
- ఆరబోసిన ధాన్యంపై అకాల వర్షం
- కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వడ్లు
- ఈదురుగాలులకు రాలిన మామిడి
- ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం
- ధాన్యం వెంటనే కొనాలని రైతుల ఆందోళనలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): అన్నదాతల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. కళ్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లను నిండా ముంచింది. ధాన్యం రాశులపై కప్పేందుకు తగినన్ని టార్పాలిన్లు లేకపోవడంతో రైతుల కళ్లముందే వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం అర్ధరాత్రి, సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా.. కాంటాలు వేయడం లేదని.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిపోయిందని పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలకు దిగారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. నవీపేట మండలంలో 6.5 సెం.మీ, నిజామాబాద్ రూరల్‌లో 5.9, మాక్లూర్‌లో 4.37, నిజామాబాద్ నార్త్‌లో 3.15, ఎడపల్లిలో 2.28, నిజామాబాద్ సౌత్‌లో 2.34 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, మెండోరా, బాల్కొండ, సిరికొండ, నిజామాబాద్ రూరల్, మోపాల్, నందిపేట, మాక్లూర్, నవీపేట, మాక్లూర్, భీంగల్ రూరల్‌తో పాటు పలు మండలాల పరిధిలో కొనుగోలు కేంద్రాలు, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఈదురుగాలులకు సిరికొండ, భీమ్‌గల్ తదితర ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట, పిట్లం, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్ తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,200 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్, కలెక్టర్ జితేష్ పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా, మామడ, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. నువ్వు, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..
జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, జగిత్యాల రూరల్, ధర్మపురి, పెగడపల్లి, వెల్గటూరు మండలాల్లో సుమారు 721 హెక్టార్లలో మామిడి పంట దెబ్బతింది. ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాల్లో సుమారు 1,400 ధాన్యం బస్తాల ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 5 వేల టన్నుల ధాన్యానికి నష్టం వాటిల్లిందని రైతులు చెబుతుండగా, 4 వేల బస్తాల వరకు వడ్లు తడిశాయని, వాటిని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, చందుర్తి, ముస్తాబాద్, కోనరావుపేట, రుద్రంగి, బోయినపల్లి, వేములవాడ, వీర్నపల్లి, మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో 25 ఎకరాల్లో వరి, పది ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని మండల వ్యవసాయాధికారి తెలిపారు. మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు, కళ్లాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జిల్లాలో 32.86 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిన్నశంకరంపేట మండలంలో 8.28 సెం.మీ వర్షపాతం నమోదైంది. హవేళీఘనపూర్, కొల్చారం, అల్లాదుర్గం మండలాల్లో భారీ వర్షం కురిసింది.
ధాన్యం కొనాలని ఆందోళనలు..
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్‌లో రైతులు ధర్నా చేసి, సొసైటీకి తాళం వేశారు. ఆర్మూర్‌లోని దోబీ ఘాట్, నందిపేట మండలం తల్వేదలో ధర్నా చేశారు. వరి కోసి నెలన్నర అవుతున్నా.. ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ భీంగల్ మండలం సుదర్శన్‌నగర్ తండాలో రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ముస్తాబాద్, చందుర్తి మండల కేంద్రాల్లో రాస్తారోకో చేశారు. క్వింటాల్‌కు ఏడు కిలోల ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి ఎక్స్ రోడ్డు వద్ద.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ చెక్‌పోస్టు వద్ద అన్నదాతలు రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని జనగామ జిల్లా ఓబుల్కేశ్వాపురంలో రైతులు ఆందోళనకు దిగారు.
నష్టంపై మంత్రి కేటీఆర్ ఆరా..
ిసిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యంపై మంత్రి కేటీఆర్ సోమవారం కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుదని భరోసా ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో పర్యటించి వివరాలను తెలుసుకున్నారు.

అండమాన్‌ను తాకిన నైరుతి
విశాఖపట్నం: హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి బలమైన నైరుతి గాలులు వీస్తూ.. అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో అనేక ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం పరిసరాలకు గతేడాది మే 21న వచ్చాయి. కాగా వచ్చే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని ఐఎండీ పేర్కొంది. కాగా.. తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.