మేం ఒప్పుకోం!

ABN , First Publish Date - 2021-11-30T04:47:24+05:30 IST

ఓటీఎస్‌ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకుంది. స్త్రీ నిధి నుంచి రుణం అందిస్తామని ప్రకటించింది. దీనిపై మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరి రుణానికి గ్రూపు సభ్యులందరూ బాధ్యత వహించాల్సి రావడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మేం ఒప్పుకోం!

ఓటీఎస్‌పై మహిళా సంఘాల్లో చర్చ

స్త్రీ నిధి నుంచి రుణంపై వ్యతిరేకత

సభ్యులందరికీ బాధ్యతలు సరికాదంటున్న వైనం

చెల్లింపులకు ముందుకురాని లబ్ధిదారులు

గ్రామాల్లో వెనుకడుగు


ఓటీఎస్‌ను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకుంది. స్త్రీ నిధి నుంచి రుణం అందిస్తామని ప్రకటించింది. దీనిపై మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరి రుణానికి గ్రూపు సభ్యులందరూ బాధ్యత వహించాల్సి రావడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ నిధి నుంచి రుణాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా... మహిళా సంఘాల నుంచి తీర్మానాలు రావడం కష్టం కావొచ్చు. 

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసిన ఇళ్లపై హక్కుల కోసం ప్రభుత్వం వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లబ్ధిదారులు గ్రామాల్లో రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలు చెల్లిస్తే పూర్తి గృహ హక్కులు బదలాయిస్తామన్నది ఈ విధాన ఉద్దేశం. అనేక మంది లబ్ధిదారులు ఈ మొత్తాన్ని చెల్లించేం దుకు వెనుకంజ వేస్తున్నారు. ‘ఎప్పుడో నిర్మించుకున్న ఇంటిపై ఇప్పుడు హక్కు ఏమిటి?.. సబ్సిడీ ఇచ్చిన నిధులను తిరిగి అడుగుతారేంటి? అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడెలా తెలుస్తుంది.? పేదలం ఎలా చెల్లించగలం?’ అంటూ  అధికారులకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. మహిళా సంఘాల సభ్యులుగా ఉన్న వారికి స్త్రీ నిధి నుంచి రుణం అందిస్తామని... ఈ నిధులను ఓటీఎస్‌కు వినియోగించుకోవచ్చని చెబుతోంది. ఈ విధానాన్ని మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  సంఘాల సభ్యులంతా సమావేశమై తీర్మానం చేయడం ద్వారా స్త్రీ నిధి నుంచి రుణాన్ని మంజూరు చేస్తారు. అంటే సభ్యులందరి సమ్మతి అవసరం. ఓటీఎస్‌ కోసం రుణ అవసరం గ్రూపులోని కొద్దిమంది సభ్యులకు మాత్రమే ఉంటుంది. సంఘ తీర్మానం ద్వారా స్ర్తీ నిధి రుణం మంజూరైనపుడు సభ్యులందరికీ రుణ బాధఽ్యత ఉంటుంది. ఒకరిద్దరు రుణం తీసుకుంటే మిగిలిన వారంతా బాధ్యులు కావడానికి వారంతా ఇష్టపడడం లేదు. ఏ సమస్య వచ్చినా సభ్యులందరి మెడకు చుట్టుకుంటుందన్న భావన వారిలో గూడుకట్టుకుంటోంది. దీంతో తీర్మానాలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. డీఆర్‌డీఏ అధికారులు, జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఓటిఎస్‌పై రోజూ ప్రకటనలు ఇస్తున్నారు. ఓటీఎస్‌ వేగవంతం చేయాలని వలంటీర్‌ నుంచి మండలాభివృద్ధి అధికారి వరకు, గృహ నిర్మాణ శాఖ సిబ్బందిపైనా ఒత్తిడి ఉంటోంది. కానీ లబ్ధిదారులు అంతంతమాత్రంగానే ముందుకు వస్తున్నారు.  పట్టణ ప్రాంతాల్లో భారీగా భూముల ధరలు ఉన్నచోట్ల మాత్రం అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో  చాలా వరకు వెనకడుగు వేస్తున్నారు. స్త్రీ నిధి నుంచి రుణాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. మహిళా సంఘాల నుంచి తీర్మానాలు రావడం కష్టమే. జిల్లాలో 3.20 లక్షల మంది లబ్ధిదారులు ఓటీఎస్‌కు అర్హులుగా అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఇంకా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ సాగుతూనే ఉంది. 

 వివిధ ప్రభుత్వ పథకాల కింద 1983 నుంచి 2014 మధ్య కాలంలో గృహ నిర్మాణాలు చేపట్టిన వారికి ఓటీఎస్‌ అమలు చేస్తున్నారు. 1983-84లో గృహ నిర్మాణ యూనిట్‌ విలువ రూ.4వేలుగా ఉండేది. తరువాత దీనిని 1985లో రూ.6వేలుకు పెంచారు. అప్పట్లో యూనిట్‌ విలువ చాలా తక్కువగా ఉండేది. ఇటువంటి గ్రామీణ లబ్ధిదారులు కూడా రూ.10వేలు చెల్లించాలనడంతో వారు వెనుకంజ వేస్తున్నారు. దీనికి తోడు అప్పట్లో నిర్మించిన చాలా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటికి ఇప్పుడు డబ్బులు చెల్లించాలనడం సరికాదంటున్నారు.

సభ్యులందరి తీర్మానంతోనే రుణం

స్త్రీ నిధి రుణాల అంశాన్ని డీఆర్‌డీఏ పీడీ అశోక్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా సభ్యులందరి తీర్మానం ద్వారానే రుణాన్ని మంజూరు చేస్తామని వెల్లడించారు.  రుణం పొందిన లబ్ధిదారు పూర్తి బాధ్యతగా తీసుకుని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ ఎవరికైనా అనుమానాలుంటే హక్కులు పొందిన పత్రాలను గ్రూపు నిర్వాహకుల వద్ద అందరి సమ్మతితో ఉంచుకునేలా సభ్యులు చూసుకోవాలని సూచించారు.



Updated Date - 2021-11-30T04:47:24+05:30 IST