ప్రకృతివనాలకు.. నీటికొరత!

ABN , First Publish Date - 2021-03-06T05:13:34+05:30 IST

ప్రకృతివనాలకు.. నీటికొరత!

ప్రకృతివనాలకు.. నీటికొరత!

వేసవిలో జటిలం కానున్న సమస్య

శాశ్వత నీటివసతి కల్పనపై లేని స్పష్టత 

బోర్లు, మోటార్ల ఏర్పాటుకు లభించని అనుమతులు

ట్యాంకర్లతో నీటిని అందిస్తున్న పంచాయతీలు

ఆవేదన వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు

సత్తుపల్లి, మార్చి 4: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు రానున్న వేసవిలో నీటి కొరత తప్పనట్టే కనిపిస్తోంది. ఆర ఎకరం నుంచి ఎకరంపైగా విస్తీర్ణంలో పల్లెప్రకృతి వనాలను నిర్మించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 748 పల్లె ప్రకృతివనాల్లో గాను 12,88,707 పండ్లు, పూల మొక్కలతో పాటు ఇతర రకాల మొక్కలను వేశారు.  వీటి సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించారు. 

పంచాయతీల్లో నీటి వసతి ఇబ్బందులు 

జిల్లాలో మొత్తం ప్రకృతి వనాల్లో కొన్నింటికి మాత్రమే శాశ్వత నీటి వసతి ఉంది. 90శాతంపైగా వాటికి శాశ్వత నీటివసతి లేకపోవటంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం రోజూ ఒక్కో మొక్కకు సగటున 1.2లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. ఈ లెక్కన గ్రామ పంచాయతీల్లో నాటిన మొక్కలకు సంబంధించి ఒకటి, రెండు ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలతో పాటు గతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా చెరువు గట్లు, రోడ్ల పక్కన, ఇతర ఓపెన్‌ ప్లాట్లలో నాటిన మొక్కలకు కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి ఎండలు ముదిరితే అయిదారు ట్యాంకర్ల నీటిని మొక్కల సంరక్షణకే వినియోగించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సాగర్‌ కాలువలు, చెరువులు, బోర్ల నుంచి నీటిని ట్యాంకర్లలో నింపి మొక్కలను సంరక్షిస్తున్నారు. వేసవి ఎండల తీవ్రత పెరిగితే ఎక్కువ సంఖ్యలో ట్యాంకర్ల నీటి అవసరం ఉంటుంది. నీటి లభ్యత కూడా తగ్గే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని పలు గ్రామ పంచాయతీల సర్పంచులు చెబుతున్నారు. 

బోర్లకు లంభించని అనుమతులు..

ప్రస్తుతం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలతో పాటు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయ్యాయి. వీటిలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలకు శాశ్వత నీటి వసతి తప్పని సరి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వనరులున్న గ్రామ పంచాయతీలో బోర్లు తవ్వి, మోటార్లు అమర్చాలని తీర్మానాలు చేసినా అనుమతులు లభించటం లేదని కొందరు సర్పంచులు వాపోతున్నారు. వాల్టా చట్టం దృష్టిలో ఉంచుకుని బోర్ల తవ్వకాలకు అనుమతులు రావటం లేదని, శాశ్వతంగా ఉండే పల్లె ప్రకృతి వనాల్లో బోర్లు వేస్తే శాశ్వతంగా నీటి వసతి ఉంటుందని చెబతున్నారు. వీటిని ప్రత్యేక అవసరంగా గుర్తించి బోర్ల తవ్వకానికి అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. బోర్లు తవ్వి శాశ్వత నీటి వసతి కల్పిస్తే పల్లెప్రకృతి వనాల లక్ష్యం నెరవేరుతుందని పేర్కొంటున్నారు. 


Updated Date - 2021-03-06T05:13:34+05:30 IST