వర్గీకరణకు మార్గం

ABN , First Publish Date - 2020-08-29T05:50:04+05:30 IST

షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత సుప్రీంకోర్టు ధర్మాసనం విభేదించింది.

వర్గీకరణకు మార్గం

షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ప్రస్తుత సుప్రీంకోర్టు ధర్మాసనం విభేదించింది. పంజాబ్‌కు చెందిన ఒక కేసును జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం విచారిస్తూ రాష్ట్రాలకు ఆ హక్కు ఉన్నదని అభిప్రాయపడింది. అతి ముఖ్యమైన ఈ అంశం మీద న్యాయనిర్ణయం చేసేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్దేకు నివేదన పంపింది. 2004 నాటి తీర్పు ఇచ్చిన ధర్మాసనం, ఇప్పుడు విభేదించిన ధర్మాసనం రెండూ ఐదుగురు సభ్యులవే కాబట్టి, సమీక్షించే ధర్మాసనంలో సభ్యులు ఏడుగురు లేదా తొమ్మిది మంది ఉండే అవకాశం ఉన్నది. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన షెడ్యూల్డు కులాల వర్గీకరణపై వ్యాజ్యంలో 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అధికారం కేవలం పార్లమెంటుకే ఉంటుందని, రాష్ట్రాలకు ఆ అధికారం లేదని తీర్పు చెప్పింది. దానితో, అతి కొద్దికాలం మాత్రమే వర్గీకరణ అమలు జరిగినట్టయింది. అప్పటి నుంచి వర్గీకరణ కోరే ఉద్యమకారులు తమ డిమాండ్‌ సాధనకై సంప్రదింపులు, మద్దతు సమీకరణలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. గురువారం నాటి సుప్రీంకోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాలలోనే కాక, దేశంలోని తక్కిన రాష్ట్రాలలో కూడా షెడ్యూల్డు కులాల వర్గీకరణ మార్గాన్ని సానుకూలం చేసింది. ‘‘సామాజికంగా, విద్యా విషయికంగా వెనుకబడిన వర్గాల్లో రిజర్వేషన్లను వర్గీకరించవచ్చునని ఇందిరా సహానీ కేసులో ఆనాటి బెంచి తీర్పు చెప్పింది. ఎస్సీ ఎస్టీల అంశం కూడా ఆర్టికల్‌ 16 కిందికే వస్తుంది కాబట్టి, ఆ వర్గీకరణ అనుమతి వీరికి కూడా వర్తిస్తుందనడానికి ఆస్కారం ఉన్నది..’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాటి తీర్పులో వ్యాఖ్యానించింది.


తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ కోసం పోరాడుతూ వస్తున్న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీస్‌) సహజంగానే ఈ పరిణామాన్ని హర్షించింది. ‘‘ఈ తీర్పు వేలాది ఉపకులాలకు ఊరట కలిగించింది, తాత్కాలికంగా అడ్డంకులు ఎదురైనా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే’’ అని వర్గీకరణ ఉద్యమ నాయకులు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడే విస్తృత ధర్మాసనం త్వరితగతిన విచారించి, వర్గీకరణ జరిపే హక్కు రాష్ట్రాలకు ఉన్నదని నిర్ధారించిన పక్షంలో, రాష్ట్రప్రభుత్వాలపై ఉద్యమకారుల ఒత్తిడి పెరుగుతుంది. ఈలోగా, వివిధ రాష్ట్రప్రభుత్వాలు మరోసారి వర్గీకరణపై తమ వైఖరిని స్పష్టం చేయవలసి ఉంటుంది. వర్గీకరణ అమలుచేయాలని కోరుతూ ఉమ్మడి రాష్ట్ర శాసనసభ అనేక మార్లు తీర్మానాలు చేసింది. ఉద్యమం అనేక కారణాల వల్ల బలహీనంగా కనిపించినప్పుడల్లా పూర్వం సమర్థించిన పార్టీలే మౌనం వహించడం జరుగుతూ వస్తోంది. 


