రాజ్యాంగ నిర్దేశాలను శిరసావహిస్తున్నామా?

ABN , First Publish Date - 2020-11-26T05:50:23+05:30 IST

స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం జరిగిన పోరాటంలో అంతిమదశగా రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడింది. దేశ స్వాతంత్ర్యం కోసం కోట్లాది భారతీయులు మహత్తర త్యాగాలు చేశారు....

రాజ్యాంగ నిర్దేశాలను శిరసావహిస్తున్నామా?

భారత రాజ్యాంగం ప్రవచించిన వైజ్ఞానిక జిజ్ఞాసను ప్రజల్లో పాదుకునేలా పౌరసమాజం కృషి చేయాలి. ప్రజల అభ్యున్నతికి గాను విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలను రాజ్యమే నిర్వహించాలి. మతప్రమేయం లేని లౌకిక, ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం ప్రజాతంత్ర ఉద్యమం చేపట్టాల్సిన చారిత్రక బాధ్యత మన ముందు ఉంది.


స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం జరిగిన పోరాటంలో అంతిమదశగా రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడింది. దేశ స్వాతంత్ర్యం కోసం కోట్లాది భారతీయులు మహత్తర త్యాగాలు చేశారు. వారి ఆకాంక్షల ప్రతిబింబంగా రాజ్యాంగం రూపొందింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. ఉత్కృష్ట మానవ విలువలను ఆవిష్కరించిన ఈ ‘పవిత్ర గ్రంథం’ డాక్టర్ అంబేడ్కర్, నెహ్రూ, పటేల్, ఆజాద్ తదితర జాతీయోద్యమ మహామహులు జాతికి అందించిన విశిష్ట మార్గదర్శిని. ప్రతి తరం వారూ వారికి సర్వదా కృతజ్ఞతతో ఉండాలి. రాజ్యాంగ విలువలను, నైతికతను రక్షిస్తూ మనం దాని స్ఫూర్తి నిలబెట్టాలి. అయితే భారత రాజ్యాంగం స్ఫూర్తి సజీవంగా ఉందా? లేదు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఆ వాస్తవానికి తార్కాణాలు. రాజ్యాంగవిలువలను ఉల్లంఘిస్తున్న కేంద్రపాలకులు మానవ వికాస కేంద్ర విద్యను కుడా భ్రష్టు పట్టిస్తున్నారు.


భారత రాజ్యాంగం అధికరణ 51A ప్రస్తావించిన పదకొండు ప్రాథమిక విధులలో ‘వైజ్ఞానిక దృక్పథాన్ని ,మానవ జిజ్ఞాసను, పరిశోధనా, సంస్కరణ స్ఫూర్తిని పెంచుకోవడం’ కీలకమైనది. జాతీయోద్యమ ఆకాంక్షల మేరకు ఆధునిక ప్రపంచంలో భారత్‌కు సముచితమైన స్థానాన్ని సముపార్జించడానికై తొలి ప్రధాని నెహ్రూ అవిరళ కృషి జరిపారు. నెహ్రూ తన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో వైజ్ఞానిక దృక్పథాన్ని వివరిస్తూ ‘అది ఒక శాస్త్రీయ పద్ధతి. సత్యం, నూతన జ్ఞానాన్ని సమకూర్చే మార్గం’ అని పేర్కొన్నారు. అంతిమగా విజ్ఞానశాస్త్రం మానవ జీవనానికి, సంక్షేమానికి తోడ్పడాలని ఆయన భావించారు. ప్రజల ప్రగతికి ఉపయోగపడే మౌలికరంగాలను ప్రభుత్వమే నిర్వహించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి అనుగుణంగా తన హయాంలో ఎన్నో ఉన్నత విద్యాసంస్థలను ఆయన నెలకొల్పారు. మానవ ప్రగతి ,సమత మమతలకు అవరోధంగా ఉండే సనాతన విలువలను తొలగించటానికి, పునరుజ్జీవన భారతావనిని నిర్మించడానికి వైజ్ఞానిక విద్య మహత్తర పాత్ర నిర్వర్తిస్తుందని పశ్చిమదేశాల అనుభవం ద్వారా ఆయన గ్రహించారు. బుద్ధుడు ప్రతిపాదించిన కార్యకారణ సిద్ధాంతాన్ని ఆవాహన చేసుకున్న నెహ్రూ మతం మనస్సును మూసివేస్తుందని, భావోద్వేగం, మూఢత్వం, అసహనాలను ప్రజలలో కలిగిస్తుందని; శాస్త్రీయ ధోరణులను, వివేచనను విద్యార్థులలో నాటడం ద్వారా వైజ్ఞానిక దృక్పథం పురోగతికి తోడ్పడాలని నెహ్రూ నిర్దేశించారు. 


ఆయన 1958లో  శాస్త్ర, సాంకేతిక విధానానికి రూపకల్పన చేశారు. హోమి జహంగీర్ బాబా సారథ్యంలో అణుశక్తి కమిషన్‌ను స్థాపించాకే శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం స్వావలంబన కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎర్పాటు చేశారు. సివి రామన్, జెసి ఘోష్, శాంతి స్వరూప్ భట్నాగర్‌ల సహకారంతో ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ను దేశవ్యాప్తంగా విస్తరింపచేసి అరవైకి పైగా పరిశోధనా కేంద్రాలను ప్రారంభించారు. ఇందిరాగాంధీ హయాంలో 1970లో ఏర్పాటైన ‘నేషనల్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ ఈ కృషిని మరింత ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సంస్థలు ఏరోస్పేస్, మైనింగ్, పెట్రోలియం, పర్యావరణం, వ్యవసాయం, నిర్మాణరంగాలలో అనుపమాన పరిశోధనలు చేస్తున్నాయి. అవి దాదాపు 1500 లకు పైగా నూతన అవిష్కరణలను కావించాయి. ప్రపంచ మేధా సంపత్తి హక్కుల సంస్థ ప్రకారం అత్యధిక పేటంట్లను కలిగిఉన్న దేశాలలో భారత్ ఏడోస్థానంలో ఉంది. 


నెహ్రూ, ఇందిర హయాంలో సమృద్ధిగా నిధులు పొందిన పరిశోధనా సంస్థలకు తర్వాత కాలంలో కేటాయింపులు తగ్గుముఖం పట్టాయి. స్థూల దేశీయోత్పత్తిలో  శాస్త్ర, సాంకేతిక రంగాలకు మూడు శాతం కేటాయించాల్సి ఉండగా గత ఇరవై సంవత్సరాలుగా సగటున 0.7శాతం నిధులను మాత్రమే అందజేస్తున్నారు. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఈ కేటాయింపులు 0.4శాతానికి పడిపోయాయి. జిడిపిలో అమెరికా 3శాతం, చైనా 2శాతం, ఇజ్రాయేల్, కొరియా 4శాతం కేటాయిస్తున్నాయి. మోదీ పాలనలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలలో జఢత్వం నెలకొంది. మానవ నాగరికతా వికాసం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి గుడ్డి విశ్వాసాలను మూఢత్వాన్ని తొలగిస్తూ అపూర్వ మేధోశ్రమతో ఆవిష్కరణలు చేసిన భారతీయ, ప్రపంచ శాస్త్రవేత్తల కృషిని అగౌరవ పరిచే కుహనా సైన్స్ ధోరణులను వ్యాప్తి చెందిస్తున్నారు. 


