ముద్దుతో మురిపాలెన్నో...

ABN , First Publish Date - 2021-02-17T08:35:08+05:30 IST

ఒకరిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను ముద్దుతో వ్యక్తం చేస్తాం. అంతేనా మనసులో అలజడిని సృష్టించే చుంబనంతో అభినందన, క్షమాపణ... ఇలా ఎన్నో భావాలను తెలియజేయవచ్చు. అందుకే అంటారు

ముద్దుతో మురిపాలెన్నో...

ఒకరిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను ముద్దుతో వ్యక్తం చేస్తాం. అంతేనా మనసులో అలజడిని సృష్టించే చుంబనంతో అభినందన, క్షమాపణ... ఇలా ఎన్నో భావాలను తెలియజేయవచ్చు. అందుకే అంటారు ముద్దూ, ముచ్చటా ఉన్న జంట కనుల పంట అని. అంతేకాదు భాగస్వామికి ఇచ్చే ముద్దు వారికి అన్నివేళలా తోడుంటాననే వాగ్దానం కూడా. ముద్దు పెట్టుకోవడం వల్ల శారీరక, మానసిక లాభాలు చాలానే ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం....


అన్యోన్యతకు ఆయువు: భాగస్వామి మనసు, భావోద్వేగాలతో కలిసి నడిపించే ఔషధమే కాదు ఇద్దరి మధ్య సఖ్యత, అన్యోన్యతను పెంచే ఇంధనం ముద్దు. అనుబంధాన్ని గట్టిపరుస్తూ, ప్రేమకాంతులు వెదజల్లే మంత్రదండం ముద్దు. 


ఒత్తిడి ని ఓడిస్తుంది: పలు మానసిక సమస్యలకు కారణమయ్యే ఒత్తిడిని ముద్దుతో చిత్తు చేయవచ్చు. ముద్దు పెట్టుకున్నప్పుడు ఒత్తిడిని తగ్గించే ఆక్సిటోసిన్‌, డోపమైన్‌ హార్మోన్లువిడుదలవుతాయి. అందుకే ముద్దు తరువాత మనసు తేలికయి ఒళ్లంతా హుషారుగా అనిపిస్తుంది. 


నమ్మకానికి నాంది: ఏ బంధమైన ఎక్కువ రోజులు నిలబడాలంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి. రోజూ మీ తోడుకు ముద్దు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించేందుకు, కంటికి రెప్పలా కాపాడుకునేందుకు, ప్రేమగా చూసుకునేందుకు మీరు ఉన్నారనే భరోసా ఏర్పడుతుంది. అనుంబంధాలను బలపరిచే నమ్మకాన్ని ఒక్క ముద్దుతో పెంచుకోవచ్చు.


మురిపించే ముద్దు: మీ అనుబంధంలో ప్రేమ, అనురాగం చాలా విలువైనవని గుర్తించాలి. మీ జంట ప్రయాణం ఆనందాల నెలవుగా, అనుభూతుల వరంగా మారేందుకు చుంబనం తప్పనిసరి. మీ అడుగుల జతతో ప్రతి క్షణం మధురంగా గడిచేందుకు వారిని ముద్దులతో మురిపించండి.

 

థ్రిల్‌ని ఇస్తుంది: ప్రేమగా ఇచ్చే ముద్దు ఇద్దరికీ ఎంతో థ్రిల్‌ను ఇస్తుంది. అంతేకాదు ఒకరిపై ఒకరికున్న ఆకర్షణను అమాంతం పెంచేస్తుంది. వలపు సుగంధాలను రేకెత్తించి కొద్ది సేపు ఒక కొత్త ప్రపంచంలో ఊరేగిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ముద్దు ఇచ్చిపుచ్చుకోవాలంటున్నారు లవ్‌గురూలు. 

Updated Date - 2021-02-17T08:35:08+05:30 IST