వర్షాలతో పంటలు మొత్తం కోల్పోయాం

ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అన్ని పంటలు కోల్పోయిన తమను ఆదుకోవాలని రైతులు కేంద్రఆర్థికశాఖ డైరెక్టర్‌ అభేకుమార్‌కు ఆవేదనతో విన్నవించారు.

వర్షాలతో పంటలు మొత్తం కోల్పోయాం
చదళ్ల వద్ద కుళ్లిన వరి, బంగాళాదుంప పంటలను కేంద్ర బృందం ప్రతినిధులకు చూపిస్తున్న రైతులు

 ఆదుకోవాలని కేంద్ర బృందానికి రైతుల విన్నపం

పుంగనూరు, నవంబరు 27: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అన్ని పంటలు కోల్పోయిన తమను ఆదుకోవాలని రైతులు కేంద్రఆర్థికశాఖ డైరెక్టర్‌ అభేకుమార్‌కు ఆవేదనతో విన్నవించారు. శనివారం సాయంత్రం పుంగనూరు మండలం చదళ్ల ప్రాంతంలో కేంద్రబృంద సభ్యులైన అభేకుమార్‌కు ముందుగానే గ్రామరైతులు వర్షానికి తడిచి కుళ్లిన, మొలకెత్తిన వరి, టమోటా, కంది, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌, అనప, రాగి పంటలను పరిశీలనకు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ భారీవర్షాలతో చేతికి అందాల్సిన టమోటా, వరి, కాలీఫ్లవర్‌, పంటలు పొలాల్లోనే కుళ్లిపోయాయని చెప్పారు. టమోటా ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందని కేంద్ర బంృదం  ప్రశ్నించగా రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు అవుతుందని, ధర బాగా ఉండి కోతకు వచ్చే సమయానికి పంట నష్టం జరిగిందని లేకపోతే ఎకరానికి రైతుకు రూ.10 లక్షలు ఆదాయం వచ్చేదని చెప్పారు. అనంతరం కేంద్ర బృందం నీటమునిగిన టమోటా, వరి పొలాలు, నష్టపోయిన ఫోటోలను పరిశీలించింది. మండలంలో 104.449 హెక్టార్లలో పంట నష్టం జరుగగా మొత్తం 1804 మంది రైతులు నష్టపోయారని, అందులో అధికంగా 101 హెక్టార్లలో వరిపంటకు భారీగా నష్టం జరిగిందని పుంగనూరు ఏడీఏ లక్ష్మానాయక్‌ వివరించారు. మండలంలో రైతాంగానికి భారీవర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయని నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కేంద్ర బృందానికి వినతి చేశారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ జేడీలు దొరసాని, వెంకట్రావ్‌, ఉద్యానవనశాఖ డీడీ శ్రీనివాసులు, హెచ్‌వో లక్ష్మీప్రసన్న, పశుసంవర్ధకశాఖ ఏడీ మనోహర్‌, తహసీల్దార్‌ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మీపతి, ఏవో సంధ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST