పూర్తికాని వాటర్‌ ట్యాంకుల నిర్మాణం

ABN , First Publish Date - 2021-05-15T05:56:32+05:30 IST

మిషన్‌ భగీరఽథ పథకం కింద చేపట్టిన వాటర్‌ట్యాంకుల నిర్మాణాలు పూర్తికాకపోవటంతో నేరుగా సరఫరా అయ్యే నీటి ఉద్ధృతిని తట్టుకోలేక పైప్‌లైన్లు లీకవుతూ నీళ్లు వృథాగా పోతున్నాయి.

పూర్తికాని వాటర్‌ ట్యాంకుల నిర్మాణం
యూపీహెచ్‌ కాలనీలో పైప్‌లైన్‌ లీకవటంతో ఉప్పొంగుతున్న నీళ్లు

 తరచూ లీకవుతున్న మిషన్‌భగీరథ పైప్‌లైన్లు

 వృఽథాగా పోతున్న తాగునీరు

నల్లాల నుంచి వస్తున్న మురుగునీరు

ఖమ్మం కార్పోరేషన్‌, మే 14: మిషన్‌ భగీరఽథ పథకం కింద చేపట్టిన వాటర్‌ట్యాంకుల నిర్మాణాలు పూర్తికాకపోవటంతో నేరుగా సరఫరా అయ్యే నీటి ఉద్ధృతిని తట్టుకోలేక పైప్‌లైన్లు లీకవుతూ నీళ్లు వృథాగా పోతున్నాయి. తరచూ ఏదో ఒకచోట పైప్‌లైన్లు లీకవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


జీళ్లచెరువు నుంచి నేరుగా


కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద మిషన్‌భగీరఽథ రిజర్వాయర్‌ను నిర్మించారు. పాలేరు రిజర్వాయర్‌ నుంచి ఇక్కడికి నీటిని పంపుతున్నారు. ఈ రిజర్వాయర్‌నుంచి ఖమ్మం నగరానికి ప్రతిరోజు 2.80 కోట్ల లీటర్ల తాగునీటిని అత్యధిక సామర్ధ్యం గల పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే ఇలా పైప్‌లైన్ల ద్వారా వచ్చిన నీటిని వాటర్‌ట్యాంకుల్లో నిలువచేసి, వాటికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల ద్దారా ఇంటింటికీ నల్లాల ద్వారా అందిస్తారు. అయితే వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణాలు పూర్తి కాకపోవటంతో నేరుగా పైపులైన్ల ద్వారా మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో సదరు పైపులైనక్ల సామర్ధ్యం తక్కువగా ఉండి, నీటి ఉద్ధృతిని తట్టుకోలేక తరచూ లీకవుతున్నాయి. దీంతో నీళ్లు వృఽథాకావటమే కాకుండా మిషన్‌భగీరధ నల్లాల నుంచి  మురుగునీరు వస్తున్నది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నల్లాల నుంచి ఎర్రటిరంగులో మురుగునీరు రావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీళ్లు వాసన కూడా వస్తున్నాయని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.


నాలుగు ట్యాంకుల నిర్మాణమే పూర్తి


మిషన్‌ భగీరథ పధకం కింద తాగునీరు సరఫరా చేసేందుకు నగరపాలక సంస్థ పరిధిలో 18 ట్యాంకుల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు ట్యాంకుల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ప్రస్తుతం రోటరీనగర్‌, కైకొండాయిగూడెం, ఖానాపురంలోని ఐబీ గెస్ట్‌హౌజ్‌ వద్ద నిర్మాణంలో ఉన్న వాటర్‌ట్యాంక్‌లు పూర్తవుతేనే పైపులకు నీటి సరఫరాలో ఒత్తిడి తగ్గుతుంది. నగరంలో 630 కిలోమీటర్ల మేర మిషన్‌భగీరఽథ పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. అయితే జీళ్లచెరువు వద్ద గుట్టపైనుంచి ధౌజెండ్‌ పైప్‌ల ద్వారా మంచినీళ్లను ఖమ్మం నగరానికి పంపిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పైపులు చిన్నవి కావటంతో నీటి ఒత్తిడి తట్టుకోలేక లీకవుతున్నాయి. వాటర్‌ట్యాంకుల నిర్మాణాలు పూర్తయితే నీటిని ట్యాంకుల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా ఇంటింటికీ సరఫరా చేయవచ్చు. అప్పుడు ఉన్న పైప్‌లైన్ల సామర్ధ్యం సరిపోయి, నీటి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో లీకేజీల సమస్య ఉండదు.


రెండు నెలల్లో సమస్యకు పరిష్కారం: పబ్లిక్‌హెల్త్‌ ఈఈ రంజిత్‌కుమార్‌


 రెండు నెలల్లో పైప్‌లైన్ల లీకేజీ సమస్య పరిష్కారం అవుతుంది. నెలరోజుల్లో నాలుగు వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. దీనివల్ల నేరుగా కాకుండా ట్యాంకులకు అనుసంధానంగా ఉన్న పైప్‌లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం. అప్పుడు లీకేజీలు వస్తే శాశ్వతంగా పరిష్కారం చేయవచ్చు. దీనికి రెండు నెలల సమయం పడుతుంది. జీళ్లచేరువు నుంచి వచ్చిన నీటిని పైప్‌లైన్ల ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేయటం వల్లనే తరచూ లీకేజీల సమస్య ఏర్పడుతున్నది.


Updated Date - 2021-05-15T05:56:32+05:30 IST