60 టీఎంసీలు వస్తేనే నీటి విడుదల

ABN , First Publish Date - 2022-06-25T05:37:57+05:30 IST

ఎస్సారెస్పీలో 60 టీఎంసీల నీరు వస్తేనే ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సివమ్‌ కమిటీ (రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ)లో ఆమోదం తెలిపారు. వర్షాలు భారీగా పడి వరద వచ్చే పరిస్థితులను బట్టి ప్రాజెక్టు నుంచి ప్రధాన కాల్వలు, ఎత్తిపోతల పథకాల కింద సాగయ్యే పంటలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలకు ఆమోదం తెలిపారు.

60 టీఎంసీలు వస్తేనే నీటి విడుదల

ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ,  సరస్వతీ, లక్ష్మీ, ఎత్తిపోతల పథకాలకు అందనున్న సాగు నీరు

ప్రాజెక్టులోకి స్వల్పంగా వస్తున్న వరద

ఇప్పటి వరకు ఎస్సారెస్పీలోకి  2.822 టీఎంసీల నీరు రాక

నిజామాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎస్సారెస్పీలో 60 టీఎంసీల నీరు వస్తేనే  ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సివమ్‌ కమిటీ (రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ)లో ఆమోదం తెలిపారు. వర్షాలు భారీగా పడి  వరద వచ్చే పరిస్థితులను బట్టి ప్రాజెక్టు నుంచి ప్రధాన కాల్వలు, ఎత్తిపోతల పథకాల కింద సాగయ్యే పంటలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. వరితో పాటు ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించారు. ప్రధాన కాల్వల వెంట ఉన్న మొత్తం ఆయకట్టుకు నీటి అవసరం బట్టి ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో విడుదల చేసేందుకు సమావేశంలో నిర్ణయించారు.  శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగిలో సాగునీటిని విడుదల చేస్తున్నారు. వానాకాలంలో భారీగా వర్షాలు పడుతుండడంతో ఆయకట్టుకు అవసరమైన సమయంలో నీటిని విడుదల చేస్తున్నారు. యాసంగిలో మాత్రం ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో పంట వేసేప్పటి నుంచి కోసేంత వరకూ నీటిని అందిస్తున్నారు.

ఫ 4514 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం జూన్‌లో వరద మొదలై అక్టోబరు వరకు వస్తుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరులో వరద ఎక్కువగా ఉంటుంది. ఏటా జూలై చివరన లేదా ఆగస్టులో ప్రాజెక్టు నిండి గేట్లను ఎత్తివేస్తున్నారు. కొన్నిసార్లు సెప్టెంబరులో నే గేట్లను తెరుస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 4514 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జూన్‌ నుంచి ఇప్పటి వరకు 2.822 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో 90టీఎంసీలకుగాను ప్రస్తుతం 21.402 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకుగాను 1065.8 అడుగుల నీళ్లు ఉన్నాయి. అలాగే ఎల్‌ఎండీ ఎగువన ప్రాజెక్టు పరిధిలో మొత్తం 6లక్షల 69వేల 128 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల పరిదిలోని ఆయకట్టుకు సాగునీరును విడుదల చేయనున్నారు. ఈ కాల్వ పరిధిలో 4.65 లక్షల ఎకరాలకు సాగునీరును అందించనున్నారు. ప్రాజెక్టు నుంచి లక్ష్మీ కాల్వ ద్వారా జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరు ఇవ్వనున్నారు. గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు నీటిని అందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నుంచి సరస్వతీ కాల్వ ద్వారా నిర్మల్‌ జిల్లా పరిధిలో ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. కాకతీయ కాల్వ మినహా వీటి పరిధిలో లక్షా 5వేల 128 ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 21టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టులోకి ఇంకా 39టీఎంసీల నీళ్లు వస్తేనే ఆయకట్టుకు విడుదల చేయనున్నారు.

 ఎస్సారెస్పీలో 60టీఎంసీల నీరు వచ్చిన తర్వాత ఆయకట్టుకు  విడుదల చేయాలి సివమ్‌ కమిటీలో నిర్ణయం తీసుకున్నారని ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2022-06-25T05:37:57+05:30 IST