సిండి‘కేటుగాళ్లు’

ABN , First Publish Date - 2021-02-25T06:29:13+05:30 IST

కొందరు నీటి ట్యాంకర్ల

సిండి‘కేటుగాళ్లు’

నీటి ట్యాంకర్ల నిర్వహణలో టోకరా

డొమెస్టిక్‌ పేరుతో బుకింగ్‌

కమర్షియల్‌ అవసరాలకు తరలింపు

పలువురు యజమానుల దందా 


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : కొందరు నీటి ట్యాంకర్ల యజమానులు వాటర్‌బోర్డుకు టోకరా పెడుతున్నారు. గృహ అవసరాల పేరుతో వారే ట్యాంకర్లను బుక్‌ చేసుకుని వాటిని వాణిజ్య సముదాయాలకు సరఫరా చేస్తూ దండుకుంటున్నారు. డివిజన్ల వారీగా పలువురు ట్యాంకర్ల యజమానులు సిండికేట్‌గా మారి వాటర్‌బోర్డు ఆదాయానికి దండి కొడుతున్నారు. 

మహా నగరానికి తాగునీటిని అందించే వాటర్‌బోర్డులో నీటి ట్యాంకర్లు చాలా కీలకం. కొన్ని ప్రాంతాలకు బోర్డు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేస్తుంది. దాంతో పాటు కనెక్షన్‌దారులు బుక్‌ చేసుకుంటే ట్యాంకర్లను పంపుతుంది. 5 వేల లీటర్లు, 10 వేల లీటర్ల ట్యాంకర్లు ప్రస్తుతం బోర్డు పరిధిలో ఉన్నాయి. 900కు పైగా ట్యాంకర్లు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. ఒక్కో ట్యాంకర్‌ రోజుకు ఐదుకు పైగానే ట్రిప్పులు తిరుగుతుండగా, వేసవిలో పది ట్రిప్పులకు పైగా తిరుగుతాయి. ట్రిప్పుల ఆధారంగా యాజమాన్యాలకు వాటర్‌బోర్డు చెల్లింపులు చేస్తుంది. బోర్డుకు ట్యాంకర్‌ అప్పగిస్తే యజమానికి ఎలాంటి ఢోకా ఉండదు. ప్రతీ నెలా బిల్లులు వస్తాయనే ధీమా ఉంది. దీంతో కొందరు ఐదు నుంచి పది ట్యాంకర్లను నడుపుతున్నారు. 


అడ్డదారుల్లో ఆదాయం

  వాటర్‌బోర్డు నిబంధనల ప్రకారం డొమెస్టిక్‌ ట్యాంకర్‌ బుక్‌ చేసుకుంటే ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి.  వాణిజ్య అవసరాలకు వినియోగించకూడదు. ఎవరైనా అలా వ్యవహరిస్తే ట్యాంకర్‌ యజమానులు ఫిల్లింగ్‌ స్టేషన్‌ అధికారులకు సమాచారం వచ్చి దాన్ని కమర్షియల్‌ కింద పరిగణించేలా చేయాలి. కానీ కొంతమంది ట్యాంకర్‌ యజమానులే తమకు తెలిసిన డొమెస్టిక్‌ కనెక్షన్ల పేరుతో ట్యాంకర్లను బుక్‌ చేస్తున్నారు. సంబంధిత చిరునామాకు కాకుండా తాము ముందుగానే ఎంచుకున్న కమర్షియల్‌ భవనాలకు వాటిని తరలిస్తూ అడ్డదారుల్లో మరింత ఆదాయం పొందుతున్నారు. 


బోర్డుకు తూట్లు 

కొన్ని హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్వాహకుల ప్రలోభాల కోసం ట్యాంకర్ల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. డొమెస్టిక్‌ ట్యాంకర్‌ 5 వేల లీటర్లకు రూ.500 కాగా, కమర్షియల్‌ అయితే రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. డొమెస్టిక్‌ ట్యాంకర్‌ పదివేల లీటర్లకు రూ.వెయ్యి కాగా, కమర్షియల్‌కు రూ.1700లు, 20 వేల లీటర్లకు రూ.3400గా బోర్డు నిర్ణయించింది. మూడేళ్ల క్రితమే ట్యాంకర్ల ధరలను పెంచగా, అదనపు ఆదాయం కోసం కొంతమంది ట్యాంకర్ల యజమానులు వక్రమార్గం పడుతున్నారు.  ట్యాంకర్లలో అత్యధికం కొంతమంది యూనియన్‌ నేతలకు చెందినవే ఉన్నాయి. పలు డివిజన్లలో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. స్థానికంగా ఫిల్లింగ్‌ స్టేషన్ల సిబ్బందిని, మేనేజర్లు, డీజీఎం, జీఎంలను ప్రభావితం చేసే విధంగా పలువురు నేతలు వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా బోర్డు ఆదాయానికి తూట్లు పొడుస్తున్నారు.


Updated Date - 2021-02-25T06:29:13+05:30 IST