అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

ABN , First Publish Date - 2022-08-11T06:30:39+05:30 IST

అంతా మా ఇష్టం.. అడిగేదెవడ్రా అంతా మా ఇష్టం.. అంటూ రెచ్చిపోతున్నారు..

అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
వేల ఎకరాల్లో పంట ముంపు

చినుకు పడితే రైతులకు వణుకే

1200 ఎకరాల్లో పంట మునక

పంట కాలువల ఆక్రమణలే కారణం

అయినా స్పందించని అధికారులు

లబోదిబోమంటున్న రైతాంగం

మంత్రి పట్టించుకోవాలని డిమాండ్‌


అంతా మా ఇష్టం.. అడిగేదెవడ్రా అంతా మా ఇష్టం.. అంటూ రెచ్చిపోతున్నారు.. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ పంట కాలువలను ఆక్రమించేయడంతో చేలు ముంపునకు గురవుతున్నాయి.  పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఎగువ నుం చి వచ్చే వర్షపునీరు, మురుగునీరు దిగువకు పారే అవ కాశం లేకపోవడంతో వర్షాకాలంలో నీరు ఎగువకు ఎగదన్నడంతో పంటపొలాలు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపంగా మారింది..  పంటకాలువలను ఆధునీకరించి ముంపు నుంచి ఆదుకోవాలని  రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


కొవ్వూరు, ఆగస్టు 10 : కొవ్వూరు,గుండుగొలను ఎక్స్‌ ప్రెస్‌హైవే నిర్మాణం.. పంట కాలువల ఆక్రమణ తదితర కారణాలతో కొవ్వూరు, దొమ్మేరు గ్రామాల పరిధిలో వేల ఎకరాల్లో పంట ముంపునకు గురవుతోంది.ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో భాగంగా కొంగలబాడవకు వచ్చే వర్షపునీరు, మురుగునీరు పారే పంట కాలువలను ఆనుకుని ఉన్న రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని అప్పటి జిల్లా కలెక్టర్‌,అధికారులు హామీ ఇచ్చారు. అయితే రహదారి నిర్మాణం పూర్తయినా పంటకాలువలను పట్టించుకోకపోవడంతో గత మూడేళ్లగా కొవ్వూరు, దొమ్మేరు రాష్ట్ర రహదారిలో కృష్ణారావు చెర్వు పరిసరా ల్లోను, దొమ్మేరు గ్రామంలోను రహదారికి ఇరువైపులా సుమారు వెయ్యి ఎకరాల్లో పంట మునిగిపోతుంది. 


నాలుగేళ్లుగా వెన్నాడుతున్న సమస్య..


పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాల్లోని సుమా రు 40 గ్రామాల నుంచి మురుగునీరు, వర్షపునీరు కొవ్వూ రు మండలం పశివేదల వద్ద కొంగలబాడవ చేరుకుంటుంది. గత నాలుగేళ్లగా కాలువలు పూర్తిస్థాయిలో పూడికలు తీయకపోవడం, రహదారుల నిర్మాణం, లేఅవుట్ల వద్ద కాలువలను ఆక్రమించుకుని తూరలు పెట్టడంతో వర్షాకాలంలో నీరు దిగువకు చేరడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చిన్నపాటి వర్షానికే పంట పొలాల్లో మోకా లు లోతులో నీరు నిలిచిపోతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు వారం రోజుల పాటు కొవ్వూరు పట్టణంలోని కృష్ణారావు చెర్వు సమీపంలో మోకాలు లోతు వర్షపునీరు నిలిచి దిగువకు వెళ్లే మార్గం లేక పంటపొలాలు నీట మునిగాయి.దీంతో పంట కుళ్లిపోయి రైతులు భారీ నస్టాలను చవిచూడాల్సి వస్తుంది.ఎకరానికి సుమారు రూ. 15 వేల వరకు నష్టం వాటిల్లిందని,పంటచేతికొచ్చే సమయంలో వర్షాలు కురిస్తే మరింత నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.  కొవ్వూరు పట్టణంలోని గుత్తావారి చెర్వు వద్ద జగనన్న లేఅవుట్‌కు ఇరుపక్కల పంటల పొలాల నుంచి వర్షపునీరు దిగువకు పారె పంటబోదెను అధికారులు మూసివేశారు. దీంతో లేఅవుట్‌కు ఇరుపక్కల ఉన్న సుమారు 200 ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగిపోయాయని, మూసివేసిన పంటబోదెను తిరిగి పూడికతీయించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పంటపొలాల్లో నిలిచిన వర్షపునీరు బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  


కన్నెత్తిచూడని అధికారులు.. 


పంటలు ముంపునకు కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నా..ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి క్షేత్రస్థాయి పర్యటనకు రాలేదని వాపోతున్నారు.ఇకనైనా హోం మం త్రి తానేటి వనిత స్పందించి కొవ్వూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోని పంటకాలువలు,వర్షపునీరు పారే మురుగునీటి కాలువలను పూర్తిస్థాయిలో ఆదునీకరించి పంటముంపు నుంచి రైతులను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.


మోకాలు లోతులో నీరు నిలిచిపోతోంది..


ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం.. కాలువల ఆక్రమణ తదితర కారణాలతో పంట కాలువలు పూడుపోయాయి. వర్షపునీరు దిగువకు పారక పంట పొలాల్లో మోకాలు లోతులో నీరునిలిచి నష్టం వాటిల్లుతోంది. అయినా ఏ ఒక్కరూ సమస్యపై స్పందించడం లేదు.  

-దావాల నాగేశ్వరరావు, కౌలు రైతు, కొవ్వూరు 


పొలాలు చెరువులను తలపిస్తున్నాయి..

చిన్నపాటి వర్షానికి పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు ముంపునకు గురవుతున్నాయి. అధి కారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు.  పంటకాలువలను ఆధునీకరించి ముంపు నుంచి ఆదుకోవాలి. 

- కంఠమణి శ్రీనివాసరావు, రైతు, కొవ్వూరు


Updated Date - 2022-08-11T06:30:39+05:30 IST