వాటర్‌బోర్డు అలర్ట్‌

Jun 16 2021 @ 10:02AM

వానాకాలంలో ప్రత్యేక కార్యాచరణ  

రూ.8కోట్లతో మ్యాన్‌హోళ్ల మరమ్మతు


హైదరాబాద్‌ సిటీ: వర్షాకాలంలో తాగునీటి, మురుగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌బోర్డు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు రంగంలోకి దిగారు. నగరంలో ఎక్కడా మ్యాన్‌హోళ్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. రూ.8 కోట్ల వ్యయంతో ధ్వంసమైన, రోడ్డుకు సమాంతరంగా లేని మ్యాన్‌హోళ్ల మరమ్మతులు చేసే పనులు ఆరంభమయ్యాయి. ఇందుకోసం ప్రతీ డివిజన్‌కు ఒకటి చొప్పున అత్యవసర బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మూడు షిఫ్టుల్లో నోడల్‌ ఆఫీసర్లు పని చేయనున్నారు. సివరేజీ ఓవర్‌ ఫ్లో సమస్యల పరిష్కారానికి ప్రతీ డివిజన్‌కు ఒక అదనపు మినీ ఎయిర్‌ టెక్‌ మిషన్‌ను అందుబాటులో ఉంచారు.


మ్యాన్‌హోల్‌ తెరవద్దు.. 

ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్‌హోల్‌ మూత లు తెరవకూడదని, ఎక్కడైనా మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా వాటర్‌బోర్డు కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 155313కి కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎండీ దానకిషోర్‌ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఎండీ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షం వస్తే నీళ్లు నిలిచే 140 ప్రాంతాల్లోను, లోతుగా ఉండే మ్యాన్‌హోల్స్‌కు సెఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షం వచ్చే సమయంలో సివరేజీ సూపర్‌ వైజర్లను నియమించాలని, లోతుగా ఉన్న మ్యాన్‌ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉచిత మంచినీటి పథకం పురోగతి, రెవెన్యూ తదితర అంశాలపై కూడా దానకిషోర్‌ సమీక్షించారు. సమావేశంలో బోర్డు డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, వీఎల్‌.ప్రవీణ్‌ కుమార్‌లతో పాటు ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.

Follow Us on: