కాంగ్రెస్‌లో అసమ్మతిని పక్కన పెట్టాం

ABN , First Publish Date - 2022-04-25T09:34:01+05:30 IST

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. అభ్యర్థి గెలిచాక టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోతాడేమోనని ప్రజలు అనుకుంటున్నారు కదా..?

కాంగ్రెస్‌లో అసమ్మతిని పక్కన పెట్టాం

  • అధికారం కోసం ఐక్యంగా పని చేస్తున్నాం 
  • తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు
  • మేం గెలిస్తే కౌలుదారుకూ రైతు బంధు
  • నేను పార్టీ మారను.. నా సోదరుడూ 
  • కాంగ్రెస్‌లోనే ఉంటాడనుకుంటున్నా
  • రేవంత్‌తో రోజూ ఐదారుసార్లు మాట్లాడతా
  • రూ.కోటి ఇచ్చినా దళితులు కేసీఆర్‌ను నమ్మరు
  • కేసీఆర్‌ చరిత్ర మొత్తం కేంద్రం దగ్గర ఉంది
  • సరైన టైంలో చర్యలు ఉంటాయనుకుంటున్నా
  • రోజుకు 10 కోట్లు రానిదే సీఎస్‌ నిద్రపోడు
  • ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • నైనీ కోల్‌ బ్లాక్‌లో 30-40 వేల కోట్ల స్కాం
  • కాంగ్రెస్‌ గెలుపు కోసం ఐక్యంగా పని చేస్తున్నాం..
  • తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు
  • కవిత ఇల్లు 500 కోట్లు.. కేటీఆర్‌ ఇళ్లు ఒక్కోటి వెయ్యి కోట్లు
  • ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఒడిసాలోని నైనీ కోల్‌ బ్లాక్‌ను కేంద్రం సింగరేణికి కేటాయించింది. అక్కడ మనం మైనింగ్‌ అభివృద్ధి కోసం టెండర్లు పిలిచాం. టెండర్‌ పిలిచేటపుడు ప్రీ బిడ్‌ సమావేశంలో జాయింట్‌ వెంచర్‌కు అనుమతి లేదని మొదటి షరతు పెట్టారు. మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కంపెనీల వారే అర్హులని రెండో షరతు పెట్టారు. అప్పుడు అదానీ, ఆంబే, ఎస్‌ఎల్‌ కంపెనీలు తప్ప ఎవరూ లేరు. ఈ ముగ్గురిలో అదానీకి వచ్చేలా చూసేందుకు కేసీఆర్‌, సింగరేణి సీఎండీ అప్పటికే నిర్ణయించారు. పేరుకే అదానీకి టెండర్‌ దక్కుతుంది. అందులో ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్ట్‌నర్‌గా ప్రతిమా ఇన్‌ఫ్రా(కేసీఆర్‌ బావ/బావమరిది) చేరుతున్నారు. అసలు ఆ టెండరే చెల్లదు. ఎందుకంటే సీఎండీగా శ్రీధర్‌కు ఎనిమిదో ఏడాది కొనసాగేందుకు అర్హత లేదు. ఇది పెద్ద స్కాం. 30-40 వేల కోట్లు ఉంటుంది. ఈ కుంభకోణం ఎన్డీఏ కొంపముంచుతుందని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను ప్రధానికి, బొగ్గు శాఖ మంత్రికి వివరించాను. నేను, రేవంత్‌ కలిసి బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిశాం. సుప్రీంలో పిల్‌ వేయడానికి న్యాయవాదిని మాట్లాడాం. సీజేఐ జస్టిస్‌ రమణకూ లేఖ రాశాం.


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో ఫైర్‌ బ్రాండ్‌ నాయకుడు. పార్టీ సీనియర్‌ నేతగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా చురుకుగా పనిచేసిన ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం భువనగిరి నుంచి ఎంపీగా ఉన్న వెంకట్‌రెడ్డి పార్లమెంటులోనూ వివిధ సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ స్కాంలపై ఇటీవల ప్రధానికి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల అవినీతి చిట్టాను ఆధారాలతో సహా కేంద్రానికి సమర్పించానని చెబుతున్న వెంకట్‌రెడ్డి.. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి వివిధ అంశాలను ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో పంచుకున్నారు..


