ఒకటినుంచి కాల్వలకు నీరు

ABN , First Publish Date - 2022-05-21T06:21:55+05:30 IST

జూన్‌ మొదటి నుంచే కాల్వలకు నీరు విడుదల చేస్తున్నట్టు శుక్రవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది.

ఒకటినుంచి కాల్వలకు నీరు
మాట్లాడుతున్న మంత్రి పినిపే విశ్వరూప్‌

తొమ్మిది రోజుల్లో కాల్వల మరమ్మతులు పూర్తి కావాలి

మూడో పంట కోసమే ముందస్తుగా నీరు :  ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్‌ వెల్లడి

శివారు భూములకు నీరు ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే అబ్బయ్య

జూన్‌ మొదటి నుంచే కాల్వలకు నీరు విడుదల చేస్తున్నట్టు శుక్రవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి అనుగుణంగానే నీటి విడుదలలో ఖచ్చితమైన తేదీలను పాటిస్తూ సమాంతరంగా మరమ్మతులు, నిర్వహణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. శివారు భూములకు ఈసారి నీరందకుండా ఉండే పరిస్థితులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పట్టుపట్టారు. మూడో పంటకు నీరు ఇవ్వడానికి ముందస్తుగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసినట్టు ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రకటించారు. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో ఈసారి మూడో పంటకు అవకాశం లభించేలా, రైతులు ఆ మేరకు సంసిద్ధులయ్యేలా జూన్‌ ఒకటి నుంచే కాల్వలకు నీరు విడుదల చేయాలని తలపెట్టినట్టు ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్‌ ప్రకటించారు. జిల్లాలోని లక్షా ఏడువేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని అన్నారు. సాగునీరుజిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ కాల్వల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైతే అదనపు యంత్రాలు, మనుషులను కూడా పెంచి పనిచేయాలని, పనులు పూర్తి కావడానికి నిరంతరం శ్రమించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్వలకు నీరు విడుదల జరిగేలోపే ఉన్న ఆటంకాలను, మరమ్మతులను పూర్తి చేయడానికి అనువుగా యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ అమలు చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. 


శివారులకు నీరందితేనే చాలు : ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి

కాల్వల్లో ఇప్పటికే పూడిక పేరుకుపోయింది. సరఫరాకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ తక్షణం తొలగించే కార్యక్రమం చేపట్టాలి. అన్నిటికంటే ముందు రైతులు, అధికారుల పర్యవేక్షణలోనే ఇదంతా సాగాలి. వీలైతే 24 గంటలు పనిచేయడానికి షిఫ్ట్‌ల పద్ధతిన రైతులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. ఇప్పటికే గోదావరి ప్రధాన కాలువ, కృష్ణా ఏలూరు కాలువ శివారులకు నీరందడమే గగనంగా మారిందని, ఈ కారణంగా రైతులు ప్రతీ ఏటా ఆందోళనకు దిగుతున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనమీద ఉందని అన్నారు.  


 అంతా సిద్ధం కండి : కలెక్టర్‌

రాబోయే ఖరీఫ్‌ పనులన్నీ ముందస్తుగా ఆరంభం కావాలి. జూన్‌ మొదటిన కాల్వలకు నీరు విడుదల చేస్తున్నందున రైతులు ఎక్కడికక్కడ సంసిద్ధం కావాలి. మూడో పంటకు అవకాశాలు మెరుగుపర్చుకునే దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలి. సమాంతరంగా మొదటి, రెండో పంటలకు వీలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కాలువల నిర్వహణ బాధ్యతను అధికారులు చెపట్టాల్సిందేనని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. అవసరమైతే ప్రతీరోజూ ఆయా కాల్వల్లో జరిగే పనిని పర్యవేక్షిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ పని ఆరంభంలోను, పని పూర్తయిన తరువాత పని ప్రదేశంలో రెండు ఫొటోలను సిద్ధం చేయాలని, అలాగే కాలువల్లో తొలగించిన మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారో కూడా ఫొటోలు తీసి నిక్షిప్తం చేయాల్సిందేనని ఆదేశించారు.    


జూలైలో మెట్టకు నీరు

మరోవైపు మెట్ట ప్రాంతంలో ఉన్న ఎర్రకాల్వ, తమ్మిలేరు, కొవ్వాడ, పోగొండ రిజర్వాయరు పరిధిలో ఉన్న దాదాపు 43 వేల ఎకరాలకు జూలై ఒకటి నుంచి నీరు విడుదల చేయాలని మరో తీర్మానం ఆమోదించారు. గోదావరి నదిపై ఉన్న కుమారదేవం, వేగేశ్వరపురం, పైడిమెట్ట, గూటాల, పోలవరం, ఎర్రకాలువ లిఫ్ట్‌లు కింద ఎప్పటి నుంచి నీరు విడుదల చేయాలనే దానిపై రైతులతో చర్చించాలని నిర్ణయించారు. ఎ కేటగిరీ కింద కాలువలపై 27 పనులకు రూ.4.69 కోట్లు, డ్రెయిన్లపై 14 పనులకు రూ.3.5 కోట్లు మొత్తం మీద ఈ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జేసీ అరుణ్‌బాబు, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రామకృష్ణ, అగ్రికల్చరల్‌ జేడీ వై.రామకృష్ణ, డిఆర్వో సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.



Updated Date - 2022-05-21T06:21:55+05:30 IST