పసర్ల నీరే దిక్కు..!

ABN , First Publish Date - 2021-06-22T04:54:14+05:30 IST

ఆ గ్రామంలో తాగునీళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు.. అయినా విధిలేక గ్రామస్థులు ఆ నీటినే తాగుతున్నారు.

పసర్ల నీరే దిక్కు..!
ప్రాతాళ్ళమెరకలో పసర్లు పట్టిన మంచినీళ్లు

ప్రాతాళ్ళమెరకలో తాగునీటి కష్టాలు

నెలరోజులుగా గుక్కెడు నీటికి ఇక్కట్లు

పసర్లు పట్టిన నీరే గ్రామానికి సరఫరా

కాళ్ళ, జూన్‌ 21 : ఆ గ్రామంలో తాగునీళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు.. అయినా విధిలేక గ్రామస్థులు ఆ నీటినే తాగుతున్నారు. ఇదెక్కడో మారుమూల గ్రామం కాదు.. కాళ్ళ మండల శివారు గ్రామం.. కృష్ణా జిల్లా సరిహద్దు గ్రామం ప్రాతాళ్ళమెరకలో ఇదీ దుస్థితి. గుక్కెడు నీటికి పడరాని పాట్లు పడుతున్నారు. అయినా ఏ ఒక్క అధికారి కనీసం కన్నెత్తి చూడడం లేదు.. పరిష్కా రానికి దారిచూపడం లేదు. గ్రామంలో సుమారు 2 వేల మంది జనాభా ఉంటారు. గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రెండు చెరువులు ఉన్నాయి. అయితే ప్రతీ ఏడాది వేసవిలో తాగునీటి కష్టాలే. దీంతో వేసవి వచ్చిందంటే చాలు గ్రామస్థులు భయపడిపోతారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి.  తాగునీటి చెరువు పూర్తిగా అడుగంటడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు ఆరంభమయ్యాయి. పూర్తిగా అడుగంటి పసర్లుబారిన పడిన మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగేది ఎలా అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజులుగా తాగడానికి గుక్కెడు నీళ్లులేక ప్రజలు విలవిల్లాడిపోతు న్నారు. కొంత మంది నాయకులు అవగాహన లోపంతో అభివృద్ధి పేరిట మంచినీటి చెరువుకి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపడతామని నిండు వేసవిలో ఉన్న నీటిని బయటకు తోడేశారు. దీంతో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారింది.ఈ చెరువులో నీటితో స్నానం చేస్తే దురదులు వస్తున్నాయని, ఇక తాగితే రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం 

చెరువు అభివృద్ధి పేరిట వేసవిలో మంచినీటి బయటకు తోడడం వల్ల ప్రస్తుతం నీరు పూర్తిగా అడుగంటింది.  ఈ నీరు కనీసం పశువులు తాగడానికి కూడా ఉపయోగపడడం లేదు. అవగాహన లోపంతో ఇటువంటి పని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. తాగునీటికి చాలా ఇబ్బందిపడుతున్నాం. వై.సురేష్‌, ప్రాతాళ్ళమెరక  


పసర్లు నీటినే తాగుతున్నారు..

పసర్లు బారి దుర్వాసన వస్తున్న నీటిని పంచాయతీ సిబ్బంది సరఫరా చేస్తున్నారు.ఈ నీటిని తాగితే ప్రజలు అనారోగ్య బారిన పడటం ఖాయం. గ్రామంలో చాలా మంది ఈ నీటినే తాగుతున్నారు. వెంటనే ఈ నీటిని శుభ్రం చేసి స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించి ప్రజారోగ్యాన్ని కాపాడాలి. కె.ఏసేబు, ప్రాతాళ్ళమెరక  


చెరువుకు నీరు పెట్టేందుకు ఏర్పాట్లు  

వేసవి కారణంగా పూర్తిగా నీరు అడుగంటి వాసన రావడం వాస్తవం. శివారు ప్రాంతం కావడంతో కాలువలకు నీరు వదిలినా నిన్నటి వరకు ఉప్పునీరే వచ్చింది.  దీంతో చెరువు నింపలేదు. సోమవారం నుంచి మంచినీరు రావడంతో చెరువు నింపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. –పి.సరళ, ఇన్‌చార్జి కార్యదర్శి, ప్రాతాళ్ళమెరక



Updated Date - 2021-06-22T04:54:14+05:30 IST