బిందెడు కష్టాలు

ABN , First Publish Date - 2021-02-26T05:01:02+05:30 IST

విజయనగర వాసులకు వేసవి వచ్చిందంటే హడలే. రోజూ కొళాయి నీరు వస్తుందో! రాదో! అని టెన్షన్‌.. నీరొచ్చినా బందె నిండుతుందో! లేదో! అని ఆందోళన.. ఎండలు పెరుగుతున్న దశలో ఇంకా వేసవి పూర్తిస్థాయిలో రాకపోయినా తాగునీటి కష్టాలు మాత్రం మొదలయ్యాయి. ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు.

బిందెడు కష్టాలు
తాగునీటి కోసం గోతిలో దిగి నీటిని పడుతున్న మహిళలు

విజయనగరంలో తాగునీటికి చింతే

భూ గర్భంలోకి వెళ్తేనే కొళాయి నీరు

వేసవి వస్తే అవస్థే

రోజూ నీరు అందడం కష్టమే

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

విజయనగర వాసులకు వేసవి వచ్చిందంటే హడలే. రోజూ కొళాయి నీరు వస్తుందో! రాదో! అని టెన్షన్‌.. నీరొచ్చినా బందె నిండుతుందో! లేదో! అని ఆందోళన.. ఎండలు పెరుగుతున్న దశలో ఇంకా వేసవి పూర్తిస్థాయిలో రాకపోయినా తాగునీటి కష్టాలు మాత్రం మొదలయ్యాయి. ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. అతి తక్కువ నీరు సరఫరా అవుతున్న కారణంగా భవిష్యత్‌ను తలుచుకుని భయపడుతున్నారు. మరోవైపు ఆ కాస్త కొళాయి నీరు పట్టుకోవాలన్నా ఆరు అడుగులు కిందకు వెళ్లాలి. నీటి సరఫరా విధానంలో లోపాల కారణంగా ప్రతి ఇంటి ముందు గొయ్యి తీసుకుని కొళాయిలు ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి. దీనిపై విన్నపాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

విజయనగరంలో ఏ వీధికి వెళ్లినా ఇంటి ముందు గొయ్యి.. దాంట్లో కొళాయి కనిపిస్తుంది. నీరు వచ్చేటప్పుడు పట్టుకునేందుకు మహిళలు ఆ గోతిలోకి దిగాల్సిదే. ఆ సమయంలో వారు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. కొళాయి నీరు సాధారణ పద్ధతిలో రావాలంటే ప్రధాన పైపు లైను నుంచి భూ ఉపరితలం మీదికి ప్రత్యేక పైపు ఉండాలి. అప్పుడే నీటిని సులువుగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే భూ ఉపరితలంపై పైపు ఏర్పాటు చేస్తే నీరు రావడం లేదు. భూ గర్భంలోని ప్రధాన పైపులైన్‌ ద్వారా మాత్రమే నీరు వస్తోంది. తక్కువ ప్రెజర్‌(ఊర్థ్వపీడనం)లో సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. చేసేదిలేక ఇంటి ముందు కొంత లోతున గొయ్యి తవ్వి భూ గర్భంలో ట్యాపు ఏర్పాటు చేసుకుని నీటిని పడుతున్నారు. భూమిలోనాలుగు నుంచి ఆరు అడుగుల లోతున గొయ్యి తవ్వుతున్నారు. సిమెంట్‌తో కుండీ మాదిరిగా నిర్మించుకుని మెట్లు ఏర్పాటు చేసి కొళాయి నీటిని పడుతున్నారు. ప్రధాన పైపులైన్‌ ద్వారా పూర్తిస్థాయి ప్రెజర్‌తో నీటిని పంపింగ్‌ చేస్తేనే భూ ఉపరితలం వరకు నీరు వస్తుంది. ఆ వైపుగా అధికారులు, నేతలు చొరవ తీసుకోవడం లేదు. 

రెండో రోజులకు ఒకసారే

విజయనగరంలో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. వేసవి వచ్చిందంటే మూడు రోజులకు లేదా వారం రోజులకు ఒకసారి నీరు పంపిణీ చేసిన రోజులున్నాయి. గత వేసవిలో ఏకంగా నెల రోజులకు పైగా తాగునీరు కొళాయిల ద్వారా రాక తీవ్ర అవస్థలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నా తక్కువ నీరు సరఫరా అవుతోంది. ఆ కాస్త నీటికోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. బిందె నిండాలంటే చాలా సమయం పడుతోంది. కొళాయి వచ్చిందంటే మహిళలు విసుక్కునే పరిస్థితి కన్పిస్తోంది.

తాగునీటి పరిష్కారానికి నగరం నలుమూలలా రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నదుల్లో మరిన్ని ఇన్‌ఫిల్టర్‌ బావులు ఏర్పాటు చేసి రిజర్వాయర్లు నింపి కొళాయిలకు నీరు అందించాలని పట్టణ వాసులు ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దశాబ్దం కిందటే తారకరామతీర్థ సాగర్‌ జలాశయం ద్వారా విజయనగరం పట్టణ ప్రజలకు నీరు అందించాలని ప్రతిపాదన తెచ్చారు. నిధులు కూడా కేటాయించారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. 


Updated Date - 2021-02-26T05:01:02+05:30 IST