సృజనాత్మకమైన, మిలిటెంట్‌ పోరాటం చేయడం వల్ల ఎమ్మార్పీస్‌ ప్రసిద్ధమయింది కానీ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌ కానీ, ప్రతిపాదన కానీ కొత్తది కాదు. షెడ్యూల్డు కులాలలో ఉద్యోగ నియామకాల్లోని రిజర్వేషన్లలో ఉపరిజర్వేషన్లను అమలుచేసే విధానాన్ని పంజాబ్‌ రాష్ట్రం 1975లోనే ప్రవేశపెట్టింది. హర్యానా కూడా ఉద్యోగాలతో పాటు, విద్యాప్రవేశాలలో కూడా ఉపరిజర్వేషన్ల విధానం అమలుకు 1994లో ప్రయత్నించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా హర్యానా మాదిరి ప్రయత్నమే జరిగింది. అతి కొద్దికాలం వర్గీకరణ విధానం అమలు జరిగింది కూడా. 1976 నాటి షెడ్యూల్డు కులాల, తెగల (సవరణ) చట్టం ప్రకారం నాటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 59 షెడ్యూల్డు కులాలు, ఉపకులాలు ఉన్నాయి. వీటన్నిటిలోను కేవలం రెండు కులాలు– మాల, మాదిగ---– మొత్తం షెడ్యూల్డు కులాల జనాభాలో 90 శాతం ఉండగా, తక్కిన పదిశాతం జనాభా తక్కిన కులాలది. మూకుమ్మడిగా అమలుచేసే రిజర్వేషన్ల కారణంగా అందరికీ సమన్యాయం జరగడం లేదన్న భావన మొదటి నుంచి ఉన్నప్పటికీ, 1990 నాటికి బలపడింది. అప్పటికే బలపడుతూ వస్తున్న దళిత ఉద్యమాల వాతావరణంలో, ఉపరిజర్వేషన్ల కోసం డిమాండ్‌ సంబంధిత కులాలలో భగ్గుమంది. దండోరా ఉద్యమం ప్రారంభమైంది. రామచంద్రరాజు కమిషన్‌ దగ్గర నుంచి ఉషా మెహ్రా కమిషన్‌ దాకా అందరూ వర్గీకరణలోని న్యాయాన్ని ప్రకటించినవారే. 


వర్గీకరణ అనుకూలత – ప్రతికూలతలు వివిధ రాజకీయ పక్షాల ఎన్నికల వ్యూహాలతో ముడిపడి కనిపిస్తాయి. వర్గీకరణకు ఉన్న అవరోధాలు తొలగిపోతే, భారతీయ జనతాపార్టీ తన విజయవ్యూహంలో భాగంగా, అనేక రాష్ట్రాలలో వర్గీకరణను అమలు చేయవచ్చు. తెలంగాణ వంటి రాష్ట్రాలలో అయిష్టంగా అయినా అమలు చేయవలసి రావచ్చు. మాయావతి బలహీనంగా కనిపిస్తున్న దశలో దేశంలో దళిత శక్తులకు కొత్త రాజకీయ నాయకత్వం అవతరించడానికి కూడా మార్గం ఏర్పడవచ్చు. ఈ తీర్పు పర్యవసానాలను కేవలం రిజర్వేషన్ల అమలుకు పరిమితం చేసి చూడలేము. 


అయితే, కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ వల్ల స్థానికమైన సమస్యలు ఉండవచ్చు. అక్కడ బాధిత ఉపకులాలు ఇంకా బలం పుంజుకోకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత జనాభా దామాషాలలో మార్పులు కొన్ని సాంకేతిక సమస్యలకు దారితీయవచ్చు. ఇవేవీ, ఒక న్యాయమైన పంపకానికి అడ్డు రాకూడదు. నిజానికి, వర్గీకరణ నినాదం అసమానతలను తొలగించమంటున్నది తప్ప, ఒక వర్గానికి అధిక వాటా ఇమ్మని అడగడం లేదు. అవాంతరాలన్నిటిని అధిగమించి, న్యాయమైన నిర్ణయం జరగడానికి ఈ తీర్పుతో మొదటి అడుగు పడిందనవచ్చు. n

Updated Date - 2020-08-29T05:50:04+05:30 IST