ముసురు వేళ వేడి వేడిగా..!

ABN , First Publish Date - 2021-07-24T09:05:30+05:30 IST

వారం రోజులుగా వానతో తడిసి ముద్దయిపోతున్నాం. ఈ సమయంలో వేడివేడి స్నాక్స్‌ని బాల్కనీలో కూర్చుని తింటే ఆ మజాయే వేరు.

ముసురు వేళ వేడి వేడిగా..!

వారం రోజులుగా వానతో తడిసి ముద్దయిపోతున్నాం. ఈ సమయంలో వేడివేడి స్నాక్స్‌ని బాల్కనీలో కూర్చుని తింటే ఆ మజాయే వేరు. ఈస్ట్‌వెస్ట్‌ స్ర్పింగ్‌ రోల్స్‌, రాజ్మా పకోడి, అరటికాయ సమోస, ఆల్మండ్‌ కోఫ్తా, రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌... వంటి స్నాక్స్‌ను ట్రై చేస్తే మీ జిహ్వ చాపల్యం కూడా తీరుతుంది. మరి ఆ రుచులను మీరూ ఆస్వాదించండి. 


బేక్డ్‌ అరటికాయ సమోస

కావలసినవి

ఉల్లిపాయలు - రెండు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, కరివేపాకు పొడి - 5గ్రా, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - నాలుగు, అరటికాయ పేస్టు - 200గ్రా, నూనె - సరిపడా, ఫైలో షీట్స్‌ - నాలుగు, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత. 


తయారీ విధానం

స్టవ్‌ పై పాన్‌పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. తరువాత ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. 

తరువాత అరటికాయ పేస్టు, కరివేపాకు పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

ఫైలో షీట్‌ తీసుకుని మూడు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఒక ముక్కలో రెండు టేబుల్‌స్పూన్ల అరటికాయ మిశ్రమం పెట్టి త్రిభుజాకారంలో మలవాలి. 

తరువాత నాన్‌స్టిక్‌ బేకింగ్‌ ట్రేలో పెట్టి ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


ఈస్ట్‌ వెస్ట్‌ స్ర్పింగ్‌ రోల్స్‌


కావలసినవి

స్ర్పింగ్‌రోల్‌ షీట్స్‌ - తగినన్ని, ఆలివ్‌ ఆయిల్‌ - ఒకటిన్నర టీస్పూన్‌, ఉల్లిపాయ - రెండు, క్యాప్సికం - ఒకటి, టొమాటో - ఒకటి, బ్రెడ్‌ క్రంబ్స్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, పర్‌మేసన్‌ ఛీజ్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, అల్లం ముక్క - కొద్దిగా, బఫెల్లో మొజరెల్లా ఛీజ్‌ - 60గ్రా, ఉల్లికాడలు - రెండు, వెనిగర్‌ - ఒక టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, స్టాక్‌ - ఒక టీస్పూన్‌. 


తయారీ విధానం

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేసి ఉల్లిపాయలు, క్యాప్సికం, అల్లం వేగించాలి. బాగా వేగిన తరువాత వెనిగర్‌ వేసి ఒక పాత్రలోకి మార్చుకోవాలి.

టొమాటోను కట్‌ చేసి ముక్కలు ఎండబెట్టుకోవాలి. తరువాత ఆ ముక్కలు, బ్రెడ్‌ క్రంబ్స్‌, పర్‌మేసన్‌ ఛీజ్‌, ఉప్పు వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లికాడలు వేసి కలియబెట్టుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికంలో కలుపుకోవాలి. 

ఒక చిన్న పాత్రలో కార్న్‌ఫ్లోర్‌, స్టాక్‌ తీసుకుని పేస్టులా కలుపుకోవాలి.

ఇప్పుడు స్ర్పింగ్‌ రోల్‌ షీట్‌ తీసుకుని బ్రష్‌తో కార్న్‌ఫ్లోర్‌ పేస్టు పూయాలి. 

కొన్ని తులసి ఆకులు, ఉల్లిపాయ, క్యాప్సికం మిశ్రమం, మొజరెల్లా ఛీజ్‌ వేసి రోల్‌ చుట్టుకోవాలి. 