ప్రతి జనవరిలో జరిగే భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లు సైతం ఈ కుహనా ధోరణులకు ప్రోత్సాహమివ్వడం అత్యంత శోచనీయం. 1974లో బెంగలూరు ఐఐఎస్‌లో సమావేశమైన భారత శాస్త్రవేత్తలు వ్యక్తిగత మత విశ్వాసాలకు ,పురాణ సంబంధ అంశాలకు శాస్త్రీయత విలువను అపాదించకూడదని, శాస్త్రీయ పరిశోధనలలో వాటికి తావివ్వకూడదని తీర్మానించారు. ప్రస్తుత పాలకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న శాస్త్రవేత్తలు 2015 ముంబై, 2016 మైసూరు, 2017 తిరుపతి, 2018 ఇంఫాల్, 2019 జలంధర్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను కాల్పనిక గాథల వినోద ప్రధాన వేదికలుగా మార్చి ప్రపంచం ముందు మన దేశాన్ని నవ్వులపాలు చేశారు. ఆంధ్రా వర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు జలంధర్‌లో మాట్లాడుతూ కౌరవుల కాలంలోనే టెస్ట్‌ట్యూబ్ పరిజ్ఞానం ఉందన్నారు. టెస్ట్‌ట్యూబ్ పద్ధతి ద్వారా శిశువును సృష్టించిన భారతీయ మహిళా శాస్త్రవేత్త ఇందిరా అహుజాను, జన్యుపటాన్ని రూపొందించిన నోబెల్ గ్రహీత భారతీయ శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా కృషిని ఈ ప్రకటన అపహస్యం చేస్తున్నది. రావణుడి కాలంలో వైమానిక శాస్త్రం ఉన్నదని, న్యూటన్, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు తప్పని ఎలాంటి సహేతుక ఆధారాలు లేకుండా పేలవ ప్రసంగాలు చేశారు. సత్యపాల్ సింగ్ అనే కేంద్ర మంత్రి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించి దశవతార సిద్ధాంతాన్ని పాఠ్యప్రణాళికలో చేరుస్తామని ప్రకటించారు. ప్రస్తుత పాలకులు చరిత్రతో పాటు సైన్స్‌ను కూడా వక్రీకరించి భావోద్వేగ, మత రాజకీయాలను అధికారం కోసం ప్రచారం చేస్తున్నారు. ప్రధాన స్రవంతి భారతీయ శాస్త్రవేత్తల గుణాత్మక పరిశోధనా ఫలితాలను పంచుకుని తమ గుర్తింపును పెంచుకోవడానికి తోడ్పడే సైన్స్ కాంగ్రెస్‌లు ఆ స్ఫూర్తిని కోల్పోతున్నాయి. ఈ విధంగా జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్‌లను సర్కస్‌లుగా కాల్పనిక జంతువుల జాతరగా వర్ణించిన నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ ఈ సమావేశాలకు రావడం కూడా మానివేశారు. ఆరున్నర సంవత్సరాలుగా పార్లమెంటులో శాస్త్ర సాంకేతిక అంశాలపై జరిగిన చర్చ అతి స్వల్పం. రూపంలో, సారంలో ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగ లక్ష్యాల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఇదొక నిష్ఠుర సత్యం. 


భారత రాజ్యాంగం ప్రవచించిన వైజ్ఞానిక జిజ్ఞాసను ప్రజల్లో పాదుకునేలా పౌరసమాజం తీవ్రంగా కృషి చేయాలి. ప్రభుత్వ విధానాలు అత్యధిక ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉండాలి. ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడే విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలను రాజ్యమే నిర్వహించాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని శిరసావహించాలి. సంపద వికేంద్రీకరించి, మత ప్రమేయం లేని లౌకిక, ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం ప్రజాతంత్ర ఉద్యమం చేపట్టాల్సిన చారిత్రక బాధ్యత మన ముందు ఉంది. ఇది మన విధ్యుక్తధర్మం. ‘ప్రజల కోసం’ నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకునేలా చేసి, అందుకు అవరోధంగా ఉన్న దుష్ట, ఛాందసవాద. మూఢ శక్తులను నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది’ అని డాక్టర్‌ అంబేడ్కర్‌ దశాబ్దాల క్రితమే మనలను హెచ్చరించారు. ఈ వెలుగులో పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల దాకా విజ్ఞానశాస్త్రాన్ని పటిష్ఠంగా బోధించేందుకు గాను జిడిపిలో ఆరుశాతం నిధులు అవశ్యం కేటాయించాలి. దానికోసం పౌర సమాజం కృషి చేయాలి.  ఈ దిశగా సాగించే ప్రస్థానంలోనే రాజ్యాంగం ప్రవచించిన విధంగా భారతదేశం సమున్నతమవుతుంది.

అస్నాల శ్రీనివాస్

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

Updated Date - 2020-11-26T05:50:23+05:30 IST