యూపీలో పోటీ.. ఎస్పీతో పొత్తు: శరద్ పవార్

ABN , First Publish Date - 2022-01-11T22:07:27+05:30 IST

ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ నుంచి యోగి నుంచి వారికి విముక్తి కావాలని అనుకుంటున్నారు. ఆ మార్పును యూపీలో మేం తప్పకుండా తీసుకువస్తాం. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ పోటీ చేస్తుంది...

యూపీలో పోటీ.. ఎస్పీతో పొత్తు: శరద్ పవార్

ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. అయితే మరో కీలక విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సహా మరి కొన్ని చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ముంబైలో విలేకరులతో పవార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీజేపీ, ఎస్పీ మధ్య ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీకి అతిపెద్ద సవాల్‌గా మారిన ఎన్సీపీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఎస్పీతో జతకడతామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.


శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ నుంచి యోగి నుంచి వారికి విముక్తి కావాలని అనుకుంటున్నారు. ఆ మార్పును యూపీలో మేం తప్పకుండా తీసుకువస్తాం. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ పోటీ చేస్తుంది. సమాజ్‌వాదీ పార్టీ సహా మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాం. అధికార పార్టీ ఇప్పటికే అక్కడ మత పరమైన రాజకీయాలను రెచ్చగొడుతోంది. అయితే ప్రజలు ధీటైన జవాబు ఇస్తారు’’ అని అన్నారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి వెళ్లే యోచనలో ఉన్నట్లు శరద్ పవార్ తెలిపారు. ఈ విషయమై ఆ రెండు పార్టీలతో చర్చలు కూడా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-11T22:07:27+05:30 IST