శివసేన పొత్తులోనే ఉంది.. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది: అజిత్ పవార్ లాజిక్

ABN , First Publish Date - 2022-06-24T22:33:49+05:30 IST

మేం అధికారంలో ఉన్నాం. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పొత్తులోనే ఉన్నాయి. మాకు మెజారిటీ ఉంది. ఒక ప్రభుత్వంగా మేం నిర్ణయాలు తీసుకుంటున్నాం. మేం ఉన్నట్టుగా మీరు(బీజీపీ) అధికారంలో లేరు. మీకేమైనా మెజారిటీ ఉందా? ప్రభుత్వం, మంత్రులు, అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారు..

శివసేన పొత్తులోనే ఉంది.. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది: అజిత్ పవార్ లాజిక్

ముంబై: మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వానికి మెజారిటీ తగ్గిందనే వార్తలు అనేకం వస్తున్నాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని వదిలి మాతోశ్రీ నివాసానికి ఉద్ధవ్ మారిపోవడం వీటికి బలాన్ని చేకూర్చుతోంది. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం పతనం అవ్వడం ఖాయం అంటు ఊహాగాణాలు వెలువడుతున్న తరుణంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. ప్రభుత్వానికి నష్టమేమీ లేదని, తమకు సరిపడా మెజారిటీ ఉందంటూ సరికొత్త లాజిక్ చెప్పారు.


అజిత్ పవార్ చెప్పిన లాజిక్ ప్రకారం.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులోనే ఉన్నాయని, ఈ పొత్తు ప్రకారం తమకు మెజారిటీ ఉందని చెప్పారు. థాకరే శివసేననా ఏక్‌నాథ్ షిండే శివసేననా అని కాకుండా శివసేన పొత్తులోనే ఉందనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. నిజానికి.. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేతోనే ఉన్నారు. గువహాటిలోని హోటల్‌లో ఉన్న వీరంతా తమ పార్టీ నేత షిండేనే అని ఏకగ్రీవంగా తీర్మానించారు. అధికారికంగా మూడింట రెండొంతుల మెజారిటీ ప్రకారం.. శివసేన పార్టీకి షిండేనే అవుతారు.


మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం మైనారిటీలో ఉందంటూ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి బీజేపీ నేత ప్రవీణ్ డరేకర్ లేఖ రాయడంపై అజిత్ పవార్ స్పందిస్తూ ‘‘మేం అధికారంలో ఉన్నాం. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పొత్తులోనే ఉన్నాయి. మాకు మెజారిటీ ఉంది. ఒక ప్రభుత్వంగా మేం నిర్ణయాలు తీసుకుంటున్నాం. మేం ఉన్నట్టుగా మీరు(బీజీపీ) అధికారంలో లేరు. మీకేమైనా మెజారిటీ ఉందా? ప్రభుత్వం, మంత్రులు, అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారు’’ అని అన్నారు. నిజానికి షిండే కూటమి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంది. ఉద్ధవ్‌పై తిరుగుబాటుకు ఇది బలమైన కారణమని షిండే క్యాంపే స్వయంగా చెప్పుకొచ్చింది. అయినప్పటికీ శివసేన తమతోనే ఉందని అజిత్ పవార్ చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-06-24T22:33:49+05:30 IST