నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది..

Jun 17 2021 @ 00:35AM
ప్రస్తుతం శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో 1091 అడుగులకు గాను 1064.60 అడుగుల (19. 547టీఎంసీలు) నీటి నిల్వ ఉన్న దృశ్యం

- శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం

- ప్రతీయేడు మట్టి, ఇసుక చేరికతో తగ్గిపోతున్న ఎస్సారెస్పీ లోతు

- చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారుల నివేదిక

- సంవత్సరానికి టీఎంసీ సామర్థ్యం తగ్గుతుందని సూచన

- అయినా స్పందించని సర్కారు, అధికార యంత్రాంగం

- జిల్లా ఆయకట్టుపై ప్రభావం చూపనున్న పూడిక

నిజామాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరదతో మట్టి, ఇసుక మేటలు వేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి పోతోంది.  ఇంజనీరింగ్‌ నిపుణులు సూచించిన విధంగా మట్టిని, ఇసుకను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడం వల్ల లోతు తగ్గుతోంది. ప్రతీ సంవ త్సరం ప్రాజెక్టులోకి వరద వస్తున్న నిల్వనీరు తక్కువగా ఉండటం వల్ల ఆయకట్టుకు రెండు పంటలకు అందించే పరిస్థితి ఉండటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయం లో ఇంజనీరింగ్‌ పరిశోధన నిపుణులు ప్రాజెక్టును సర్వే చేసి నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని నివేదిక ఇచ్చారు. వర దతో వచ్చే మట్టి, ఇసుకను  అరికట్టేందుకు చర్యలు తీసు కోవాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ చర్యలను చేపట్టక పోవడం గమనార్హం.

112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును గోదావరి పై 112 టీఎంసీల సామర్థ్యంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టును 1983లో జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి ఏడు సార్లు మినహా, మిగతా అన్ని సార్లు గేట్లను ఎత్తి వరద నీటినిను గోదావరి నదిలోకి వది లారు. ప్రతియేడు ప్రాజెక్టుకు భారీగానే వరద వస్తుంది. గోదావరి, మంజీరా, హరిదా నదులతో పాటు వాగుల ద్వారా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మి, సరస్వతీ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నారు. ప్రాజెక్టుపై ఆధారపడి గుత్ప, అలీసాగర్‌తో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలకు కూడా సాగునీరు అందిస్తున్నారు.

90 టీఎంసీలకు పడిపోయిన సామర్థ్యం

ప్రాజెక్టును నిర్మించిన సమయంలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించా లని నిర్ణయించారు. ఇందు కోసం సాగునీటి కాలువల నిర్మాణం చేపట్టారు. రైతులకు 1983లో ప్రాజెక్టు అందు బాటులోకి వచ్చిన సమయంలో 112 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ సామర్థ్యం.. 2010 వచ్చే వరకు 90 టీఎంసీలకు పడి పోయింది. వరదనీటి ద్వారా మట్టి, ఇసుక వచ్చి చేరడం వల్ల ఎస్సారెస్పీ సామర్థ్యం మరింత తగ్గిందని ఇంజనీరింగ్‌ నిపు ణులు అంచనా వేశారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రం హయాంలో 2014లో రాష్ట్ర ఇంజనీరింగ్‌ పరిశోధన సంస్థ అధికారులు ఎస్సారెస్పీలో 15 రోజుల పాటు సర్వే చేశారు. పోచంపాడు నుంచి బాబ్లీ వరకు పడవలలో ప్రాజెక్టు అంతా తిరుగుతూ హైడ్రోపోనిక్స్‌ విధానంలో సర్వే నిర్వహించారు. ప్రాజెక్టులోని అన్ని ప్రాంతాలు తిరిగి వివరాలు సేకరించారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించారు.

ప్రస్తుతం 80 టీఎంసీలేనని నివేదిక

రాష్ట్ర ఇంజనీరింగ్‌ పరిశోధన సంస్థ వారు నిర్వహించిన సర్వే ప్రకారం ప్రస్తుతం ప్రాజెక్టులో 80.10 టీఎంసీల నీళ్లే నిలువ ఉంటున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నివేదిక ప్రకారం గెజిట్‌ విడుదల చేయాలని ఇంజనీరింగ్‌ నిపుణులు నివేదికలో కోరారు. కాగా, అప్పుడే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో ఈ నివేదికను పట్టించుకోలేదు. ఇప్పటికీ అమలు చేయలేదు. వారి సర్వే ప్రకారం ప్రతీ సంవత్సరం భారీగా మట్టి, ఇసుక వచ్చి చేరుతోంది. దీని వల్ల ప్రతియేడు ఒక టీఎంసీ వరకు సామర్థ్యం తగ్గుతోందని వారు అంచనా వేశారు.

మరింత తగ్గనున్న నిల్వ సామర్థ్యం

ఇలాగే ఇసుక, మట్టి కొన్నేళ్ల పాటు వస్తే నీటి నిల్వ సామర్థ్యం భారీగా తగ్గుతుందని వారు స్పష్టం చేశారు. ఇది ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతుల పంటపొలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ మట్టి, ఇసుక రాకను మొదటనే అరికట్టాలని వారి నివేదిక ద్వారా కోరారు. ప్రాజెక్టు ఎగువన గోదావరిలో వనాలు పెంచాలని, చిన్న, చిన్న చెక్‌డ్యాంలను నిర్మించాలని వారు సూచించారు. గోదావరి నదిలో చెట్లను పెంచుతే ఇసుక, మట్టి ప్రాజెక్టు వరకు రాకుండా ఆగుతుందని వారి నివేదికలో సూచించారు. ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వం ఆ నివేదికను పట్టించు కోలేదు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్య వివరాలను మార్చలేదు. ఇప్పటికీ 90 టీఎంసీల నీళ్లు ఉన్నట్లే నివేదికలు ఇస్తున్నారు. వరద ద్వారా వచ్చే మట్టి, ఇసుక నియంత్రణకు చర్యలు తీసు కోలేదు. ప్రాజెక్టు అధికారులు మాత్రం ఇంజనీరింగ్‌ పరిశోధన సంస్థ సర్వే చేసింది వాస్తవమేనని తెలిపారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని వారు తెలిపారు. ప్రభుత్వం ఎస్సారెస్పీపై దృష్టి సారించి చర్యలు చేపడితే నీటి నిల్వ సామర్థ్యం తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. 

Follow Us on: