Delhi Liquor scam: ఢిల్లీ మద్యం స్కాంతో మాకెలాంటి సంబంధం లేదు: మాగుంట

ABN , First Publish Date - 2022-09-20T02:41:24+05:30 IST

ఢిల్లీ మద్యం స్కాం (Delhi Liquor scam)లో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి

Delhi Liquor scam: ఢిల్లీ మద్యం స్కాంతో మాకెలాంటి సంబంధం లేదు: మాగుంట

ఒంగోలు: ఢిల్లీ మద్యం స్కాం (Delhi Liquor scam)లో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి (Magunta Sreenivasulu Reddy) స్పష్టం చేశారు. దేశంలో ఏ రెడ్డి వ్యాపారం చేసినా అది మాగుంట కుటుంబానికి ఆపాదించడం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీ (Delhi)లో 32  జోన్లు ఉంటే తమ బంధువులు రెండు జోన్లలోనే వ్యాపారం చేశారని తెలిపారు. తన తండ్రి హయాం నుంచి లిక్కర్‌ వ్యాపారంలో ఉన్నామని పేర్కొన్నారు. అయితే తాము వ్యాపార రంగంలో ఉన్నా ప్రత్యక్షంగా ఏ వ్యాపారంలో కూడా లేమని వెల్లడించారు. తాను ఎన్నికల సమయంలో వేసిన నామినేషన్‌ పత్రాల్లో కూడా అందుకు సంబంధించిన సమాచారం ఉంటుందని శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు.


మాగుంట కుటుంబం 70 ఏళ్ల నుంచి లిక్కర్‌ వ్యాపారలో ఉన్నా మచ్చ లేకుండా ఉందన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో తమకు వ్యాపారాలు ఉన్నాయని, ఎక్కడ కూడా ఎలాంటి అరోపణలు లేవని తెలిపారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై దేశవ్యాప్తంగా అనేకమంది వ్యాపారుల గృహాల్లో దాడులు జరిగాయని, అందులోభాగంగా ఇక్కడ కూడా దాడులు చేశారన్నారు. ఇది కేవలం వ్యాపార పరమైనవిగానే భావిస్తున్నామే తప్ప రాజకీయ దాడులు కావని స్పష్టం చేశారు. కానీ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా తనను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు చేయడం ఏమిటని మాగుంట శ్రీనివాసులరెడ్డి  ప్రశ్నించారు.


ఢిల్లీలో మాగుంట నివాసంలో ఈడీ సోదాలు

ఈ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా బుచ్చిబాబు సీఏగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో  శ్రీనివాసులురెడ్డి నివాసంలోనూ సోదాలు జరిపిన విషయం తెలిసింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసమైన 91, లోధి ఎస్టేట్‌ బంగ్లాకు ఉదయం చేరుకున్న ఈడీ అధికారులు.. సాయంత్రం దాకా సోదాలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటివరకు తమ తనిఖీల్లో లభించిన ఆధారాల మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్‌లో పలువురికి నోటీసులు జారీ చేసినట్లు, వారిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది. అయితే నోటీసుల జారీకి సంబంధించి ఈడీ అధికారులు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. 

Updated Date - 2022-09-20T02:41:24+05:30 IST