మైనారిటీలపై మమ‘కారం’

ABN , First Publish Date - 2022-04-28T07:41:56+05:30 IST

ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఎన్నెన్నో ఆశలు రేకెత్తించారు. చివరికి... మోసం

మైనారిటీలపై మమ‘కారం’

  • మాటల మాయలు, అంకెల గారడీలు
  • ఆర్భాటంగా బడ్జెట్‌లో కేటాయింపులు
  • చివరికొచ్చేసరికి అంతా శూన్యం
  • స్వయం ఉపాధి యూనిట్లకు శుభంకార్డు
  • దుకాణ్‌, మకాన్‌, దుల్హన్‌ అన్నింటికీ సెలవ్‌
  • ‘రంజాన్‌ తోఫా’ మాయం

  • ‘పథకాలు రద్దు చేయమంటున్నారు’ అంటూ ప్రత్యర్థి పార్టీలపై ఒంగోలు సభలో జగన్‌ ఆక్రోశించారు. ప్రజల్ని ఇప్పటి నుంచే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. కానీ.. అధికారంలోకి వచ్చీరాగానే ఎస్సీ, బీసీలకు ప్రత్యేకంగా అమలైన పథకాలతోపాటు మైనారిటీల పథకాలనూ అటకెక్కించారు. ఎవరు చెప్పారని ఆ పథకాలను రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? మైనారిటీలపై జగన్‌ చూపిన మమ‘కారం’ ఏమిటి? దివ్యాంగులకు చేసిన ప్రత్యేక సహాయం ఏమిటి?


మైనారిటీలపై ఎనలేని మమకారం తమకే ఉందన్నారు. అధికారంలోకి వస్తే ఏదేదో చేస్తామన్నారు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ పాదయాత్రలో ఊరూరా తిరిగి  హామీలిచ్చారు. చివరికి.... మోసం చేశారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఎన్నెన్నో ఆశలు రేకెత్తించారు. చివరికి... మోసం చేశారు!... ఇదీ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల మాట! పాదయాత్ర సమయంలో, ఎన్నికల ప్రచారంలో జగన్‌ చెప్పిన మాటలు నమ్మి అండగా నిలిచామని... చివరికి, అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న పథకాలూ అమలు చేయకుండా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ వర్తించే అమ్మఒడి, ఆసరా, చేయూత, వాహనమిత్ర, చేదోడు, విద్యాదీవెన తదితర పథకాలనూ మైనారిటీ బడ్జెట్‌లో చూపించి, గిమ్మిక్కులు చేయడం  మోసం కాదా అని నిలదీస్తున్నారు. చంద్రబాబు హయాంలో తమకు ప్రత్యేకంగా అమలైన పథకాలను గుర్తు చేసుకుని... అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. 



జగనన్న ‘రద్దు’ పథకం...

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే మైనారిటీలకు చెందిన పథకాలన్నీ రద్దు పద్దులో కలిసిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తామంటూ దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. ఇంటర్వ్యూలకు కూడా పిలిచి... మొత్తం ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేశారు. ‘నవరత్నాలు’ ఇస్తున్నందున ప్రత్యేకంగా స్వయం ఉపాధి యూనిట్లు ఇవ్వాల్సిన అవసరంలేదని తేల్చేశారు. వెరసి... ఇతర అన్ని కులాల కార్పొరేషన్లలాగానే మైనారిటీ, క్రైస్తవ కార్పొరేషన్లు కూడా నామ్‌కే వాస్తేగా మిగిలిపోయాయి.



దూదేకులు, ముస్లిం ఫెడరేషన్‌కు నిధులేవీ?...

గత ప్రభుత్వం ముస్లిం వర్గాలకు సంబంధించి దూదేకుల కులానికి చెందిన వారి సంక్షేమం కోసం ఫెడరేషన్‌ ఏర్పాటుచేసింది. 2019-20లో వారి సంక్షేమం కోసం రూ.20 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధుల్లో 1.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆ తర్వాత బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయించలేదు. ఆ ఫెడరేషన్‌ ఒకటుందని ప్రభుత్వం కూడా మరిచిపోయింది.




స్వయం ఉపాధికి శుభంకార్డు...

ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారు. వెల్డింగ్‌ షాపులు, మెకానికల్‌ షాపులు, చిన్న చిన్న దుకాణాలు నడుపుతూ... గృహ నిర్మాణ కార్మికులుగా, ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్లుగా ఎక్కువమంది మైనారిటీ వర్గానికి చెందిన వారే పని చేస్తుంటారు. వీరు చేసే కష్టానికి ప్రభుత్వం అందించే సాయం తోడైతే... జీవితాలు మరింత బాగుపడతాయని అప్పటి ప్రభుత్వం భావించింది. మైనారిటీల కోసం అనేక స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చింది.


ఎయిర్‌ కండిషన్‌, రిఫ్రిజిరేషన్‌, ఆటోమొబైల్‌, డ్రైవింగ్‌, మెకానిక్‌, వెబ్‌ డిజైనింగ్‌, బుక్‌ పబ్లిషింగ్‌, మెడికల్‌ ల్యాబ్‌, సోలార్‌ టెక్నీషియన్‌... ఇలా అనేక రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కూడా కల్పించింది. బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షలు రుణమిప్పించి... అందులో రూ.లక్ష సబ్సిడీగా భరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఏటా 10 వేల మంది ముస్లిం, క్రిస్టియన్‌ యువతకు వారి ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. దీంతోపాటు దుకాణ్‌, మకాన్‌ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏటా వెయ్యి మంది ముస్లింలకు ఇల్లు, షాపు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించింది.




ఆగిన మసీదు, చర్చిల నిర్మాణాలు..

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు, మసీదులకు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో 3500 ముస్లిం పార్థనా స్థలాలున్నాయి. 1365 మసీదులు,  316 దర్గాలు, 43 సమాధి భూములు, 1548 అషూర్‌ఖానాలు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలున్నాయి. వీటన్నింటికి మరమ్మతులు, ఇతర భవనాల నిర్మాణాల కోసం నిధులు ఖర్చు చేశారు. ఒక్కో జిల్లాకు రూ.2.50 కోట్లు మసీదుల మరమ్మతుల కోసం మంజూరుచేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత  షాదీఖానాలకు రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. మిగతా నిర్మాణాలు ఎలా పూర్తి చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. 



రంజాన్‌తోఫా సఫా.....

గత ప్రభుత్వం ముస్లింలకు రంజాన్‌ పండుగ రోజున ‘రంజాన్‌ తోఫా’ను అందించింది. పేద, ధనిక తేడాల్లేకుండా పండుగ చేసుకోవాలంటూ ప్రతి ఇంటికీ సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు 10 లక్షల కుటుంబాలు రంజాన్‌తోఫాను అందుకున్నాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తోఫాను సఫా చేశారని ముస్లిం వర్గాలు వాపోతున్నాయి. 




ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏదీ?

2014 ఎన్నికలకు ముందు టీడీపీ ‘ఇస్లామిక్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిందని జగన్‌ ఊరూరా విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంకును ఏర్పాటు చేస్తామన్నట్లు ఆశ చూపించారు. అయితే.... ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. ఉన్న స్వయం ఉపాధి పథకాలకూ  స్వస్తి చెప్పారు.




ఉన్నత విద్యకూ అందని భరోసా..

గత ప్రభుత్వంలో మైనారిటీ విద్యార్థుల ఉన్నతవిద్యకు ఒక భరోసా ఉండేది. పోటీ పరీక్షలైన యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ తదితర ఉద్యోగాలతోపాటు డీఎస్సీకి శిక్షణ పొందేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేది. కోచింగ్‌ ఫీజుతోపాటు వసతి ఖర్చునూ భరించేది. ప్రభుత్వ సాయంతో శిక్షణ తీసుకున్న మైనారిటీలు ఎంతోమంది ఉద్యోగాలు పొందారు. ఇక... విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉద్దేశించిన పథకాన్ని మైనారిటీలకూ అమలు చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున సహాయం అందేది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని కూడా వైసీపీ సర్కారు నిలిపివేసింది.




‘దుల్హన్‌’ పథకానికి స్వస్తి...

ఆడపిల్ల పెళ్లి చేసేందుకు పేద ముస్లింలు ఎంతో ఇబ్బంది పడేవారు. ఖర్చులు భరించలేక అప్పుల పాలయ్యేవారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ‘దుల్హన్‌’ పథకాన్ని అమలు చేసింది. వధువుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించేది. ఈ పథకం అనేక మంది నిరుపేద ముస్లింలను ఎంతగానో ఆదుకుంది. మైనారిటీలకు జగన్‌ సర్కారు ఈ పథకాన్ని కూడా దూరం చేసింది. 


Updated Date - 2022-04-28T07:41:56+05:30 IST