నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-01-17T05:21:05+05:30 IST

ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, బీసీ నేత నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటామని ఆ పార్టీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రూ.33 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు.

నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటాం
నందం ఆపరాజితకు రూ.33లక్షల ఆర్థికసాయం అందించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

పలువురు టీడీపీ నేతలు

రూ.33 లక్షల ఆర్థిక సాయం

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 16 : ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, బీసీ నేత నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటామని ఆ పార్టీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రూ.33 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. నందం సుబ్బయ్య గత ఏడాది డిసెంబరు 28న హత్యకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పార్టీ తరుపున రూ.20లక్షలు, పలువురు పార్టీ సీనియర్‌ నాయకులు రూ.13లక్షలు సాయంగా అందిస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ బచ్చల పుల్లయ్య, ఇతర టీడీపీ నేతలతో కలిసి ఈశ్వర్‌రెడ్డినగర్‌లోని మృతుని నివాసానికి వెళ్లి  నందం అపరాజితకు రూ.33లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రూ.20లక్షలకు చెక్కు పంపించారని, మైదుకూరు పార్టీ ఇన్‌చార్జి, టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ రూ.5లక్షలు, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రూ.2లక్షలు, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి రూ.1లక్షతో పాటు తాను ఆ రోజు ప్రకటించిన విధంగా రూ.5లక్షలు కలిసి రూ.33లక్షలు అందజేశామన్నారు. పోలీసు అధికారులు సుబ్బయ్య హత్య కేసు విషయంలో నిష్పక్షపాతంగా, నిజాయితీగా విచారణ జరిపి అసలు దోషులకు శిక్ష పడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యదర్శి కోట శ్రీదేవి, మహిళా నాయకురాలు మల్లెల లక్ష్మిప్రసన్న, లత, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు అమీర్‌బాష, నల్లబోతుల నాగరాజు, బీసీ నాయకులు బొర్రా రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:21:05+05:30 IST