ఆర్కే:నమస్తే వెంకట్‌రెడ్డి గారూ.. ఏంటీమధ్య హుషారుగా ఉంటున్నారు?

వెంకట్‌రెడ్డి: నమస్తే అండీ.. ఎన్నికలు దగ్గరకొచ్చాయి కాబట్టి మా కార్యకలాపాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని ఎలా కాపాడాలనే విషయంలో కొంచెం యాక్టివ్‌ అయిపోయాం. రోజూ గ్రామాల్లో తిరుగుతున్నాం.


కాంగ్రెస్‌ అంటేనే అసమ్మతి వాదులు. అదే పార్టీకి వీక్‌ పాయింట్‌ కదా?

మొన్న 35 మంది రాష్ట్ర నేతలు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యాక చాలా స్పష్టత వచ్చింది. ఎవరూ పార్టీ లైన్‌ దాటొద్దని, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు గురించి రాహుల్‌ అందరితో చర్చించారు. మేం ఇప్పుడు అసమ్మతిని పక్కనపెట్టి ఐక్యంగా పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తున్నాం. 


విడిపోవడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని అనుకుంటున్నారా..?

కేసీఆర్‌ 14 మందితో వెళ్లి సోనియాను కలిసి తన పార్టీని విలీనం చేస్తున్నానని చెప్పారు. తర్వాత దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారు. తెలంగాణలో మేం ఓడిపోయినా బాధపడలేదు. కానీ రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారు. 9 ఏళ్లుగా పేదవానికి ఒక ఇల్లు కట్టలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తేశారు. ఆరేడు వేల బడులు మూసేశారు. ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేశారు. 


తెలంగాణలో కాంగ్రెస్‌ ఎందుకు వెనకబడింది..? 

2018లో మాకు 21 సీట్లు వచ్చినా సగటున 25-26 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ ఒక సీటు గెలిచి, 105 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. ఈ ఏడేళ్లలో కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింది. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రాజెక్టు, రాష్ట్రానికి రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అని చెప్పి మొండి చేయి చూపింది.  


2018లో మీరు ఎలా ఓడిపోయారు..?

నేను వరుసగా నాలుగుసార్లు గెలిచా. 20 ఏళ్లు నిస్వార్థ సేవ చేశా. ఐదోసారి ఓడిపోయే చాన్సే లేదు. రైతు బంధు విషయంలో సీఈసీ రజత్‌ కుమార్‌ కేసీఆర్‌ చేతిలోకి వెళ్లిపోయారు. ఎన్నికల ముందు పొద్దున్నే ప్రభుత్వం రైతు ల అకౌంట్‌లో రైతు బంధు వేసింది. కొంత మంది పెద్ద రైతుల ఖాతాల్లో 3 లక్షలు జమయ్యాయి. 20 ఎకరాల రైతుకు కూడా పంట అమ్మితే నికరంగా అంత మిగలదు. 


కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. అభ్యర్థి గెలిచాక టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోతాడేమోనని ప్రజలు అనుకుంటున్నారు కదా..?

మేం ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ వద్ద చర్చించాం. ఈసారి ఎవరైనా పార్టీ మారితే ఏం చేయాలో మా కార్యకర్తలకు చాలా స్పష్టంగా చెప్పాం.


మీ సోదరుడు రాజగోపాల్‌ పార్టీ మారతాడని వార్తలొస్తున్నాయి కదా..?

ఆయన సీఎల్పీ నేత హోదా కోసం ప్రయత్నించారు. ఆ హోదాలో పార్టీ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచుతానని అనుకున్నారు. అలా కొంత అసంతృప్తి. ఎన్నికల సమయంలో కుంతియా వ్యవహారం చూసి చాలా బాధపడ్డారు. మొన్ననే రాజగోపాల్‌ రెడ్డి.. సోనియా గాంధీని కలిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ వదిలి వెళ్లడం లేదని అనుకుంటున్నా.


కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీలో ఉంటారా..? ఉండరా..? 

నేను యూత్‌ కాంగ్రెస్‌ నుంచి ప్రజలు, పార్టీతో మమేకమయ్యాను కాబట్టి కాంగ్రె్‌సను వదిలిపెట్టలేను. నేను ఆ విషయం చాలాసార్లు చెప్పాను. మా తమ్ముడి వ్యక్తిగత అభిప్రాయంపై నేనెప్పుడూ చర్చించలేదు. 


దళితుల్లో ఎక్కువ మంది ప్రవీణ్‌ కుమార్‌తో నడుస్తున్నారు కదా..?

ఆయన నల్లగొండలో తొలి మీటింగ్‌ పెడితే పైసా ఇవ్వకున్నా 60-70 వేల మంది వచ్చారు. ఆయనను అంత ఈజీగా తీసేయడానికి వీల్లేదు.


ఏమో.. మీరే బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటారేమో..? 

ప్రవీణ్‌కుమార్‌ ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు పెద్ద నష్టం లేదు. టీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌ పొత్తు ఉండదంటూ మొన్న మాణిక్కం ఠాగూర్‌ అన్న మాట రెండు రోజులు అన్ని చానళ్లలో వచ్చింది. నేను గ్రామాలకు వెళితే కార్యకర్తలు పొత్తు ఉంటుందా..? అని అడుగుతున్నారు. మేం రాహుల్‌ గాంధీని కలిసినపుడు తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పారు. ఠాగూర్‌ అలా అనకుండా ఉంటే బాగుండేది.


కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కౌలు రైతులకు రైతు బంధు ఇస్తారా?

తప్పకుండా. వ్యవసాయం చేసేది 60-70 శాతం కౌలు రైతులే. కేసీఆర్‌ వాళ్లకు రైతు బంధు ఎందుకు ఇవ్వరు..? 

పార్టీపై అసంతృప్తి లేదంటున్నారు.. మీరే కొద్ది రోజుల క్రితం అసలు గాంధీ భవన్‌కు వెళ్లబోనని అన్నారు..? 

నాకు టీపీసీసీ బాధ్యతలు వస్తాయని చాలా మంది సీనియర్‌ నాయకులు మెయిల్‌ పెట్టారు. అహ్మద్‌ పటేల్‌, సోనియా కూడా మాట ఇచ్చారు. జూనియర్‌కు ఇచ్చి, నాకు పదవి రాకపోతే కొంత నిరాశ ఉంటుంది. ముప్పై ఏళ్లు పార్టీలో ఉన్నా. కేసీఆర్‌ ఆహ్వానించినా వెళ్లలేదు. నాకు కాంగ్రెస్‌ మీద కోపం లేదు. కేసీఆర్‌ను ఏవిధంగా గద్దె దింపాలనే కసి పెరిగింది. 


ఇప్పుడు రేవంత్‌ మీరు కలిసిపోయారా..? 

మేం రోజుకు ఐదారుసార్లు ఫోన్‌లో మాట్లాడుకుంటాం. ఢిల్లీలో ఆయన మా ఇంటి పైన ఉంటారు. ఆయన వస్తారు.. నేనూ వాళ్లింటికెళ్లి కూర్చుంటా. మాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రయోజనాలే ప్రధానం. అందుకే మొన్న ప్రధానిని కలిసినపుడు సింగరేణిలో జరుగుతున్న పెద్ద స్కాం గురించి వివరించా.


మీరు ప్రధానిని కలిశాక.. మీ సోదరుడు బీజేపీలో చేరతాడనే వార్తలు వచ్చాయి కదా..?

నేను ప్రధానిని కలిసింది హైదరాబాద్‌-విజయవాడ రోడ్డు సమస్య మీద చర్చించడానికి. అదే సమయంలో తెలంగాణలో జరిగే అవినీతి మీద ఆయన నన్ను అడిగారు. కొన్ని విషయాలు చెప్పాను. కేసీఆర్‌ చరిత్ర మొత్తం వాళ్ల దగ్గర ఉంది. సరైన సమయంలో చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నా. 


