మార్కెట్‌ ధరకే భూములిస్తాం

ABN , First Publish Date - 2022-06-28T08:00:07+05:30 IST

ప్రతిష్ఠాత్మక జాతీయ పెట్టుబడుల మౌలిక సదుపాయాల కల్పన మండలి (నిమ్జ్‌) ప్రాజెక్టు భూసేకరణలో పరిహారం...

మార్కెట్‌ ధరకే భూములిస్తాం

ఎకరాకు రూ.40-50 లక్షలివ్వాలి

లేకుంటే ఇవ్వబోమంటున్న రైతులు 

మాకు కూడా ఆ ధరలే చెల్లించాలి 

‘తొలి విడత’ రైతుల డిమాండ్‌ 

జటిలంగా రెండో విడత భూసేకరణ

నిమ్జ్‌ భూసేకరణలో మరింత జాప్యం?


సంగారెడ్డి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక జాతీయ పెట్టుబడుల మౌలిక సదుపాయాల కల్పన మండలి (నిమ్జ్‌) ప్రాజెక్టు భూసేకరణలో పరిహారం విషయమై రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 12,635.14 ఎకరాల భూసేకరణ లక్ష్యం కాగా, ఇంకా 9,134 ఎకరాలను సేకరించాల్సి ఉంది. అయితే, భూముల ధరలు బహిరంగ మార్కెట్‌లో రూ.50 లక్షల నుంచి కోటి వరకు పలుకుతుండగా, ఆరేళ్ల క్రితం నాటి ధరలతో పరిహారం ఇస్తామంటే కుదరదని రైతులు తేల్చి చెబుతున్నారు. తమకు ఎకరాకు కనీసం 40-50 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు తమకు కూడా ప్రస్తుత  బహిరంగ మార్కెట్‌ ధరతో పరిహారం చెల్లించాలని తొలి విడత భూసేకరణలో పరిహారం పొందిన రైతులు సైతం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ జఠిలంగా మారుతోంది. దీంతో భూసేకరణలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


పరిశ్రమలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జహీరాబాద్‌ ప్రాంతంలో నిమ్జ్‌ను ఏర్పాటు చేయాలని 2013 జనవరి 2న కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో 12,635.14 ఎకరాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. 2015లో ప్రారంభమైన తొలి విడతలో 3,501.33 ఎకరాలను మాత్రమే అధికారులు సేకరించారు. కాగా, తొలి విడతలో సేకరించిన భూముల్లో సాగులో ఉన్న పట్టా భూములకు ఎకరాకు రూ.7లక్షల చొప్పున, సాగులో లేనివాటికి ఎకరాకు రూ.5.65 లక్షల చొప్పున రైతులకు చెల్లించారు. అలాగే సాగులో ఉన్న అసైన్డ్‌ భూములకు ఎకరాకు రూ.4.25 లక్షల చొప్పున, సాగులో లేని భూములకు ఎకరాకు రూ.3.25 లక్షల చొప్పున చెల్లించారు. అప్పట్లో ఈ ప్రాంతంలోని భూములకు అంతగా డిమాండ్‌ లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తీసుకొని, రైతులు భూములను ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్‌ పెరిగింది. తొలి విడత తీసుకున్న భూముల్లో కార్యకలాపాలు సాగుతుండటం, రియల్టర్లు కూడా హైదరాబాద్‌ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి భూములను కొనుగోలు చేయడంతో ధరలు అమాంతం పెరిగాయి. రహదారులు, గ్రామాలు, భూములను బట్టి ధరలు ఇప్పుడు ఎకరాకు రూ.40 లక్షల నుంచి కోటికి పైగా పలుకుతున్నాయి.   ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నిమ్జ్‌ రెండో విడత భూసేకరణలో భూముల ధరలను పెంచింది. మొదటి విడతలో మిగిలిన భూములను కలిపి రెండో విడతలో మొత్తం 9,134 ఎకరాలను సేకరించాల్సి వుంది. అయితే, ఎకరాకు రూ.15 లక్షల చొప్పున చెల్లిస్తామని అదికారులు రైతులకు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌ ధరల మేరకు ప్రాంతాలను బట్టి ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చెల్లిస్తామంటేనే భూములిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.  


ఔట్‌ ఆఫ్‌ ది వేగా ఇవ్వాలి

భూములు కోల్పోతున్న రైతులకు ఔట్‌ ఆఫ్‌ ది వేగా నిబంధనల కన్నా ఎక్కువే పరిహారం చెల్లించాలని మంత్రి కేటీఆర్‌ జిల్లా యంత్రాగానికి సూచించారు. నిమ్జ్‌ భూముల్లో తొలి విడతగా చేపట్టిన వెమ్‌ టెక్నాలజీస్‌ పరిశ్రమకు ఇటీవల ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ  భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆయన ప్రజాప్రతినిధులకు, జిల్లా యంత్రాంగానికి సూచించారు.


... లేకుంటే భూములియ్యం

నిమ్జ్‌ కోసం తీసుకుంటున్న భూములకు బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం ఎకరాకు రూ.40-50 లక్షలు చెల్లించాలి. లేకపోతే ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు చెప్పాం. మా భూముల్లో సాగు చేసిన పంట రెండు నెలల్లో చేతికి వస్తుంది. ఆ తర్వాతే భూ సేకరణ చేపట్టాలి. - నంద కుమార్‌, రైతు, ఎల్గోయి గ్రామం

Updated Date - 2022-06-28T08:00:07+05:30 IST