సమగ్ర నీటి పథకానికి రూ.4600 కోట్లు

ABN , First Publish Date - 2022-01-21T13:57:40+05:30 IST

ధర్మపురి జిల్లా హొగెనేకల్‌లో రెండో దశ సమగ్ర మంచి నీటి పథకం అమలుకు రూ.4600 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. సచివాలయంలో గురువారం ఉదయం వీడియో

సమగ్ర నీటి పథకానికి రూ.4600 కోట్లు

                           - Cm Stalin ప్రకటన 


చెన్నై: ధర్మపురి జిల్లా హొగెనేకల్‌లో రెండో దశ సమగ్ర మంచి నీటి పథకం అమలుకు రూ.4600 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. సచివాలయంలో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మపురి జిల్లాలో రూ.56.20 కోట్లతో పూర్తయిన 46 పథకాలను ప్రారంభించి, రూ.36.42 కోట్లతో నిర్మించనున్న కొత్త పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి జిల్లాను ప్రత్యేకించి హొగెనేకల్‌ సమగ్రనీటి పథకాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. తాగునీటి కోసం జిల్లా ప్రజలు కిలోమీటర్ల పొడవునా నడచి వెళ్ళి తీసుకొచ్చే వారని, వారి కష్టాలను చూసి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హొగెనేకల్‌ సమగ్ర నీటి పథకాన్ని ప్రకటించి, తనను జపాన్‌కు పంపి ఆ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలో ఆ దేశ నిపుణులతో సంప్రదించి రమ్మని పురమాయించారని గుర్తు చేశారు. తాను జపాన్‌ వెళ్లి అక్కడి నిపుణుల సలహాలు తీసుకుని తిరిగొచ్చి 2008లో ఆ పథకాన్ని ప్రారంభించానన్నారు. 80 శాతం పనులు పూర్తయిన తర్వాత గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఆ పథ కాన్ని పూర్తి చేయకపోవడంతో తాను ఆందోళన చేపట్టి పూర్తి చేయించానని పేర్కొన్నారు. ప్రస్తుతం ధర్మపురి జిల్లా వాసులకు మరింతగా తాగునీరు సరఫరా చేసేందుకు రెండో విడత హొగెనేకల్‌ సమగ్రనీటి పథకం అమలు కోసం రూ..4600 కోట్లు కేటాయించనున్నామని చెప్పారు. కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల తాను ధర్మపురిలో పూర్తయిన పథకాల ప్రారంభోత్సవానికి నేరుగా వెళ్ళలేక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తున్నానని, పరిస్థితి చక్కబడిన తర్వాత ధర్మపురి జిల్లా వాసులను కలుసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం వద్ద మంత్రి కేఎన్‌ నెహ్రూ, నగరపాలక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, పథకాల ప్రారంభోత్సవ వేదికల వద్ద మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, ఎంపీ డాక్టర్‌ టీఎన్‌వీఎస్‌ సెంథిల్‌కుమార్‌, శాసనసభ్యులు జీకే మణి, ఎస్పీ వెంకటేశ్వరన్‌, ధర్మపురి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దివ్యదర్శిని తదితరులు పాల్గొన్నారు.


కళాకారుల వారసులకు రూ.25 వేలు...

సచివాలయంలో జరిగిన మరో కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య, సంగీత, రంగస్థల మండలి ఆధ్వర్యంలో దివంగత కళాకారుల వారసులకు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్‌ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ మూడు రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరచి మృతి చెందిన 15 మంది కళాకారుల వారసులకు తలా రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తంగం తెన్నరసు, పర్యాటక, సంస్కృతీ, దేవాదాయ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి.చంద్రమోహన్‌, రాష్ట్ర సాహిత్య, సంగీత రంగస్థల మండలి అధ్యక్షులు, నటుడు వాగై చంద్రశేఖర్‌, సంచాల కులు ఎస్‌ఆర్‌ గాంధీ, మెంబర్‌ సెక్రటరీ ఎం.రామసామి తదితరులు పాల్గొన్నారు.


7 చోట్ల పురవాస్తు తవ్వకాలు...

రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు చోట్ల పురావస్తు తవ్వకాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న కీళడి, శివకాళై, గంగైకొండ చోళపురం సహా ఏడు చోట్ల తవ్వకాలు జరుప నున్నట్లు తెలిపారు. శివగంగ జిల్లా కీళడి, పరిసర ప్రాంతాలు, తూత్తుకుడి జిల్లా శివకాళై, అరియలూరు జిల్లా గంగైకొండ చోళపురం, కృష్ణగిరి జిల్లా మైలాడుమ్‌పారై, విరుదునగర్‌ జిల్లా వెంబకోటై, తిరునల్వేలి జిల్లా తులుక్కారపట్టి, ధర్మపురి జిల్లా పెరుంబావై వద్ద పురావస్తు తవ్వకాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.

Updated Date - 2022-01-21T13:57:40+05:30 IST