ltrScrptTheme3

మరోసారి అడుగుతున్నాం..!

Oct 17 2021 @ 00:01AM
ఎమ్మెల్యేలు స్వామి, ఏలూరి, గొట్టిపాటి

సీఎంకు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

జిల్లా ప్రజలకు అండగా ఉండాలని విజ్ఞప్తి

ఒంగోలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : ‘ప్రజల సమస్యలు, శాశ్వత అభివృద్ధిపై గతంలో మేము రాసిన లేఖల్లో రాజకీయాన్ని వెతికారు తప్ప మా ఆవేదనను మీరు అర్థం చేసుకోలేదు. అందుకే ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాల మేరకు మరోసారి అడుగుతున్నాం. మా జిల్లావాసులకు అండగా ఉండండి’ అని జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు సంయుక్తంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఇటీవల ఒంగోలు పర్యటనకు సీఎం వచ్చి పోవడం.. జిల్లా ప్రజల సమస్యలు, అభివృద్ధిపై గతంలో తాము రాసిన లేఖలు, వాటిపై ప్రభుత్వ స్పందనను ఈ లేఖలో వారు ప్రస్తావించారు. గతంలో తాము రాసిన లేఖలో సీఎం, మంత్రులు రాజకీయాన్ని చూశారు తప్ప ప్రజల ఆవేదనను గుర్తించలేదన్నారు. తాము ప్రస్తావించిన అంశాలలో ఏఒక్కదానికీ పరిష్కారం చూపలేదన్నారు. జిల్లాకు ప్రాణప్రదమైన వెలిగొండను అనుమతి పొందిన ప్రాజెక్టుగా గెజిట్‌లో చేర్చాలని కేంద్రాన్ని గట్టిగా ఎందుకు అడగటం లేదని, ఎవరి ప్రయోజనాల కోసం వెలిగొండకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీ, యూనివర్సిటీలకు శాశ్వత భవన నిర్మాణాలు ఎప్పుడు పూర్తిచేస్తారని, రామాయపట్నం పోర్టును ఎందుకు దారి మళ్లిస్తున్నారని లేఖలో వారు అడిగారు. జిల్లాకు వచ్చిన సందర్భంలో శాశ్వత అభివృద్ధికి ఉపకరించే ఒక ప్రాజెక్టు లేదా పరిశ్రమను ప్రకటిస్తారని ఆశించామని అయితే ఆసరా పేరిట కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి వెళ్లారు తప్ప జిల్లా గురించి పట్టించుకోలేదన్నారు. కనీసం జిల్లాకు చెందిన మంత్రులు, మీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు జిల్లాకు ఇది కావాలని కూడా మిమ్మల్ని అడగలేకపోయారన్నారు. అందుకే తాము మరోసారి లేఖ రూపంలో ప్రజల తరఫున అడుగుతున్నామన్నారు. తక్షణం వెలిగొండను గెజిట్‌లో చేర్చడంతోపాటుప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ భవన నిర్మాణాలు చేపట్టడంతోపాటు, రామాయపట్నం పోర్టు పూర్తికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే సంక్షోభంలో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమను గట్టెక్కించాలని, సామాజిక వన రైతులను ఆదుకోవాలని, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లా రైతులు, ప్రజలకు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.