దెబ్బతిన్న గేట్ల మరమ్మతులకే నవంబరు ఆఖరు అవుతుంది. అప్పటికి వాటిని పూర్తిచేసినా పూర్తిస్థాయిలో రిజర్వాయర్‌లో నీటిని నింపడంపై అధికారులు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎగువ నుంచి నీరు వచ్చే క్రమంలో నిల్వ ఉంచితే తుప్పు పట్టి ఉన్న మిగిలిన గేట్లు దెబ్బతింటే అసలుకే మోసం వస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. అందుకే మొత్తం గేట్లు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అందుకు రూ.9కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారులు నివేదించగా ప్రభుత్వ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


ఈ ఏడాది కష్టమే..

ప్రాజెక్టు పరిస్థితిని చూస్తుంటే ఈ ఏడాది గుండ్లకమ్మలో పూర్తిస్థాయిలో నీటిని ఏ మేరకు నిల్వ చేయగలరన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. దీంతో సాగునీటిపై ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో తాము నష్టపోతున్నామన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల కాలువల నీటి కోసం రైతులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే విషయమై సీపీఎం రైతు సంఘం నేత జయంత్‌బాబు నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు ప్రాజెక్టు అధికారులను కలిశారు. గుండ్లకమ్మ ఎడమ కాలువకు తక్షణం నీటిని విడుదల చేయాలని వారు కోరారు. కాగా ప్రభుత్వ ఉన్నతస్థాయిలో ప్రాజెక్టులపై ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక సమీక్ష ఉండగా అనంతరం గుండ్లకమ్మ గేట్ల మరమ్మతులు, నీటి విడుదలపై కూడా స్పష్టత వస్తుందని అధికార వర్గాల సమాచారం. 

Updated Date - 2022-09-15T06:22:06+05:30 IST