సింగరేణి సీఎండీ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు

దీనిపై బొగ్గు శాఖ మంత్రి సీరియస్‌ అయ్యారు. సీఎండీపై చెప్పలేని భాష వాడారు. తమ అనుమతి లేకున్నా ఎలా కొనసాగుతారని మండిపడ్డారు. 


మీకు కూడా కేసీఆర్‌ను జైలుకు పంపాలని ఉందా..?

అవినీతిని ఆపాలి. తప్పు తేలితే ఎవరైనా జైలుకు పోవాలి. ఎంతో మంది ఐఏఎ్‌సలు వెళ్లారు. కొంత మంది ఐఏఎ్‌సలు కూడా అలా తయారయ్యారు. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ రోజుకు రూ.10 కోట్ల నగదు లేనిదే నిద్రపోడు. ఆయనే సీసీఎల్‌ఏ, రెవెన్యూ కార్యదర్శి.. ఎక్సైజ్‌ ప్రత్యేక కార్యదర్శి ఆయనే, స్పోర్ట్స్‌ అండ్‌ వీసీ ఎండీ ఆయనే, రెరా కమిషనర్‌ ఆయనే.


రేవంత్‌, మీరు కలిసి తెలంగాణలో కాంగ్రెస్‌ దశ మారుస్తారా..?

తప్పకుండా. ఈ ప్రభుత్వం చేసే అన్ని స్కాంలపై దృష్టి పెడుతున్నాం. ఎమ్మెల్సీ కవిత ఇల్లు రూ.500 కోట్లు ఉంటుంది. మంత్రి కేటీఆర్‌ జూబ్లీహిల్స్‌, నందిహిల్స్‌లో కట్టే ఒక్కో ఇల్లు రూ.1,000 కోట్లు ఉంటుంది. ఇవన్నీ ప్రజలకు వివరిస్తాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సంబంధించి రూ.లక్ష కోట్ల స్కాంలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. అవన్నీ ఢిల్లీలో ఇచ్చాను. విచారణను ఎవరు ఆపుతున్నారో తెలియడం లేదు. 


టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు 

ధాన్యం విషయంలో కేసీఆర్‌ చాలా ఫెయిలయ్యారు. టీఆర్‌ఎస్‌, కేంద్రం ఫైటింగ్‌ ఉత్త నాటకం. దేశంలోని పలువురు రాజకీయ నాయకులపై పదేళ్ల కిందట నమోదైన చిన్న చిన్న కేసులను కూడా మోదీ తవ్వుతున్నారు. ఇక్కడ కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది. రూ.వెయ్యి కోట్ల మోటార్లు తెచ్చి రూ.4 వేల కోట్ల బిల్లు తెచ్చినపుడు కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదు. మొన్న ప్రధానిని కలిసినపుడు కూడా దీనిపై చర్చించా. మొత్తంమీద కేసీఆర్‌ బీజేపీతో కలిసి వెళతారని మేమనుకుంటున్నాం. ఆయన కాంగ్రెస్‌తో రాడు.


దళితులకు ఏం చేశారు

కేసీఆర్‌ దళిత ముఖ్యమంత్రి అంటే దళితులు ఓటేశారు. పోయినసారి మాలలకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఈసారి రాష్ట్రంలో 16 శాతం ఉన్న మాదిగలకు మంత్రి లేడు. అంత పెద్ద సామాజిక వర్గాన్ని వదిలిపెట్టి రెడ్డిలకు 7 మంత్రి పదవులు.. స్పీకర్‌, మండలి చైర్మన్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు కేటీఆర్‌, హరీశ్‌, దయాకర్‌రావు నలుగురూ వెలమ సామాజిక వర్గం. దళిత బంధు పేరుతో ఇంటికి రూ.10 లక్షలు కాదు.. రూ.కోటి ఇచ్చినా దళితులు ఓట్లు వేయరు. 

Updated Date - 2022-04-25T09:34:01+05:30 IST