ఆ దృశ్యం అత్తగారు చూడకూడదని TV స్విచాఫ్

ABN , First Publish Date - 2021-12-09T22:23:22+05:30 IST

ప్రమాదం గురించి తెలియకూడదని మా అమ్మ గదిలో టీవీని స్విచాఫ్ చేశాం

ఆ దృశ్యం అత్తగారు చూడకూడదని TV స్విచాఫ్

న్యూఢిల్లీ : ‘‘ప్రమాదం గురించి తెలియకూడదని మా అమ్మ గదిలో టీవీని స్విచాఫ్ చేశాం’’ అని జనరల్ బిపిన్ రావత్ బావ మరిది యశ్వర్ధన్ సింగ్ చెప్పారు. ఆమెకు తన కుమార్తె, అల్లుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలియకూడదని తాము ఎంతగా ప్రయత్నించినా, ఆమె ఏదో విధంగా తెలుసుకోగలిగారని తెలిపారు. తమ కుటుంబ సభ్యులందరితోనూ జనరల్ రావత్ చాలా సంతోషంగా గడిపేవారన్నారు. 


జనరల్ రావత్ సతీమణి మధులిక మధ్య ప్రదేశ్‌లోని సుహాగ్‌పూర్ రాజవంశీకురాలు. ఆమె తండ్రి కున్వర్ మృగేంద్ర సింగ్ 1967, 1972లలో ఎమ్మెల్యేగా గెలిచారు. బిపిన్, మధులికల వివాహం 1986లో జరిగింది. మధులిక తమ్ముడు యశ్వర్ధన్. 


తమిళనాడులోని కూనూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లు, ఆ హెలికాప్టర్లో బిపిన్, మధులిక ప్రయాణిస్తున్నట్లు తన తల్లి ప్రభ సింగ్ (82)కు తెలియకూడదని తాము చాలా ప్రయత్నం చేశామని యశ్వర్ధన్ చెప్పారు. అయితే ఆమె ఏదో విధంగా తెలుసుకోగలిగారన్నారు. భోపాల్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని షహడోల్‌కు తరచూ బిపిన్ రావత్ వచ్చేవారని, తమ కుటుంబంతో చాలా సంతోషంగా గడిపేవారని తెలిపారు. 2012లో తమ ఇంటికి వచ్చి, చాలా సంతోషంగా గడిపారని చెప్పారు. 


ప్రభ సింగ్‌తో జనరల్ రావత్ చాలా ఆత్మీయంగా వ్యవహరించేవారు. ఈ విషయాన్నే తలచుకుని యశ్వర్ధన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన సోదరి, తన బావ గారితో కలిసి అధికారిక కార్యకలాపాల సమయంలో వెళ్ళేవారు కాదని చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అందుకే ఈ విషయాన్ని తన తల్లికి తెలియనివ్వకుండా జాగ్రత్త తీసుకున్నామన్నారు. 


బుధవారం సాయంత్రం సైనికాధికారులు తమ ఇంటికి చేరుకుని, సమాచారం అందించారని, తన తల్లి గురువారం న్యూఢిల్లీకి బయల్దేరే అవకాశం ఉందని చెప్పారు. 


జనరల్ రావత్, ఆయన సతీమణి మధులికల పార్దివ దేహాలను న్యూఢిల్లీలోని నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 


Updated Date - 2021-12-09T22:23:22+05:30 IST