బిల్లులు రాక అప్పులపాలవుతున్నాం

ABN , First Publish Date - 2022-05-18T05:33:18+05:30 IST

బిల్లులు రాక అప్పులపాలవుతున్నాం

బిల్లులు రాక  అప్పులపాలవుతున్నాం
మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనితవిజయ్‌

  • బిల్లులు చెల్లించకుంటే పల్లె ప్రగతిని బహిష్కరిస్తాం 
  • మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల ఆవేదన 


ఆమనగల్లు, మే 17: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు నెలల పాటు బిల్లులు రాకపోవడంతో తాము అప్పుల పాలవుతున్నామని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమనగల్లు మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ అనితవిజయ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ అనురాధ పత్యానాయక్‌, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిల్లులు చెల్లించకుంటే కొత్త పనులు చేసేదేలా అని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 20 నుంచి చేపట్టే 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని వారు తెలిపారు. అదేవిధంగా గ్రామపంచాయతీలలో వీధిలైట్ల ఏర్పాటు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడాన్ని సర్పంచులు పబ్బతి శ్రీనయ్య, అమర్‌సింగ్‌, బాల్‌రామ్‌, లక్ష్మణ్‌, ప్రేమలత, మల్లమ్మ, నర్సింహారెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమావేశంలో నిరసన వ్యక్తంచేశారు.  సమావేశం ప్రారంభానికి ముందు శాఖల వారీ సమీక్ష ప్రారంభించకముందే తమకు తెలియకుండా మండల పరిషత్‌ ఆవరణలో స్థలాలు కేటాయిస్తున్నారని, తీర్మానాలు చేస్తున్నారని అభ్యంతరం తెలుపుతూ పోలేపల్లి ఎంపీటీసీ దోనాదుల కుమార్‌  సమస్యను లేవనెత్తాడు. అలాంటిదేమి లేదని ఎంపీడీవో ఒకవైపు సమాధానం ఇస్తుండగానే కుమార్‌ మరోసమస్యను ప్రస్తావించడంతో ఇతరులకు అవకాశం ఇవ్వవా అంటూ వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి కలుగజేసుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తానేమి అడుగవద్దా.. అధికారులను అడిగితే మీరేందుకు అడ్డుపడుతున్నారంటూ కుమార్‌ సమావేశం నుంచి బయటి వెళ్లిపోయారు.  అనంతరం శాఖల వారీగా సమీక్ష సజావుగా సాగింది.  మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా రావడంలేదని, చాలా చోట్లపనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, పలు చోట్ల పైపులు లీకేజీలు అవుతున్నాయని ఎంపీపీ అనితవిజయ్‌, సర్పంచ్‌ అమర్‌సింగ్‌, వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డిలు సభ దృష్టికి తెచ్చారు. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శరత్‌ సమాధానం ఇచ్చారు.  అసంపూర్తి పనులు పూర్తి చేసే వరకు ఫైనల్‌ బిల్లులు నిలిపివేయాలని వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్‌ నర్సింహారెడ్డిలు ఏఈకి సూచించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టుషాపులను నిరోధించాలని పలువురుసభ్యులు ఎక్సైజ్‌ అధికారులను కోరగా చర్యలు చేపడుతామని ఎస్‌ఐ తెలిపారు.ఈ సమావేశంలో ఎంపీడీవో వెంకట్రాములు, ఎంఈవో సర్ధార్‌నాయక్‌, సీడీపీవో సక్కుబాయి, ఏఈలు కృష్ణయ్య, రవి, సీతారాం, ఏపీఎం కృష్ణయ్య, ఏపీవో మాధవరెడ్డి, ఏంపీవో శ్రీలత, డాక్టర్లు హర్షద్‌, విజయ్‌, ఏవో అరుణకుమారి, హార్టికల్చర్‌ అధికారి అశోక్‌  పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-18T05:33:18+05:30 IST