SVIMS ఆస్పత్రిలో నీటి కష్టాలు.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

ABN , First Publish Date - 2022-03-07T13:18:21+05:30 IST

నిత్యం వందల మంది రోగులు చికిత్స పొందే స్విమ్స్‌ ఆస్పత్రిలో..

SVIMS ఆస్పత్రిలో నీటి కష్టాలు.. ఇదేంటని ప్రశ్నిస్తే..!

తిరుపతి : నిత్యం వందల మంది రోగులు చికిత్స పొందే స్విమ్స్‌ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం వరకు నీటి కోసం రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులకు తప్పనిసరిగా రోజూ తెల్లవారుజామునే స్నానం చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేక వార్డుల్లో రోగుల అవసరార్థం వేడి నీటిని సైతం అందుబాటులో ఉంచుతారు. కానీ ఆదివారం తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలో ఎక్కడా చుక్కనీరు రాకపోవడంతో రోగులకు తిప్పలు తప్పలేదు. ప్రధానంగా సర్జికల్‌, మెడికల్‌ ఆంకాలజీతోపాటు డయాలసిస్‌, న్యూరో, గ్యాస్ట్సో, కార్డియాలజీ వార్డుల్లో నీరు రాలేదు. దీనివల్ల స్నానం మాట అటుంచితే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. 


ఈ నేపథ్యంలో కొందరు రోగుల సహాయకులు బయటి నుంచి నీటిని కొనుగోలు చేశారు. ఏం జరిగిందని సిబ్బందిని ప్రశ్నిస్తే.. నీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నారని సర్దుకోండని సమాధానమిచ్చారని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకనే మధ్యాహ్నం వరకు నీటి సరఫరా నిలిపేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ను వివరణ కోరగా.. ట్యాంకులను శుభ్రం చేస్తుండటం వల్ల కొంత సమయంపాటు నీటి సరఫరా ఆపాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత యథావిధిగా నీటి సరఫరా చేశామన్నారు.

Updated Date - 2022-03-07T13:18:21+05:30 IST