ఓట్ల కోసం పదిసార్లు మా చుట్టూ తిరిగావు... నీళ్ల కోసం నీ చుట్టూ తిరగాలా?

ABN , First Publish Date - 2022-06-29T06:20:41+05:30 IST

గత పది రోజులుగా కొళాయిలు సరిగా రావడం లేదంటూ మంగళవారం నగరంలోని 35వ వార్డు మహిళలు రోడ్డెక్కారు.

ఓట్ల కోసం పదిసార్లు మా చుట్టూ తిరిగావు...  నీళ్ల కోసం నీ చుట్టూ తిరగాలా?
కార్పొరేటర్‌ భాస్కరరావుని చుట్టుముట్టి నిలదీస్తున్న స్థానికులు

కార్పొరేటర్‌ విల్లూరి భాస్కరరావును నిలదీసిన మహిళలు

35వ వార్డులోని పలు ప్రాంతాలకు పది రోజులుగా రాని కొళాయిలు

ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోని జీవీఎంసీ అధికారులు

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు

సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ


విశాఖపట్నం/మహరాణిపేట, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): 


గత పది రోజులుగా కొళాయిలు సరిగా రావడం లేదంటూ మంగళవారం నగరంలోని 35వ వార్డు మహిళలు రోడ్డెక్కారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించారు. మహిళలకు నచ్చజెప్పేందుకు వచ్చిన స్థానిక కార్పొరేటర్‌ విల్లూరి భాస్కరరావుపై ‘ఓట్ల కోసం పదిసార్లు వచ్చావు. ఇప్పుడు నీళ్లు కోసం మేమంతా నీ దగ్గరకు రావాలా?’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

జీవీఎంసీ 35వ వార్డు పరిధిలోని మేధర వీధి, పెరికి వీధి, వెలంపేట ప్రాంతాలకు గత పది రోజులుగా కొళాయి నీరు రావడం లేదు. దీనిపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయగా ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారం రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌  అభ్యర్థిగా నిలిచి...గెలిచిన తరువాత వైసీపీ పంచన చేరిన ఆ వార్డు కార్పొరేటర్‌ విల్లూరి భాస్కరరావుకు ఫోన్‌లో సమస్యను వివరించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం ఉదయం స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో  వెలంపేట రామాలయం వద్దకు చేరుకున్నారు. సుమారు 500 మంది మహిళలు, మరికొందరు పురుషులు కలిసి రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలిసి జీవీఎంసీ అధికారులు ఒక ట్యాంకర్‌తో నీటిని పంపించారు. అయితే ఒక ట్యాంకర్‌ నీరు తమకు ఎలా సరిపోతుందంటూ ఆందోళన కొనసాగించారు. మిగిలిన ప్రాంతాలకు గంటసేపు కొళాయి నీరు ఇస్తూ, తమకు మాత్రం కేవలం ఐదు నిమిషాలపాటు వదులుతున్నారని, అది కూడా దుర్వాసన, మలినాలు కలిగిన బురదనీరు అని ఆరోపించారు. ఆ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని, అలాగని మరొక ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పది రోజులపాటు ఏదో బాధపడ్డామని, ఇకపై తమ వల్ల కాదని...సమస్య పరిష్కారం కావాల్సిందేనని పట్టుబట్టారు. ఈ విషయం తెలిసి కార్పొరేటర్‌ భాస్కరరావు అక్కడకు రావడంతో మహిళలు, స్థానికులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ‘నీళ్లు రాకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో...నీకు తెలుసా...నువ్వు ఎక్కడో ఉంటున్నావు...ఇక్కడ వుంటే ఇబ్బందులు నీకు తెలిసేవి’...అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులకు సమాచారం అందడంతో భారీగా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అదే సమయంలో సీపీఎం నేతలు కూడా అక్కడకు చేరుకుని మహిళలకు సంఘీభావం తెలపడంతో పోలీసులు కాసేపు మిన్నకుండిపోయారు. తర్వాత స్థానిక కార్పొరేటర్‌ భాస్కరరావు 24 గంటలలోగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం, సీపీఎం నేతలకు, మహిళలకు పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించి రోడ్డును ఖాళీ చేశారు. 



Updated Date - 2022-06-29T06:20:41+05:30 IST