నూనెలో వీటిని డీప్‌ ఫ్రై చేసుకోవాలి. చట్నీతో వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


ఆల్మండ్‌ కోఫ్తా


కావలసినవి

బంగాళదుంపలు - రెండు, జాజికాయ పొడి - చిటికెడు, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - ముప్పావు కప్పు, గ్రీన్‌ ఆనియన్స్‌ - అర కప్పు, మైదా పిండి - అరకప్పు, కోడిగుడ్లు - మూడు,  ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, బ్రెడ్‌క్రంబ్స్‌ - రోలింగ్‌ కోసం.


తయారీ విధానం

ముందుగా బంగాళదుంపలు ఉడికించి, మెత్తగా చేసుకోవాలి. బాదంపలుకులను గ్రైండ్‌ చేసుకోవాలి.

ఒక పాత్రలోకి వాటిని తీసుకుని తగినంత ఉప్పు, మిరియాల పొడి, జాజికాయ పొడి, పాలు, గ్రీన్‌ ఆనియన్స్‌, మైదా పిండి, రెండు కోడిగుడ్లు పగలకొట్టి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మిశ్రమాన్ని పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.

ప్లేట్‌లో మైదా పిండి, మరొక ప్లేట్‌లో కోడిగుడ్లు పగలకొట్టి పెట్టుకోవాలి. మరొక ప్లేట్‌లో బ్రెండ్‌క్రంబ్స్‌ తీసుకోవాలి.

ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టిన మిశ్రమాన్ని తీసి సమాన సైజుల్లో కోఫ్తాలు తయారుచేసుకోవాలి.

ఒక్కో కోఫ్తాను ముందుగా మైదా పిండిలో తరువాత కోడిగుడ్డు సొనలో అద్దాలి. చివరగా బ్రెడ్‌క్రంబ్స్‌ అద్దాలి.

ఓవెన్‌ను 200 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు ప్రీ హీట్‌ చేసి కోఫ్తాలను బేక్‌ చేసుకోవాలి. 

పుదీనా చట్నీతో కోఫ్తాలు సర్వ్‌ చేసుకోవాలి.


రాజ్మా పకోడి


కావలసినవి

రాజ్మా - పావుకేజీ, టొమాటోలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, ఓట్స్‌ - 50గ్రా, బ్రెడ్‌క్రంబ్స్‌ - 30గ్రా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా. 


తయారీ విధానం

రాజ్మాను రాత్రి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలను కట్‌ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరగాలి.

నానబెట్టిన రాజ్మాను కుక్కర్‌లో వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత రాజ్మాను గుజ్జుగా చేయాలి. 

గుజ్జు చేసిన రాజ్మాలో ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తరువాత బ్రెడ్‌క్రంబ్స్‌, ఓట్స్‌ మిశ్రమంలో వేసి రోల్స్‌ చుట్టుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పకోడి వేసి వేగించాలి. 

టొమాటో కెచప్‌తో లేక పుదీనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌


కావలసినవి

బియ్యప్పిండి - అరకప్పు, బంగాళదుంపలు - నాలుగు, జీలకర్ర, అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నూనె - సరిపడా, మిరపగింజలు - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - పావుటీస్పూన్‌, ఛాట్‌ మసాల - ఒక టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

ముందుగా బంగాళదుంపలను ఉడికించి గుజ్జుగా చేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరువాత పసుపు, కారం వేసి ఒక కప్పు నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో బియ్యప్పిండి వేయాలి. మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి పక్కన పెట్టుకోవాలి.

ఒక పాత్రలో ఉడికించిన బంగాళదుంపలు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బియ్యప్పిండి మిశ్రమంలో వేయాలి. తరువాత మిరియాలపొడి, మిరపగింజలు, ఛాట్‌మసాల, అల్లం పేస్టు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్నచిన్న బాల్స్‌లా చేసుకుంటూ కట్‌లెట్స్‌గా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక  రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌ వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. 

గ్రీన్‌ చట్నీతో వేడివేడిగా తింటే రైస్‌ పొటాటో కట్‌లెట్స్‌ రుచిగా ఉంటాయి.

Updated Date - 2021-07-24T09:05:30+05:30 IST